టీడీపీ హయాంలోనే పోర్టు, కారిడార్‌కు ప్రతిపాదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ హయాంలోనే పోర్టు, కారిడార్‌కు ప్రతిపాదన

టీడీపీ హయాంలోనే పోర్టు, కారిడార్‌కు ప్రతిపాదన

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

- టీడీపీ హయాంలోనే పోర్టు, కారిడార్‌కు ప్రతిపాదన 
- నిబంధనల ప్రకారం ఉన్నా అర్థంలేని ఆరోపణలు 
- ఆంధ్ర సీపోర్ట్స్ ఆసక్తి.. తర్వాత విరమణ 
- ఆపై తెరమీదకు స్కోడా.. ప్రభుత్వంతో ఎంఓయూ
- ఎన్నాళ్లకూ పనులు చేపట్టక ఒప్పందం రద్దు 
- వైఎస్ హయాంలో రాక్ ప్రభుత్వానికి అప్పగింత
- 28,000 ఎకరాలడిగితే దాన్ని 18 వేలకే పరిమితం చేసిన వైఎస్
- ఇప్పటిదాకా వాన్‌పిక్‌కు సేకరించింది 13 వేల ఎకరాలు 
- దాన్లో ప్రభుత్వ భూమి కేవలం 200 ఎకరాలు
- మిగతా భూమిని సొంతగా కొన్న వాన్‌పిక్ 
- ఎకరాకు కనిష్ట ధర 1.4 లక్షలు; గరిష్ట ధర 4.5 లక్షలు
- సగటున ఎకరాకు రూ.3.5 లక్షలు ఖర్చుచేసి సేకరణ 
- ప్రభుత్వం నష్టపోవటానికి అవకాశమే లేదు
- అడ్డగోలు వాదనలతో సీబీఐ, ఎల్లో దొరల శివాలు 
- కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు రాసిన రస్ అల్ ఖైమా
- తమ పెట్టుబడులపై రస్ అల్ ఖైమా ఆందోళన 
- కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని అభ్యర్థన 

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) కుట్రలు మితిమీరిపోతున్నాయి. నిబంధనలు గడ్డిపోచలవుతున్నాయి. సర్కారు నిర్ణయాల్లో, ప్రతిపక్షం ‘ప్రతి’ స్పందనలో, ఆధిపత్య మీడియా రాతల్లో... ఆఖరికి దర్యాప్తు సంస్థల చేతల్లో కూడా రాజకీయమే కనిపిస్తోంది తప్ప న్యాయం, ధర్మం మచ్చుకైనా కానరావటం లేదు. వాన్‌పిక్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అనిపించేదొక్కటే!!

* ఈ ప్రాజెక్టును వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించటం తప్పా?
* దీన్ని రస్ అల్ ఖైమా (రాక్) ప్రభుత్వానికి అప్పగించటమే ఆ ప్రభుత్వ నేరమా?
* రాక్ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్‌ను భాగస్వామిగా ఎంచుకోవటం ఘోరమా?

నిజానికి పైవేవీ తప్పుకాదు. కానీ ప్రసాద్ ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టారు. అది మాత్రం కాంగ్రెస్-ఎల్లో దొరల దృష్టిలో క్షమించరాని నేరం. కాబట్టి మిగతావన్నీ నేరాలయి తీరాలంటోంది ఆ ముఠా. వెనకబడిన ప్రకాశం జిల్లాలో పోర్టును, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలనేది ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కాదు. 1999-2000వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడి హయాంలో మొదట ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ఈ ప్రతిపాదన చేసింది. తర్వాత విరమించుకుంది. 

ఇదీ... వాన్‌పిక్ ప్రతిపాదనకు మూలం. ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ విరమించుకున్నాక చెక్ దేశ సంస్థ స్కోడా తెరపైకి వచ్చింది. దాంతో ఎంఓయూ కుదిరి... అది ఎన్నాళ్లయినా చేపట్టక ఒప్పందం రద్దయిపోవటంతో... అప్పుడు వచ్చింది రస్ అల్ ఖైమా. వాడ్రేవు, నిజాంపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ (వాన్‌పిక్) ఏర్పాటు చేస్తామని ఆసక్తి వ్యక్తం చేసింది. దాంతో ఎంఓయూ కుదిరాక... తన భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్ సంస్థను చేర్చుకుంది. 

ప్రభుత్వానికి జరిగిన నష్టమేంటి?
రెండు సీపోర్టులు, ఒక ఎయిర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ కోసం వాన్‌పిక్ సంస్థ 28,000 ఎకరాల్ని అడిగింది కానీ వైఎస్సార్ ప్రభుత్వం వివిధ అధ్యయనాలు చేసి... 18 వేల ఎకరాలు చాలని స్పష్టం చేసింది. ఈ 18 వేల ఎకరాల్లో ఇప్పటిదాకా సేకరించింది 13,000 ఎకరాలే. దీన్లో ప్రభుత్వ భూమి కేవలం 200 ఎకరాలు. మిగతావి అసైన్డ్, పట్టా భూములే. వీటిని కనిష్టంగా ఎకరానికి 1.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 లక్షలు పెట్టి వాన్‌పిక్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు ఖర్చుపెట్టింది. అంటే మొత్తమ్మీద సగటున ఎకరాకు రూ.3.5 లక్షలు ఖర్చుచేసింది. 

ఇలా వాన్‌పిక్ సంస్థ కొనుగోలు చేసినదాంట్లో 6,000 ఎకరాలు ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉంది. ఎందుకంటే అది అసైన్డ్ భూమి కావటంతో వాటిని అసైనీల నుంచి వాన్‌పిక్ సంస్థ కొనుక్కోవటమైతే కొనుక్కుంది కానీ... దానికి ప్రభుత్వం నుంచి పొజిషన్ పొందాల్సి ఉంటుంది. ఆ పొజిషన్‌ను ప్రభుత్వం ఇంకా ఇవ్వని కారణంగా 6,000 ఎకరాల్ని వాన్‌పిక్ కొనుగోలు చేసినా అది ఇప్పటికీ ప్రభుత్వం చేతిలోనే ఉంది. 

మరో ముఖ్యమైన విషయమేంటంటే ఇదేమీ అడ్డంగా లాభాలొచ్చే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి పర్యాటక ప్రాజెక్టు కాదు. నిరంతరం అద్దెలు తెచ్చిపెట్టే హైటెక్ సిటీ కూడా కాదు. రెండు పోర్టులు నిర్మించాలి. ఎయిర్‌పోర్టు తేవాలి. పోర్టులు, ఎయిర్ పోర్టు నిర్మాణమంటే ఆషామాషీ కాదు. నష్టభ యమూ ఎక్కువే. ఇవన్నీ వచ్చాకే పారిశ్రామిక కారిడార్ చేపట్టాలి. ఎందుకంటే అప్పుడే పరిశ్రమలు రావటానికి సుముఖత చూపుతాయి.

మరి ఇంత రిస్కు చేసే ప్రాజెక్టును అప్పగించినందుకు ప్రతిఫలంగా వారు పెట్టుబడులు పెట్టారంటే నమ్మొచ్చా? నిజంగా ప్రసాద్‌కు ప్రభుత్వం మేలు చేయాలనుకుంటే అంత రిస్కు ఉండే ప్రాజెక్టును ఎందుకిస్తుంది? హైదరాబాద్ సమీపంలో ఏ రామోజీ ఫిలిం సిటీలానో, ఏ ఎమ్మార్ మాదిరిగానో, ఏ ఐఎంజీ మాదిరిగానో ప్రాజెక్టు చేపట్టడానికి భూములు కేటాయించి ఉండేదిగా? ఇవన్నీ పక్కనపెట్టినా వారు ప్రతిపాదించిన 28 వేల ఎకరాలూ ఇచ్చి ఉండేదిగా? దాన్ని 18 వేల ఎకరాలకు ఎందుకు పరిమితం చేసింది? ఇవన్నీ సీబీఐకి తెలియటం లేదా? 

పోనీ... వాన్‌పిక్ సంస్థ నేరుగా యజమానుల నుంచి భూములు కొనుగోలు చేసిన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నష్టపోయిందెక్కడ? ప్రభుత్వమేమైనా తన భూమిని కారుచౌకగా కట్టబెట్టేసిందా? ఫ్రీగా ఇచ్చేసిందా? అలాంటిదేమీ లేదే? తమ భూములకు నిర్ణయించిన ధరను స్థానిక రైతులు కూడా ఆమోదించటం వల్లే భూముల కొనుగోలు సాధ్యమైందని అనుకోవద్దా! మరి దీన్లో ప్రభుత్వానికి నష్టం వచ్చిందెక్కడ? మరి దీన్నంతటినీ సీబీఐ ఎందుకు విస్మరిస్తోంది. ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఆరోపిస్తూ... ఆ నష్టానికి వై.ఎస్.రాజశేఖరరెడ్డే కారణమని, అలా చేసినందుకు ప్రతిఫలంగానే ‘సాక్షి’లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడి పెట్టారని చేస్తున్న వాదన ఎంతవరకు సమంజసం? 

రాక్ ప్రభుత్వం ఆందోళన!
నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని ఎమిరేట్స్ ప్రభుత్వం యోచిస్తోంది. సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం చెప్పటంతో పాటు తాము అంత ఖర్చుచేసి చేపట్టిన ప్రాజెక్టుపై అది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూఏఈ వర్గాల్ని ఉటంకిస్తూ ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక మంగళవారం ప్రచురించిన కథనం సారాంశమిది.

దీని ప్రకారం... పాలసీ మార్పులు, అవినీతిపై దర్యాప్తుల కారణంగా ఇటీవల దేశంలో పెట్టుబడి వాతావరణం చాలా దెబ్బతింది. దీంతో పలువురు ఇన్వెస్టర్ల తరఫున విదేశాలు రంగంలోకి దిగుతున్నాయి కూడా. 2జీ కేసులో ఇప్పటికే వొడాఫోన్ తరఫున బ్రిటన్, టెలినార్ తరఫున నార్వే ప్రభుత్వం రంగంలోకి దిగాయి. 

వాన్‌పిక్‌కు సంబంధించి ఇప్పటికే రాకియా రూ.450 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన భాగస్వాములు రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టుకు రూ.16,800 కోట్లు వెచ్చించాలనేది ప్రతిపాదన. ఇంకా రాష్ట్రంలో టైల్స్ ప్రాజెక్టులో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టిన రాకియా... 2 బిలియన్ డాలర్ల విలువైన అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్‌ను విశాఖలోను, 4 బిలియన్ డాలర్ల విలువైన ఎకనమిక్ సిటీని, గుజరాత్‌లో 500 కోట్ల విలువైన సిరామిక్ టైల్స్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. వీటికి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్లు వివిధ దశల్లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రాక్ ప్రభుత్వం వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ఇప్పటికే గతేడాది ఆగస్టు 16న నేరుగా ప్రధానమంత్రికి ఒక లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది. అంతకుముందు 2012 ఏప్రిల్ 12న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా ఒక లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోందని, దాన్ని వేగవంతం చేయడానికి సహకరించాలని అందులో కోరింది. ఇప్పుడు ప్రసాద్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో నేరుగా కేంద్రంపైనే ఒత్తిడి తేవటానికి దిగుతుండటం గమనార్హం.
Share this article :

0 comments: