ప్రసాద్ చేసిన తప్పేంటి ? ‘ఈనాడు’లో కొందరు పెట్టుబడులు పెడితే తప్పుకాదుగానీ,చంద్రబాబునాయుడు కృష్ణపట్నం పోర్టు ఇస్తే తప్పు కాదు.. కాకినాడ పోర్టు ఇచ్చినప్పుడు తప్పు కాదు.. గంగవరం పోర్టు ఇచ్చినప్పుడు కూడా తప్పు కాదు..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రసాద్ చేసిన తప్పేంటి ? ‘ఈనాడు’లో కొందరు పెట్టుబడులు పెడితే తప్పుకాదుగానీ,చంద్రబాబునాయుడు కృష్ణపట్నం పోర్టు ఇస్తే తప్పు కాదు.. కాకినాడ పోర్టు ఇచ్చినప్పుడు తప్పు కాదు.. గంగవరం పోర్టు ఇచ్చినప్పుడు కూడా తప్పు కాదు..!

ప్రసాద్ చేసిన తప్పేంటి ? ‘ఈనాడు’లో కొందరు పెట్టుబడులు పెడితే తప్పుకాదుగానీ,చంద్రబాబునాయుడు కృష్ణపట్నం పోర్టు ఇస్తే తప్పు కాదు.. కాకినాడ పోర్టు ఇచ్చినప్పుడు తప్పు కాదు.. గంగవరం పోర్టు ఇచ్చినప్పుడు కూడా తప్పు కాదు..!

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012


కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన చేసిన తప్పేమిటని ప్రభుత్వాన్ని, సీబీఐని నిలదీశారు. ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టడమే తప్పా అని ప్రశ్నించారు. ‘ఈనాడు’లో కొందరు పెట్టుబడులు పెడితే తప్పుకాదుగానీ.. ‘సాక్షి’లో ప్రసాద్ పెట్టుబడులు పెడితే తప్పా అంటూ ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో జగన్ పర్యటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డితో కలిసి ఆళ్లగడ్డలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం చాగలమర్రి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. 

సాక్షిలో పెట్టుబడులు పెట్టినందుకే ప్రసాద్‌ను బజారుకీడ్చారు...నిమ్మగడ్డ ప్రసాద్‌గారిని అరెస్టు చేశారని చదివా. చాలా బాధనిపించింది. ఆయన చేసిన తప్పేంటో నాకైతే అర్థం కాలేదు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో వాడరేవు ప్రాజెక్టు కట్టాలని నాటి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుకుంది. దీన్ని రస్ అల్ ఖైమా ప్రభుత్వానికి అప్పగిస్తే.. వాళ్లు తర్వాత యాదృచ్ఛికంగా ప్రసాద్‌గారిని ఒక పార్ట్‌నర్‌గా చేర్చుకున్నారు. ప్రసాద్‌గారు చేసిన తప్పు అంతే. కానీ, చంద్రబాబునాయుడు కృష్ణపట్నం పోర్టు ఇస్తే తప్పు కాదు.. కాకినాడ పోర్టు ఇచ్చినప్పుడు తప్పు కాదు.. గంగవరం పోర్టు ఇచ్చినప్పుడు కూడా తప్పు కాదు..!

హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.4 కోట్లు పలికే భూమిని ఎమ్మార్ అనే సంస్థకు.. శనక్కాయలు అమ్మినట్లుగా ఎకరా రూ.29 లక్షలకే 535 ఎకరాలు కట్టబెట్టినా తప్పు కాదు. ఇవేవీ సీబీఐకి కనిపించవు. అటువైపు కన్నెత్తి కూడా చూడదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదజల్లడం ఒక్కటే ప్రభుత్వం, సీబీఐ లక్ష్యం. ఈ సీబీఐకి, ప్రభుత్వ పెద్దలకు ఒక్కటే చెప్పదల్చుకున్నా.. మీకు నచ్చకపోతే ఆ ప్రాజెక్టును రద్దు చేయండి... మీ బుద్ధి పుట్టినవారికి ఇవ్వండి.. అంతేగానీ వారిపై ఎందుకు బురదజల్లుతారు? వాళ్లంతా పెద్దపెద్ద కుటుంబాల వారు. వారి గురించి రోజూ పేపర్‌లో రాస్తారు.. రోజూ బురదజల్లుతారు. వాళ్లు చేసిన తప్పేంటి? ఇదే ప్రసాద్‌గారు ‘మా’ టీవీలో పెట్టుబడులు పెట్టారు. అలాగే ‘సాక్షి’లో కూడా పెట్టుబడులు పెట్టారు. అంతే.. అంతకుమించి ఆయన ఏం తప్పు చేశారు? సాక్షిలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి ప్రసాద్‌గారిని బజారు కీడుస్తున్నారు.. పరువు తీస్తున్నారు. ఆయన సాక్షిలో పెట్టుబడులు పెట్టడం తప్పా.. అని నేను అడుగుతున్నా. ‘ఈనాడు’లో కొందరు పెట్టుబడులు పెడితే తప్పు కాదుగానీ ‘సాక్షి’లో ప్రసాద్ పెట్టుబడులు పెడితే మాత్రం తప్పా?’’

రైతన్నలను పట్టించుకునే నాథుడేడి?
రాష్ట్రంలో రైతన్నల కన్నీళ్లు తుడిచే నాయకులే కరువయ్యారు. రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించడం లేదు. గిట్టుబాటు ధర లేక కర్నూలులో మిర్చి రైతులు పంటకు నిప్పు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.137 ఇస్తున్నామని చెబుతూనే.. వారికి క్యూబిక్ మీటర్‌కు ఇంత అని పనులు చేయించుకుంటున్నారు. దీంతో వారికి రూ.60 నుంచి రూ.70 కూడా గిట్టడం లేదు. పేదరికం పోవాలంటే ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా డాక్టర్, ఇంజినీరింగ్‌లాంటి ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో దివంగత నేత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పెడితే.. దాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. 

ఈ రోజు చదువుకునే ఏ పిల్లాడిని అడిగినా... ‘అన్నా నేను కాలేజీకైతే పోతున్నాను. కానీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫీజు కడుతుందో కట్టదో అనే భయంతోనే చదువుతున్నానన్నా...’ అని చెబుతున్నాడు. వారి బాధలు వింటుంటే చాలా బాధనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఓ పథకం ప్రకారం నాశనం చేస్తున్నారు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు సంజీవని లాంటి కాక్లియర్ ఇన్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌ను మహానేత హయాంలో 12 ఏళ్ల వయస్సున్న పిల్లలకు కూడా ఉచితంగా చేయిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని రెండేళ్లలోపు పిల్లలకు మాత్రమే వర్తింపజేస్తోంది. 

రెండేళ్లలోపు తమ పిల్లలకు చెవుడు, మూగ ఉందని గుర్తించకపోతే ఆ చిన్నారులు ఇక జీవితాంతం అలాగే గడపాల్సిందేనా? పాలక, ప్రతిపక్ష నేతలు పేదలను, రైతన్నలను గాలికొదిలేయడం వల్లే... 17 మంది ఎమ్మెల్యేలు నిజాయతీతో కూడిన రాజకీయాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే పదవులు పోతాయని తెలిసినా.. తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో.. అధికార పక్షం డబ్బు మూటలు తెచ్చి కుమ్మరిస్తుందని తెలిసినా రైతన్నలు, పేదవాళ్ల పక్షాన నిలిచారు. ఆ ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నా. జూన్ 12న జరగనున్న ఉప ఎన్నికల్లో వారిని ఆశీర్వదించండి. మీ ఓటుతో ఈ పాలకుల కళ్లు తెరిపించండి.. కుళ్లు రాజకీయాలను కడిగేయండి. ఈ మహాసంగ్రామంలో మీరు వేసే ప్రతి ఓటూ మార్పుకు నాంది పలకాలి.

బాబు, కాంగ్రెస్ పెద్దలు ఒక్కటై..
చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు కలిసికట్టుగా ఒక్కటై రాజకీయాలు చేస్తున్నారు. ఇద్దరు కలుస్తారు.. ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్తారు. దివంగత వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవులను, ఆర్టీఐ కమిషనర్ల పదవులను చెరి సగం పంచుకుంటున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆయనకు సన్నిహితుడైన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున అమీర్‌పేటలో 5 ఎకరాల స్థలాన్ని ధారాదత్తం చేస్తారు. సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 కుట్రపన్ని సాక్షి పత్రిక, టీవీలను మూయించే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి లేకుంటే ఈనాడు రాసిందే రాత..ఆంధ్రజ్యోతి గీసిందే గీత.. టీవీ-9 చూపిందే నిజమన్నట్లు ప్రజలను నమ్మించవచ్చని ఈ కుట్రలు పన్నుతున్నారు.
Share this article :

0 comments: