ఇంటర్వ్యూల్లో జగన్ పేర్కొన్న ముఖ్యాంశాలు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంటర్వ్యూల్లో జగన్ పేర్కొన్న ముఖ్యాంశాలు...

ఇంటర్వ్యూల్లో జగన్ పేర్కొన్న ముఖ్యాంశాలు...

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012

* ఉప ఎన్నికల ఫలితాలే వేధింపులకు జవాబు 
* జాతీయ మీడియాతో జగన్
* ఎన్నికలు వాయిదా వేసేందుకు సీబీఐతో కలిసి కాంగ్రెస్, టీడీపీ కుట్ర 
* నన్ను అరెస్ట్ చేసి, అల్లర్లు సృష్టించి, ఎన్నికలను వాయిదా వేయాలన్నది వ్యూహం 
* నేను కుట్ర విషయం చెప్పిన వెంటనే.. సీబీఐ సమన్లు ఇచ్చింది 
* 9 నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకూ ఎందుకు పిలవలేదు?
* నన్ను అరెస్ట్ చేస్తే.. నా తల్లి ప్రచారానికి సారథ్యం వహిస్తారు 

ఉప ఎన్నికలు సవ్యంగా జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయం బయటపడుతుందని.. కాబట్టి ఆ ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు సీబీఐతో కలిసి కుట్ర పన్నుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం తనను అరెస్ట్ చేసి, తామే అల్లర్లు సృష్టించి, ఆ నేరం తనపై మోపి, శాంతిభద్రతల సాకుతో ఎన్నికలను వాయిదా వేయాలని కుట్రపన్నినట్లు వివరించారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ గురువారం పలు జాతీయ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

ఈ సందర్భంగా.. తన అరెస్టుతో సహా ఏం జరిగినా వైఎస్ అభిమానులు సంయమనం కోల్పోరాదని, శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 18 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగేలా చూడటమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వేధింపులు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని.. ఎన్నికల్లో వారు తీర్పు చెప్తారని పేర్కొన్నారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే.. తన తల్లి ఎన్నికల ప్రచారానికి నేతృత్వం వహిస్తారని జగన్ పేర్కొన్నారు. ఎన్‌డీటీవీ, టైమ్స్ నౌ, టీవీ 18, హెడ్‌లైన్స్ టుడే తదితర చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జగన్ పేర్కొన్న ముఖ్యాంశాలు... 

సీబీఐ శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని మీకు సమన్లు జారీ చేసింది.. హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు అమలులోకి తెచ్చారు. ఈ పరిణామాలను చూస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఖాయమని మీరు అనుకుంటున్నారా? 

ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎందుకు సీబీఐ ఇంత తొందరపాటుగా వ్యవహరిస్తోంది? సీబీఐ కోర్టు నాకు సమన్లు జారీ చేసింది. నేను వ్యక్తిగతంగా కానీ, లేదా నా స్థానంలో న్యాయవాది కానీ హాజరు కావాలని చెప్పింది. సీబీఐ కోర్టు చెప్పిన దాని ప్రకారం.. సీబీఐ వద్ద తగిన సాక్ష్యాలు లేవని స్పష్టమవుతోంది. అందుకే.. ‘నీవు హాజరు కావచ్చు. లేదా నీ తరఫు న్యాయవాది హాజరు కావచ్చు’ అని కోర్టు చెప్పింది. అది 28వ తేదీన జరగాల్సి ఉంది. సీబీఐ కోర్టులో అరెస్టు సాధ్యం కాదని సీబీఐకి బాగా తెలుసు. కాబట్టి వీళ్లు ముందుకెళ్లి 25వ తేదీన హాజరు కావాలంటూ సమన్లు జారీచేశారు. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ కుట్ర జరుగుతోంది. నిజానికి ఇది జరగటానికి ముందే.. వాళ్లు ఇలాంటిదేదో చేయబోతున్నారని నేను ముందే చెప్పాను. వయలార్ రవి హైదరాబాద్ వచ్చారు. 

అసలు ఈ మొత్తం కుట్రను రచించింది అప్పుడే. ఆయన (సీబీఐ) జేడీ లక్ష్మీనారాయణతో మాట్లాడారు. ఆయన డీజీపీతో మాట్లాడారు. ఆయన కిరణ్‌తో మాట్లాడారు. చంద్రబాబునాయుడును కూడా విశ్వాసంలోకి తీసుకున్నారు. వీళ్లంతా ఒక్కటై ఒక కుట్ర రచించారు. దాని ప్రకారం.. వాళ్లు నన్ను అరెస్టు చేయాలని అనుకుంటున్నారు. ఆ అరెస్టు పేరు చెప్పి రాష్ట్రంలో వాళ్లే అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారు. ఆ నెపం కూడా నాపై మోపాలని అనుకుంటున్నారు. జగన్‌ను అరెస్ట్ చేయటం వల్ల ఈ అల్లర్లు జరిగాయని చెప్పాలనుకుంటున్నారు. దానిని సాకుగా చూపి ఈ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటున్నారు. 

మొత్తం కుట్ర ఏమిటంటే.. ఈ 18 స్థానాల ఫలితాలు బహిర్గతం కాకూడదని వాళ్లు కోరుకుంటున్నారు. ఈ 18 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం.. అంటే దాదాపు 24 శాసనసభ నియోజకవర్గాలు.. వీటి ఫలితాలు వెల్లడైతే.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది? అన్నది తేటతెల్లమైపోతుంది. నా సమాచార వర్గాల ప్రకారం.. వీళ్లు ఇంతటి తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే.. వీళ్లు నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ పార్టీలు రెండూ (ఎన్నికల్లో) తుడిచిపెట్టుకుపోతాయి. 

ఎంతగా దారుణంగా దెబ్బతింటాయంటే.. అవి మళ్లీ కోలుకోవటం సాధ్యంకానంత దెబ్బతింటాయి. కాబట్టి ఈ ఫలితాలు బహిర్గతం కాకూడదని వారు కోరుకుంటున్నారు. కాబట్టి వారు నన్ను అరెస్ట్ చేసి, అల్లర్లు సృష్టించి, సమస్య సృష్టించి.. శాంతిభద్రతల సాకుతో రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయాలని అనుకుంటున్నారు. ఈ రకమైన కుట్రను రచించారు. ఇది నాకు ముందుగానే తెలిసింది. నేను వెంటనే బహిరంగ ప్రకటన చేశాను. బహిరంగ సభలో చెప్పాను. వీళ్లంతా ఇలా చేస్తున్నారని, వీళ్లు ఇలా చేయబోతున్నారని బయటపెట్టాను. నేను ఆ విషయం చెప్పిన తర్వాత.. ఆ రోజు రాత్రి సీబీఐ చర్యలు చేపట్టింది. ఆ తర్వాతి రోజు తెల్లవారి 5 గంటలకు నాకు సమన్లు అందాయి. 

ఈ రకమైన కుట్ర భారత దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందని నేననుకోను. ప్రత్యేకించి ఎందుకంటే.. నేను 9 నెలల పాటు హైదరాబాద్‌లో ఉన్నాను. వాళ్లు నన్ను ఎప్పుడైనా పిలిపించి ఉండొచ్చు. కానీ 9 నెలలు పాటు వాళ్లు మౌనంగా ఉండటానికే మొగ్గుచూపారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్లు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. నేను జూన్ 15 వరకూ సమయం ఇవ్వాలని సీబీఐకి విజ్ఞప్తి చేశాను. అంటే 20 రోజుల సమయం. ఒక పార్టీ అధ్యక్షుడిని.. 18 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానంలో ఎన్నికల్లో పోటీచేస్తున్న వ్యక్తిని.. 20 రోజుల సమయం కోరాను. నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను.. ఎన్నికల కోసం ఉండాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశాను. కానీ ఆ విజ్ఞప్తిని సీబీఐ నిరాకరించింది. దీన్నిబట్టి.. వారు పన్నిన కుట్రను అమలు చేయబోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. 

కుట్ర జరుగుతోందని మీరు బహిరంగంగా ప్రకటించారు. లేఖలు రాశారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని మీరు భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. సీబీఐని కాంగ్రెస్ ఒత్తిడి ఎత్తుగడలకు ఉపయోగించుకుంటోందని చెప్తున్నారు. మీపై సీబీఐ ఉచ్చును సడలించేందుకు సహాయం చేస్తామని.. కాంగ్రెస్ నుంచి సంకేతాలు రావటం కానీ, నేతలు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించటం కానీ జరిగిందా?

నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తోంది. పైగా వాళ్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబునాయుడుతో చేతులు కలిపారు. ఇక ఎవరైనా నన్ను సంప్రదించే ప్రశ్న ఎక్కడుంది? 

ఈ 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై మీరు చాలా ధీమాగా ఉన్నారు. అయితే.. ఈ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు లిట్‌మస్ టెస్ట్ వంటివని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇవి పార్టీ పోటీ చేస్తున్న మొదటి పెద్ద ఎన్నికలు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో, మీరు కూడా అరెస్ట్ అవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ఈ పరిస్థితిల్లో మీరు భావిస్తున్నట్లు అరెస్టు జరిగితే.. ప్రచారం ఇంకెవరైనా చేపడతారా? 

మాకు ఇవి రెండో ఎన్నికలు. మేం కోవూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాం. మాకు ఇవి రెండో ఎన్నికలు. ఒకవేళ అటువంటి పరిస్థితే (అరెస్టు జరగటం) తలెత్తితే.. అదేం సమస్య కాదు. ప్రజలకు ఏం జరుగుతోందో ప్రతి విషయం తెలుసు. జనం నన్ను వారి సొంత కుమారుడిగా చూస్తున్నారు. జనం నన్ను వారి మనవడిగా చూస్తున్నారు. జనం నన్ను వారి సోదరుడిగా చూస్తున్నారు. ఏం జరిగినా సరే.. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. పైగా నా తల్లి కూడా ఉన్నారు. ఆమె తప్పకుండా ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఆమె కూడా పోరాటం చేస్తారు. మేమంతా కలిసి పోరాడతాం. 

ఎన్నికలకు ముందు మిమ్మల్ని అరెస్ట్ చేసి, శాంతిభద్రతల సమస్య సృష్టించి, ఎన్నికలను వాయిదా వేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ మీరు ప్రధాని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఇది దర్యాప్తు ప్రక్రియలో భాగమని.. కుట్ర జరుగుతోందని మీరెందుకు ఆరోపిస్తున్నారని దర్యాప్తు సంస్థ వాదిస్తోంది..

ఈ సమాచారం నాకు కొద్ది రోజుల ముందు తెలిసింది. నేను చాలా స్పష్టంగా ప్రకటించాను. నిజానికి బహిరంగ సభలో కూడా ప్రకటించాను. ప్రధానమంత్రికి, ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశాను. నేను మీ దృష్టికి తీసుకురాదలచుకున్న విషయం ఏమిటంటే.. 9 నెలలుగా సీబీఐ ఈ కేసుల్లో దర్యాప్తు చేస్తోంది. ఒకటి.. సీబీఐ ఇప్పటి వరకూ నాకు సమన్లు ఎందుకు ఇవ్వలేదు. రెండోది.. ఈ నెల 28న వ్యక్తిగతంగా కానీ, నా స్థానంలో నా తరఫు న్యాయవాది కానీ హాజరు కావాలని సీబీఐ కోర్టు నాకు సమన్లు జారీ చేసింది. 

దీని స్పష్టమైన అర్థం ఏమిటంటే.. సీబీఐ వద్ద సాక్ష్యాలు లేవని. కోర్టు స్వయంగా ‘నీవు హాజరు కావచ్చు. లేదా నీ తరఫు న్యాయవాది హాజరు కావచ్చు’ అని చెప్పింది. అంటే.. కోర్టు నన్ను అరెస్ట్ చేయదు. ఎందుకంటే.. నా న్యాయవాది హాజరు కావచ్చని అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. సీబీఐ ముందుకెళ్లి 28వ తేదీకి మూడు రోజులు ముందుగా 25వ తేదీన హాజరు కావాలంటూ హడావుడిగా సమన్లు జారీచేసింది. నిజానికి ఈ కుట్ర రచన మొత్తం వయలార్ రవి ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. ఆయన జేడీ లక్ష్మీనారాయణ, డీజీపీ, కిరణ్‌కుమార్‌రెడ్డిలతో మాట్లాడారు. చంద్రబాబునాయుడును కూడా విశ్వాసంలోకి తీసుకున్నారు. 

కానీ ఆయన (చంద్రబాబు) కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపిస్తున్నారు... 
లేదు.. లేదు.. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆయనను కూడా విశ్వాసంలోకి తీసుకున్నారు. 9 నెలల పాటు నాకు సమన్లు జారీ చేయని సీబీఐ.. ఇప్పుడు అకస్మాత్తుగా ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందుగా నన్ను అరెస్ట్ చేయటానికి సమన్లు ఎందుకు జారీ చేసింది? చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వాళ్లు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్లు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత శాంతిభద్రతల సమస్య సాకుతో ఈ 18 స్థానాల ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆందోళన చెందటానికి ఏదైనా కారణముందని మీరు భావిస్తున్నారా? 

నిజానికి ఈ 18 స్థానాలు, లోక్‌సభ స్థానం ఎన్నికల్లో రానున్న తీర్పు.. మొత్తం రాష్ట్రం తీర్పు అవుతుంది. ఎందుకంటే ఈ 18 స్థానాలు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయి. వాళ్లంతా ఓటు వేస్తారు. వాళ్లంతా రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ మొత్తం వేధింపులకు సాక్షులుగా నిలుస్తారు. 

నిన్న మీ బాబాయ్ (వై.ఎస్.వివేకానందరెడ్డి).. మాట్లాడుతూ.. సీఎం, ఇతర మంత్రులూ మీ తండ్రిని అవమానిస్తూ మాట్లాడుతున్నారని, ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాస్తవాన్ని పేర్కొన్నారు. ఇది.. కాంగ్రెస్ నుంచి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు తిరిగిరావటానికి ఆరంభంగా భావిస్తున్నారా? 

ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన కక్షసాధింపు రాజకీయాలు.. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఈ తరహా పరిణామాలు ఉండవు. కానీ ఇప్పుడు ఇలా జరుగుతోంది. ఎవరినైనా అనైతికంగా దెబ్బతీయాలని చూస్తే దానికి ప్రతిస్పందన పట్టుకొస్తుంది. ప్రతి చర్యకూ సమానమైన ప్రతిచర్య ఉంటుంది. 

ఈ ఎమ్మెల్యేలు, నాయకుల్లో చాలా మంది గతంలో మీకు మద్దతిచ్చిన వారే. ఇప్పుడు వాతావరణం మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి బాగుంది. కాబట్టి వాళ్లు మళ్లీ మీ దగ్గరికి తిరిగి వస్తారని భావిస్తున్నారా? 

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ.. అందరూ తమ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు.. అనైతికంగా దెబ్బతీస్తున్నారు. చేయకూడని పనులు చాలా చేస్తున్నారు. ఇది చాలా భావోద్వేగ తిరుగుబాటును సృష్టిస్తుంది. అది.. నాకున్న మనోభావాల వంటి ఉమ్మడి భావోద్వేగాలను చాలా మంది పంచుకునే పరిస్థితికి దారితీస్తుంది. అది వీరందరినీ ఏకం చేసి.. మరింత బలమైన శక్తిని రూపొందిస్తుంది. ఆ శక్తి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలను ధ్వంసం చేస్తుంది. 

ఈ ఉప ఎన్నికల్లో మీరు మంచి విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సీబీఐ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే.. రాబోయే రెండు వారాల్లో ఏం జరగవచ్చని మీరు భావిస్తున్నారు?

ఏమీ జరగదు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరూ చూస్తున్నారు. వాళ్లు ఏం చేసినా సరే.. ప్రజా ఉద్యమాన్ని నియంత్రించలేరు. వాళ్లు ఏం చేసినా సరే.. ప్రజలు ఓటు వేస్తారు. ప్రజలు తీర్పు చెప్తారు. ప్రజలు వీళ్లకి గుణపాఠం చెప్తారు. 

రేపు సీబీఐ ఎదుట విచారణకు హాజరైన తర్వాత.. మళ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చే ఆలోచన ఉందా? 

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేను గత 25 రోజులుగా ప్రచారంలో ఉన్నాను. షెడ్యూల్ ప్రకారం జూన్ 10 వరకూ ఒక్క రోజూ మినహాయింపు లేకుండా నా ప్రచారం కొనసాగాలి. కానీ.. వీళ్లు చేస్తున్న దాని ఉద్దేశం స్పష్టంగా ఉంది.. నన్ను ప్రచారం చేయకుండా ఆపాలన్నది వాళ్ల ఉద్దేశమన్నది స్పష్టం. 

సీబీఐ సమన్లు అందటానికి ఒక రోజు ముందు.. కుట్ర ఆరోపణలపై ప్రధాని నుంచి కానీ, సీఈసీ నుంచి కానీ ఏమైనా స్పందన లభించిందా? 

దురదృష్టవశాత్తూ లేదు. 

స్పందన లభిస్తుందని మీరు ఆశించారా? 

ఆశించా. కానీ.. నేను కుట్ర గురించి మాట్లాడిన తర్వాత తెల్లారే సరికి సీబీఐ హడావుడిగా నాకు సమన్లు జారీ చేసింది. సీబీఐ ఇక ఏమాత్రం సీబీఐ కాదు. అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 

సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని మీరు భావిస్తున్నారా?

లేదు. సీబీఐ విచారణకు సంబంధించినంత వరకూ.. వీళ్లు న్యాయం చేయరు. మేం కోర్టుల్లో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘమైన పోరాటం. అది కొనసాగుతుంది. 

మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మీరు కూడా చెప్తున్నారు... మీ మద్దతుదారులకు మీ సందేశం ఏమిటి? 

వైఎస్సార్‌ను ప్రేమించే వారందరికీ నా సందేశం ఏమిటంటే.. అందరూ శాంతియుతంగా ఉండాలన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. పరిస్థితి ఎలావున్నా, ఏం జరిగినా సరే.. ఈ 18 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగేలా చూడటం మనకు చాలా ముఖ్యం. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికి తెలవాలి. వీళ్లు ఏం చేయటానికి ప్రయత్నిస్తున్నారో తెలియాలి. కాబట్టి ఏం జరిగినా సరే అందరూ శాంతియుతంగా ఉండాలి. వీరి ఉచ్చులో పడకండి. మనం శాంతియుతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ 18 స్థానాలు, లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగటం చాలా ముఖ్యం. 

టీడీపీ, కాంగ్రెస్‌లు హింసకు పాల్పడతాయని ఆరోపిస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి అవి సీబీఐతో కలిసి కుట్ర పన్నుతున్నాయని అంటున్నారు. మీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయంటున్నారు. ఈ ఆరోపణలకు మీ వద్ద ఉన్న ఆధారాలేమిటి? 

కుట్ర గురించి నేను వెల్లడించిన తర్వాతే.. సీబీఐ నాకు హడావుడిగా ఎందుకు సమన్లు ఇచ్చింది? అంటే నాకు కుట్ర గురించి ముందే తెలుసనటానికి ఇది తగిన ఆధారం కాదా? నేను ప్రధానికి, సీఈసీకి లేఖలు రాసిన తర్వాత, బహిరంగ సభలో ప్రకటించిన తర్వాత.. సీబీఐ హడావుడిగా నాకు సమన్లు ఇచ్చింది. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? ఈ 18 స్థానాలకు ఎన్నికలు జరగకపోతే అత్యంత ఎక్కువగా నష్టపోయేది నేనే. అత్యంత లాభం పొందేది వాళ్లే. నేనెందుకు గొడవ చేస్తాను? ఇదంతా చేయబోయేది వాళ్లే.. ఎందుకంటే ఈ ఎన్నికలు రాకూడదని వాళ్లు కోరుకుంటున్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగనివ్వాలి. ఈ 18 స్థానాలకు ఎన్నికలు జరగనివ్వాలి. ప్రజలను ఓటు వేయనివ్వాలి. రాష్ట్ర ప్రజలు ఏం చెప్తున్నారు అనేది మొత్తం దేశానికి తెలుస్తుంది. 

ఉప ఎన్నికల నేపథ్యంలో మిమ్మల్ని అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసే పరిస్థితి ఉండటం.. ఈ మొత్తం పరిస్థితి ఎన్నికలపై ఎలా ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? 

ఈ 18 స్థానాలకూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిందే. వాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయజాలరు. నన్ను అరెస్ట్ చేసి, అల్లర్లు సృష్టించి, శాంతిభద్రతల సమస్య సృష్టించి, ఎన్నికలను వాయిదా వేయజాలరు. ప్రజాస్వామ్యంలో దీనికి అనుమతించరాదు. ఈ 18 అసెంబ్లీ స్థానాలకు, లోక్‌సభ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారు. వీళ్లంతా ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. కొనసాగుతున్న వేధింపులను గమనిస్తున్నారు. వాళ్లు ఓటు వేస్తారు. నిజానికి ఈ వేధింపులకు వాళ్లు జవాబు ఇస్తారు. 

హైదరాబాద్‌లో ఇప్పుడు నిషేధాజ్ఞలు విధించారు కాబట్టి.. మీరు కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని భావిస్తున్నారా? 

నిజానికి వాళ్లే దానిని రెచ్చగొడుతున్నారు. వాళ్లే స్వయంగా ప్రేరేపిస్తున్నారు. వాళ్లే చేస్తున్నారు. ఇదో కుట్ర. ప్రజాస్వామ్యంలో దీనిని అనుమతించరాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. ఓటు వేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఉప ఎన్నికలు జరగనున్న 18 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానంలో ప్రజలు ఓటు వేయటానికి అనుమతించటం లేదు. అంటే.. ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి, వాళ్లే శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ఒక కుట్ర చేస్తున్నారు. ఏం జరిగినా సరే ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నది నేనే. ఎందుకంటే ఈ 18 స్థానాలు, లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగేలా చూడటం మాకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యం. ఒకసారి ఈ 18 స్థానాలకు, లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగితే.. అది రాష్ట్రంలో ఏ విధమైన వేధింపులు జరుగుతున్నాయనే దానికి స్పష్టమైన సందేశం అవుతుంది.
Share this article :

0 comments: