‘సాక్షి’పై కుమ్మక్కు కుట్ర.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’పై కుమ్మక్కు కుట్ర..

‘సాక్షి’పై కుమ్మక్కు కుట్ర..

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012


అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 సిగ్గులేకుండా కలిసిపోయాయి.. కలిసిపోయి వీరంతా ఒక్కటై ‘సాక్షి’ని మూసివేయించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి పత్రిక గానీ.. సాక్షి టీవీగానీ లేకపోతే ‘ఈనాడు’ రాసిందే రాత.. ‘ఆంధ్రజ్యోతి’ గీసిందే గీత.. ‘టీవీ9’ చూపించిందే నిజం అని ప్రజలను నమ్మించొచ్చని వీరంతా ఒక్కటై కుట్ర చేస్తున్నారు. వీరి పన్నాగం ఏంటంటే.. రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట.. అది కాంగ్రెస్, టీడీపీయేనట.. ప్రజలకు కాంగ్రెస్‌పై విసుగు వస్తే చంద్రబాబుకు ఓటేయాలట.. చంద్రబాబుపై విసుగు అనిపిస్తే కాంగ్రెస్‌కు ఓటేయాలట.. మూడో పార్టీగానీ.. మూడో వ్యక్తిగానీ రాష్ట్రంలో ఉండనేకూడదట’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. 

‘‘అయ్యా చంద్రబాబూ.. కాంగ్రెస్ పెద్దలారా.. మీ సిగ్గుమాలిన.. నీచమైన రాజకీయాలను ఎవరూ చూడడం లేదనుకోవద్దు.. దేవుడనేవాడు పైనుంచి చూస్తున్నాడు. దేవుడి ఆశీర్వాద బలంతో వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె ఏకమవుతుంది. అది ఉప్పెనగా మారుతుంది.. ఆ ఉప్పెనలో కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకుపోక తప్పదు’’ అని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా మూడో రోజు గురువారం రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. డీహీరేహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు..

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు. రైతన్నను, పేదవాడిని, విద్యార్థిని.. ఎవరినీ పట్టించుకోవట్లేదు.. కరెంటు లేకున్నా, నీళ్లు రాకున్నా పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎలా తయారయ్యారంటే.. ఎప్పుడూ ఢిల్లీ ఎలా వెళ్లాలి.. సోనియా గాంధీని ఎలా ప్రసన్నం చేసుకోవాలీ అనే ఆలోచిస్తున్నారు. పోనీ ప్రధాన ప్రతిపక్షమైనా తమ తరఫున పోరాడుతుందేమోనని ప్రజలు ఆశగా అటువైపు చూస్తే.. చంద్రబాబు దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో.. కనీవినీ ఎరుగని స్థాయిలో అధికారపక్షంతో కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేసి.. చనిపోయిన వైఎస్‌ను అప్రదిష్టపాలు చేయడానికి కోర్టులకెళ్లి కలిసి కేసులు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో పోటీచేస్తున్నారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను ఇద్దరూ కలిసి చెరి సగం పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు చెందిన జి.ఎన్.నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని స్వయానా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ధారాదత్తం చేశారంటే.. వారి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.

కుమ్మక్కుకు పరాకాష్ట ఈ దర్యాప్తు..

కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఎంతగా కలిసిపోయారో చెప్పేందుకు.. సీబీఐ దర్యాప్తే తగిన ఉదాహరణ. వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని మహానేత వైఎస్ తపించారు. రెండు పెద్ద సంస్థలకు ఆ జిల్లాల్లో చెరో 75 ఎకరాల చొప్పున భూమిని 25 ఏళ్ల లీజుకు ఇచ్చారు. అక్కడ ఎకరం రూ.15 లక్షలు పలికే భూమిని రూ.8 లక్షలకే వైఎస్ లీజుకు ఇచ్చారంటూ సీబీఐ తప్పుపడుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టండి.. ఉద్యోగాలు ఇవ్వండి.. భూమి మేం ఉచితంగానే కేటాయిస్తాం అంటూ అక్కడి ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి.. ఇది మాత్రం సీబీఐకి కన్పించదు. ఇదే సీబీఐ ఎమ్మార్ కేసునూ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఎమ్మార్ అనే సంస్థకు చంద్రబాబు 535 ఎకరాల భూమిని ధారాదత్తం చేసేశారు. అదీ ఏ పరిశ్రమలు పెట్టడానికో.. వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికో కాదు.. గోల్ఫ్ కోర్సులు కట్టడానికట.. విలాసవంతమైన బంగ్లాలు నిర్మించడానికట.. ఫైవ్‌స్టార్ హోటళ్లు కట్టడానికట. ఎకరం రూ.4 కోట్ల విలువైన ఆ భూమిని శనక్కాయల్లా ఎకరం రూ.29 లక్షలకే చంద్రబాబు కట్టబెట్టినా.. అది సీబీఐకి తప్పుగా అన్పించదు. కనీసం చంద్రబాబు వైపు సీబీఐ కన్నెతి కూడా చూడదు. వేలెత్తి కూడా చూపదు.

చేసింది వైఎస్ అయితే.. వీరు చేశామని చెప్పుకొంటున్నారు

ఇవాళ రాయదుర్గం పట్టణంలో ప్రజలకు తాగునీళ్లు అందించిన ఘనత వైఎస్‌దే. రాయదుర్గం పట్టణానికి రూ.50 కోట్లతో హెచ్చెల్సీ నుంచి నీటిని తరలించే పనులను పూర్తిచేస్తే.. వైఎస్ మరణించిన ఆర్నెల్లకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఓ శిలాఫలకం వేసి, ఆ పథకాన్ని తామే పూర్తి చేశామని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. ఇక్కడ తాగునీటి ఎద్దడి ఉండకూడదన్న ఉద్దేశంతో దివంగత నేత రూ.550 కోట్లతో శ్రీరాంరెడ్డి ప్రాజెక్టుకు నాంది పలికారు. రాయదుర్గం సహా నాలుగు నియోజకవర్గాలకు నీటి సరఫరా చేసే ఆ ప్రాజెక్టుకు తన పాలనలోనే రూ.385 కోట్ల దాకా ఖర్చుచేశారు. ఆయన మరణించాక ఇన్నేళ్లలో ఈ ప్రభుత్వం రూ.43 కోట్లను మాత్రమే ఆ ప్రాజెక్టుకు కేటాయించింది. రాయలసీమను.. ప్రధానంగా అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి రూ.6,850 కోట్ల వ్యయంతో వైఎస్ హంద్రీ-నీవా ప్రాజెక్టును చేపట్టారు. ఈ పథకానికి రూ.4,150 కోట్లను ఖర్చు చేశారు. వైఎస్ మరణించి ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం రూ.127 కోట్లను మాత్రమే హంద్రీ-నీవా కోసం ఖర్చు చేసింది.

రూ.1.50కే గార్మెంట్ పరిశ్రమకు కరెంటిస్తాం

గార్మెంట్ పరిశ్రమకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున కరెంటు ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు యూనిట్‌కు రూ.4.50 చొప్పున చార్జి చేస్తున్నారు. వచ్చే సువర్ణయుగంలో రాయదుర్గం ప్రాంతంలోని గార్మెంట్‌ను క్లాసిఫై చేసి.. యూనిట్‌కు రూ.1.50 చొప్పునే కరెంటును అందిస్తాం. గార్మెంట్ కార్మికులను కూడా చేనేతల కింద గుర్తిస్తాం. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు నెలనెలా రూ.వెయ్యి పెన్షన్ ఇచ్చేటట్లుగానే బట్టలు కుట్టే గార్మెంట్ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తాం. రాయదుర్గం మున్సిపాల్టీలో చేనేత, గార్మెంట్ కార్మికుడినే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేస్తాం. హంద్రీ-నీవాను సత్వరమే పూర్తిచేస్తాం.
- వైఎస్ జగన్

రాయదుర్గంలో బ్రహ్మరథం..

రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం డీహీరేహాళ్ మండలం మురడి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి జగన్ మూడోరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. మురడి రోడ్‌షో పూర్తికాగానే గొడిసలపల్లి, ఎం.హనుమాపురం, సంజీవరాయునికోట గ్రామాల ప్రజలు తమ పల్లెలకు రావాల్సిందేనని జగన్‌ను పట్టుబట్టి తీసుకెళ్లారు. ఆ తర్వాత తమ్మేపల్లి, ఆర్‌బీ వంక, టీ.వీరాపురం మీదుగా రోడ్‌షోలు నిర్వహిస్తూ రాయదుర్గం పట్టణానికి జగన్ చేరుకున్నారు. రాయదుర్గం పట్టణ శివార్లలోని చంద్రబాబు కాలనీ నుంచి పాత బస్టాండు వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర ఇసుక వేస్తే రాలనంత స్థాయిలో జనం కిక్కిరిసిపోయారు. గొల్లపల్లి, గలగల, ఆర్.కొత్తపల్లి, కేపీ దొడ్డి, రంగసముద్రం, తాళ్లకెర గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోలకు జనం పోటెత్తారు.
Share this article :

0 comments: