జగన్, సీబీఐ పిటిషన్లపై నేడు విచారణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్, సీబీఐ పిటిషన్లపై నేడు విచారణ

జగన్, సీబీఐ పిటిషన్లపై నేడు విచారణ

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012* సీబీఐ పిటిషన్లను ముందు పరిష్కరిస్తే మాకు నష్టం
* అందుకే అందరి వాదనలూ విని ఉత్తర్వులు ఇవ్వండి
* హైకోర్టుకు జగన్ న్యాయవాది విన్నపం

హైదరాబాద్, న్యూస్‌లైన్: తనను రిమాండ్‌కు పంపుతూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తన విచారణను గురువారానికి వాయిదా వేసింది. అదే విధంగా జగన్‌మోహన్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలనే అభ్యర్థనను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను, జగన్‌ను సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లను కూడా గురువారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. జగన్‌తో పాటు సీబీఐ దాఖలు చేసిన మూడు పిటిషన్లను బుధవారం మధ్యాహ్నం న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ విచారించారు.

జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ అక్రమంగా జగన్‌ను అరెస్ట్ చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసి కోర్టు ముందు హాజరు కావాలని జగన్‌ను ఆదేశించిన తరువాత కూడా, సీబీఐ అరెస్ట్‌కు పాల్పడిందని ఆయ న వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేసిందని, చార్జిషీట్లు దాఖలు చేసిన తరువాత అరెస్ట్ చేయడం ఏమిటో అర్థం కాకుండా ఉందని తెలిపారు. ఎంపీ హోదాలో జగన్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ ఆరోపించిందని, దీని ప్రకారం కోర్టు జగన్‌ను రిమాండ్‌కు పంపిందన్నారు. సీబీఐది కేవలం ఆందోళనే తప్ప, మరొకటి కాదని, ఆరోపణల ఆధారంగా అరెస్ట్ చేయడం చెల్లదని సుప్రీంకోర్టు ఇప్పటికే పలు తీర్పుల్లో చెప్పిందని వివరించారు.

ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. మీరు ఈ కేసు లోతుల్లోకి వెళుతున్నారా..? అని పద్మనాభరెడ్డిని ప్రశ్నించారు. బుధవారం తాను సూచించిన ప్రత్యామ్నాయం గురించి ఏం ఆలోచించారని కూడా ప్రశ్నించారు. జగన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి పంపే విషయంలో తమకు అభ్యంతరాలు లేవని, ఇదే సమయంలో సీబీఐకీ అభ్యంతరాలు లేకపోతే, కేసు లోతుల్లోకి వెళ్లమని, లేని పక్షంలో తాము కేసు లోతుల్లోకి వెళ్లడం మినహా చేయగలిగింది ఏమీ లేదని ఆయన సమాధానమిచ్చారు.

ముందు సీబీఐ పిటిషన్లు విచారించి ఉత్తర్వులు ఇస్తే తమకు నష్టం జరుగుతుందని, అందువల్ల అందరి వాదనలు విన్న తరువాత ఉత్తర్వులు జారీ చేయాలని పద్మనాభరెడ్డి సూచించారు. అయితే తమ పిటిషన్లు విచారించాలంటే ప్రతివాదిగా ఉన్న జగన్‌కు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు, జగన్‌కు వ్యక్తిగతంగా నోటీసులు అందచేయాలని తెలిపింది. ఈ మూడు పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం విచారణ జరుపుతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: