పత్రికా స్వేచ్ఛను కాపాడండి: గవర్నర్‌కు వినతిపత్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పత్రికా స్వేచ్ఛను కాపాడండి: గవర్నర్‌కు వినతిపత్రం

పత్రికా స్వేచ్ఛను కాపాడండి: గవర్నర్‌కు వినతిపత్రం

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012


సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానల్‌ల బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింప చేయటాన్ని నిరసిస్తూ.. ఈ రెండు మీడియా సంస్థల సంపాదకులతో పాటు పలువురు సీనియర్ పాత్రికేయులు బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ పత్రిక, చానల్‌లను మూసివేయించే లక్ష్యంతోనే సీబీఐ ఈ చర్యలు చేపట్టిందని.. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిని నిలువరించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. వినతిపత్రం పూర్తి పాఠం...

‘‘కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును పరిశోధిస్తున్న సీబీఐ ‘సాక్షి’ పత్రిక, టీవీ చానల్‌కు చెందిన రెండు బ్యాంకు కరెంటు ఖాతాలను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఫ్రీజ్ చేసింది. ఈ రెండు అకౌంట్ల ద్వారానే పత్రిక, టీవీలకు సంబంధించిన రోజువారీ అవసరాలను నిర్వహిస్తుంటారు. దీంతో పాటు ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తారు. సీబీఐ బ్యాంకులకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్న విధంగా అక్రమంగా వచ్చిన డబ్బులు ‘సాక్షి’ మీడియాలో పెట్టుబడులు పెట్టారన్న మాట వాస్తవ దూరమైనది. ‘సాక్షి’ బ్యాంకు ఖాతాలను నిలిపివేయటం పత్రికా స్వేచ్ఛను ఆటంకపరచటమేనని మేం భావిస్తున్నాం. సీబీఐ చేపట్టిన ఈ చర్య స్వతంత్ర భారతంలోనే అసాధారణ చర్య. నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టకూడదని కూడా ఆలోచించకుండా సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం.

‘సాక్షి’ పత్రిక సర్క్యులేషన్ 15 లక్షల కాపీలకు పైగా ఉండగా.. ‘సాక్షి’ టీవీ రెండు, మూడు స్థానాల్లో ఉంది. ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఇవి రెండూ భాగమయ్యాయి. ‘సాక్షి’ మీడియా బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని సీబీఐ తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకున్న సమాచారం తెలుసుకునే ప్రాథమిక హక్కును భంగపరచటమే. ఇది ‘సాక్షి’ మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగులపై మాత్రమే కాదు రాష్ట్రంలోని మీడియా, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి. ‘సాక్షి’ మీడియా గ్రూపుపై 20 వేల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. సీబీఐ తీసుకున్న నిర్ణయం ‘సాక్షి’ ఉద్యోగులతో పాటు రాష్ట్రంలోని ఇతర జర్నలిస్టుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే విధంగా ‘సాక్షి’ని మూయించాలన్న కుట్ర దీని వెనుక దాగి ఉందని ‘సాక్షి’ ఉద్యోగులు భావిస్తున్నారు.

ఈ కేసులో సీబీఐ జరుపుతున్న విచారణలో ‘సాక్షి’ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. యాజమాన్య ఆర్థిక వ్యవహారాల తో ‘సాక్షి’ మీడియాకు లింకు పెట్టి బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన సీబీఐ తీరు సరైంది కాదని మేం భావిస్తున్నాం. ఈ సందర్భంలో జర్నలిస్టు వర్గం పక్షాన, ముఖ్యంగా ‘సాక్షి’ ఉద్యోగుల పక్షాన మీరు నిలవాలని కోరుకుంటున్నాం. మీ విచక్షణను ఉపయోగించి ‘సాక్షి’ బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాల్సిందిగా సీబీఐకి సూచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ చొరవ రాష్ట్రంలోని పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సాయపడుతుందని ఆశిస్తున్నాం.’’

Share this article :

0 comments: