నా బిడ్డను ఏం చేయదల్చుకున్నారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా బిడ్డను ఏం చేయదల్చుకున్నారు?

నా బిడ్డను ఏం చేయదల్చుకున్నారు?

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012



* రెండేళ్లుగా వేధిస్తూ నరకం చూపుతున్నారు
* నా భర్తను లేకుండా చేశారు... నా కొడుకును ఈ సర్కారు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు.. ఓదార్పు యాత్ర చేయడం, ప్రజలు ఆదరించడమే జగన్ చేసిన తప్పా?
* నన్నూ, నా కోడల్ని, కూతుర్ని వీధుల్లో నిలబెట్టారు
* సోనియాగాంధీ చెప్పినట్టు వినకపోవడమే నేరమా?
* నీ కొడుకును ప్రధానిని చేయాలని నా భర్త చెబితే... నువ్వు నా కొడుకును అరెస్టు చేయిస్తావా?
* ప్రజలే న్యాయ నిర్ణేతలు.. పైన దేవుడు కూడా చూస్తున్నాడు
* వారే జగన్ భవిష్యత్తును నిర్ణయిస్తారు
* 18 స్థానాల్లో గెలుపుతో కాంగ్రెస్ పెద్దలకు కనువిప్పు కలిగించాలి
* నిరసన శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉదయమనగా వెళ్లాడు.. గత రెండురోజులుగా వచ్చినట్టే కొడుకు వస్తాడనుకుంటే.. రాత్రి ఏడు గంటలు దాటుతున్నా ఇంటికి తిరిగిరాలేదు. ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ఆదివారం సీబీఐ విచారణ కొనసాగుతున్న దిల్‌కుశ అతిథిగృహానికి బయలుదేరారు. కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్‌కుమార్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఆమె వెంట ఉన్నారు. 7.15 గంటల సమయంలో లోపలికి వెళ్లగానే జగన్‌ను అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు. కుమారుణ్ణి చూసిన విజయమ్మ కన్న పేగు కదిలిపోయింది. కొద్దిసేపటి తర్వాత జగన్ కుటుంబసభ్యులంతా బరువెక్కిన హృదయాలతో దిల్‌కుశ నుంచి బయటకు వచ్చారు.

అతిధిగృహం ప్రధాన గేటు వద్ద వేచి ఉన్న మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైన విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. మాటలు కూడదీసుకుంటూ.. రెండున్నరేళ్లుగా నరకం చూపుతూ.. తన బిడ్డను ఏం చేయదల్చుకున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పుయాత్ర చేయడమే తన బిడ్డ చేసిన పాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి చెబితే... సోనియాగాంధీ మాత్రం తన కొడుకును అరెస్టు చేయించిందని అన్నారు.

విజయమ్మ వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...
‘‘ప్రజలకు ఒక మనవి చేస్తున్నా. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? వేరే ఎక్కడైనా ఉన్నామో అర్ధం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయదల్చుకున్నాయో నాకు అర్థం కావడం లేదు. రాజశేఖరరెడ్డి 2009లో 33 మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో, ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించి రాష్ట్రంలో ప్రభుత్వాలను తీసుకొచ్చినందుకు ఇది ప్రతిఫలమా? వైఎస్ మరణం పట్ల నాకు ఇప్పటికీ అనుమానం ఉంది. చాపర్ విషయంలో వచ్చిన అనుమానాలను తీర్చలేదు. మరణంపై సరైన దర్యాప్తు చేయలేదు. నివేదికలు హడావుడిగా ఇచ్చేశారు. అసెంబ్లీలో కనీసం తీర్మానం కూడా చేయలేదు. ఆయన మరణించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే వేధింపులు జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి.

జగన్ బాబు ఏం తప్పు చేశాడని అడుగుతున్నా. ఆయన (వైఎస్) పోయినప్పుడు ప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పు చేయడమే తప్పా? ఆమె (సోనియాగాంధీ) మాట విననందుకు ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయా? ఏం చేయదల్చుకున్నారు నా బిడ్డను? నా భర్తను పంపించారు. ఈ రోజు ఏం తప్పుచేశాడని నా బిడ్డను ఇలా చేస్తున్నారు? జగన్ ఏమైనా సహకరించలేదా? మూడు రోజులుగా సీబీఐకి సహకరిస్తున్నారు కదా... దర్యాప్తుకు సంబంధించి 9 నెలల నుంచి పిలవలేదు. ఈ 15 రోజులకు ఏం అవుతుంది అని కోరినా ‘కాదు.. కూడదు’ అన్నారు. అందుకే వచ్చి కో ఆపరేట్ చేశాడు. కోర్టులో జడ్జి కూడా చెప్పారు. అరెస్టు చేయరని. సడన్‌గా ఈ రోజు ఏ ఆధారం లేకుండా ఎందుకిట్లా చేయిస్తున్నారు.

18 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ వేళ ప్రజలు ఆదరణ చూపడం తప్పా? ప్రజల నేతగా ఉండటం తప్పా? సోనియాగాంధీని, ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని అడగదల్చుకున్నా. ఆ రోజు 2009 ఎన్నికల్లో 33 మంది ఎంపీలు ఇవ్వడం కాకుండా మళ్లీ 2014లో రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి కోరికను నెరవేర్చాలనుకోవడం తప్పా? దాంట్లో (కాంగ్రెస్) ఉండనీయకుండా, దీంట్లో (వైఎస్సార్ కాంగ్రెస్) ఉండనీయకుండా ఏం చేద్దామని? నా భర్త.. ఆమె కొడుకును ప్రధానిని చేస్తానని చెబితే.. నా కొడుకును కస్టడీలోకి తీసుకుంటారా? ఆయన తెచ్చిన ప్రభుత్వంలో ఉంటూ ఎందుకింత కక్ష కడుతున్నారు? చిన్నోడిని వేధిస్తున్నారు.

రెండున్నర ఏళ్లుగా నరకం చూపిస్తున్నారు. లోలోన ఎన్నో చేశారు. అన్నీ భరించాం. సాక్షి మీద దాడులు చేయిస్తున్నారు. మా వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు. విజయసాయిరెడ్డిని 3 నుంచి 4 నెలల పాటు జైల్లో ఉంచారు. సునీల్‌రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నాడు. మంత్రి మోపిదేవిని మాత్రం అరెస్టు చేసిన 4 రోజులకే ఆరోగ్యం పేరుతో ఆస్పత్రికి పంపించారు. ఎమర్జెన్సీ కన్నా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. నా కొడుకును ఈ సర్కారు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నన్నూ, నా కోడలు, కూతుర్ని వీధుల్లో నిలబెట్టారు. మా బాబును తీసుకెళ్లే వరకు ఇక్కడే (దిల్‌కుశ అతిథిగృహం వద్దే) కూర్చుంటాను. కేంద్ర, రాష్ట్ర పెద్దలు వాళ్ల మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నట్టు ప్రజలకు ఆ రోజే (పార్టీ ప్లీనరీలో) చెప్పాను. ఆ ప్రజలే జగన్ భవిష్యత్తును నిర్ణయిస్తారు. వారే న్యాయనిర్ణేతలు. ప్రజలతో పాటు పైన దేవుడు కూడా చూస్తున్నారు.

ఈ 18 ఎన్నికల్లో అన్ని స్థానాలు పార్టీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. మా పార్టీ గెలిస్తే మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాళ్లు ఈ రోజు నా బిడ్డను వేధిస్తున్నారు. ఈ 18 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎవరూ ఊహించని మెజార్టీతో గెలిపించి వారికి కనువిప్పు కలిగించాలి. పార్టీ బంద్‌కు పిలుపు ఇచ్చిందని నాకు తెలిసింది. అందులో ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరుతున్నా. బంద్, జైల్‌భరోలను శాంతియుతంగా జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా’

పోలీసుల ఓవరాక్షన్...
విజయమ్మ మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కుటుంబసభ్యులతో కలిసి విజయమ్మ దిల్‌కుశ అతిథి గృహం బయటకు రాగానే విలేకరులు, కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు ఒక్కసారిగా ముందుకొచ్చారు. అయితే పోలీసులు ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదని, అతిథి గృహం గేటు బయట మాట్లాడుకోవచ్చని చెబుతూ మీడియాను బయట పంపేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. అంతకుముందు విజయమ్మ లోటస్‌పాండ్ నివాసం నుంచి దిల్‌కుశ అతిథిగృహానికి వస్తున్నప్పుడు కూడా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు పదేపదే నిలిపివేశారు. ఆమె అతికష్టం మీద దిల్‌కుశకు చేరుకున్నారు.
Share this article :

0 comments: