జగన్ అరెస్టు చెల్లదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్టు చెల్లదు

జగన్ అరెస్టు చెల్లదు

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012



* అరెస్టు సీఆర్పీసీ నిబంధనలకు, సుప్రీం తీర్పులకు విరుద్ధం
*తక్షణం విడుదల చేసేలా ఆదేశించండి
* విచారణ పూర్తయ్యేదాకా కస్టడీ వద్దంటూ ఉత్తర్వులివ్వండి
* దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఒక్కసారైనా పిలవలేదు
* సాక్ష్యాలను తారుమారు చేస్తారన్నది సీబీఐ ఆరోపణ మాత్రమే
* ఆరోపణ ఆధారంగా అరెస్టు చెల్లదు
* తారుమారు చేసే ఆస్కారముందని మాత్రమే సీబీఐ అంటోంది
* ఇలాంటి వాటి ఆధారంగా రిమాండ్ విధించడం సరికాదు
* హైకోర్టుకు నివేదించిన భారతీరెడ్డి..
* నేడు విచారణ


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన అరెస్టును సవాలు చేస్తూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ రిమాండ్‌లో ఉండటంతో ఆయన తరఫున సతీమణి వైఎస్ భారతీ రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తన అరెస్టు సీఆర్పీసీ నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషన్‌లో ఆయన కోరారు. అందువల్ల తన అరెస్టును రద్దు చేసి, వెంటనే తనను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అరెస్టునే గాక, తదుపరి చర్యలన్నింటినీ చట్ట విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో విచారణ పూర్తయ్యే వరకూ తనను కస్టడీ నుంచి విడుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ ఈ వ్యాజ్యాన్ని గురువారం మధ్యాహ్నం విచారించనున్నారు.

కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా..
‘‘హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో 2011 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అప్పటి నుంచి తాజాగా మే 22 దాకా జగన్‌కు సీబీఐ ఒక్కసారి కూడా నోటీసు జారీ చేయలేదు. విచారణకు పిలిపించలేదు. దర్యాప్తు పూర్తయిందని పేర్కొంటూ 2012 మార్చి 31న సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో జగన్‌పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. అందులో వారు చెప్పిన నేరాలేవీ ఆయన చేయలేదు. ఏప్రిల్ 23న రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. తొలి చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు ఏప్రిల్ 27న విచారణకు స్వీకరించింది. మే 28న తన ముందు హాజరు కావాలంటూ జగన్‌కు సమన్లు జారీ చేసింది.

కానీ అంతలోపే, మే 25న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ హఠాత్తుగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ దాఖలు నుంచి మే 22 దాకా జగన్‌కు సీబీఐ ఒక్కసారి కూడా ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. వారి నోటీసులకు అనుగుణంగా జగన్ మే 25న సీబీఐ ముందు హాజరయ్యారు. 25, 26, 27 తేదీల్లో రోజుకు 10 గంటల చొప్పున దాదాపు 30 గంటలకు పైగా సీబీఐ ఆయనను ప్రశ్నించింది. 27వ తేదీ రాత్రి అరెస్టు చేసింది. దర్యాప్తులో జగన్ జోక్యం చేసుకుని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని అరెస్టు మెమోలో పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికలు సమర్పించింది. నాటి నుంచి నేటిదాకా జగన్ ఎన్నడూ దర్యాప్తులో జోక్యం చేసుకోలేదు. అలా చేసుకున్నారని గానీ, సాక్షులను ప్రభావితం చేశారని గానీ, సాక్ష్యాలను తారుమారు చేశారని గానీ సీబీఐ ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు కూడా. వాస్తవానికి దర్యాప్తు జరుగుతున్న ప్రాంతానికి జగన్ చాలా దూరంగా, ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకంటూ, సెక్షన్ 41 (ఏ) కింద సీబీఐ నోటీసు జారీ చేసినప్పుడే, అందులో రాజకీయ దురుద్దేశాలున్నాయని జగన్ భావించారు.

తన రాజకీయ భావాలను ప్రజలతో పంచుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ముందే ఊహించారు. ఇదంతా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకేనని అర్థం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక విచారణకు వస్తానని ఆయన చెప్పినా సీబీఐ వినలేదు. ఈ నోటీసులపై కింది కోర్టులో ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసినప్పుడు, ‘కోర్టు సమన్లు జారీ చేసినందున అరెస్టు ఉండబోదు’ అని కింది కోర్టు స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ , కింది కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా సీబీఐ అధికారులు మే 27 రాత్రి జగన్‌ను అరెస్టు చేశారు.

ఈ అరెస్టు చట్ట విరుద్ధమే గాక సుప్రీంకోర్టు తీర్పులకు కూడా విరుద్ధం. జగన్ ఎంపీగా తనకున్న హోదాతో సాక్ష్యాలను తారుమారు చేయొచ్చన్న సీబీఐ వాదన ఏమాత్రం సరైంది కాదు. ఈ కారణంతో ఒక వ్యక్తిని అరెస్టు చేయడం చెల్లదు. ఒక వ్యక్తిని అతని సామాజిక హోదా కారణంగా అరెస్టు చేయడం చెల్లదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. జగన్ తన పదవీ కాలం పూర్తయ్యే దాకా ఎంపీగా కొనసాగుతారు. అలాంటి కారణంతో అరెస్టు చేయడం అధికార దుర్వినియోగమే. సీబీఐ నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేస్తారని కేవలం ఆరోపిస్తే చాలదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.

పస్తుత కేసులో సాక్ష్యాలను జగన్ తారుమారు చేశారని సీబీఐ ఒక్క ఆరోపణ కూడా చేయలేదు. కేవలం తారుమారు చేసే అవకాశం ఉందని మాత్రమే అంటోంది. కేవలం ఇలాంటి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయడం చట్ట విరుద్ధం. ఇలా జగన్‌ను సీబీఐ అధికారులు అక్రమంగా అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దాని ఆరోపణల ఆధారంగానే జగన్‌కు కోర్టు రిమాండ్ విధించింది. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ, జగన్ అరెస్టును చట్ట విరుద్ధంగా ప్రకటించండి. ఆయనను వెంటనే విడుదల చేయండి’ అని హైకోర్టును భారతీరెడ్డి కోరారు.
Share this article :

0 comments: