ఈ దాడులకు మీరే ‘సాక్షి’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ దాడులకు మీరే ‘సాక్షి’

ఈ దాడులకు మీరే ‘సాక్షి’

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

చార్జిషీట్ నంబర్ 1

రూ.19 కోట్ల లబ్ధికి 30 కోట్ల పెట్టుబడా?: తొలి చార్జిషీట్లో సీబీఐ చెప్పిన అంశం ఒక్కటే. ఫార్మా సంస్థలైన హెటెరో, అరబిందోలకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పోలేపల్లి సెజ్‌లో భూములు కేటాయించారని, ఈ భూమి ఎకరా రూ.15 లక్షల విలువ చేస్తుందని అధికారులు చెప్పినా సరే ఎకరా రూ.7 లక్షలకే కేటాయించారని సీబీఐ పేర్కొంది. మొత్తంగా ఈ రెండు సంస్థలకూ భూములు కేటాయించటం వల్ల ప్రభుత్వానికి రూ.19 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. దీనికి గాను ఆ సంస్థలు జగన్‌మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారని పేర్కొంది. 

అసలు 19 కోట్లు లబ్ధి పొందినందుకు 30 కోట్లు పెట్టుబడి పెట్టే వారెవరైనా ఉంటారా? 
అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారని భావించాల్సిన పని లేదా? 
వెనకబడిన జిల్లాలో పరిశ్రమలు రావాలంటే భూమిని తక్కువ ధరకు ఇవ్వాల్సిన అవసరం లేదా?
వందల ఎకరాలు కేటాయించేటపుడు ఎకరానికి విడిగా ఎంత రేటుందో అంతే చూస్తారా?
అభివృద్ధి చెందిన భూమి ఎకరా రూ.15 లక్షలున్నపుడు ఖాళీ భూమిని తక్కువకు కేటాయించరా?
తీసుకున్న సంస్థ రోడ్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, చుట్టూ గోడ కట్టినపుడు ఆ రేట్లు పెరగవా?

చార్జిషీట్ నంబర్ 2

ఇన్వెస్టర్లు మోసపోయారా?: తొలి చార్జిషీట్లో క్విడ్ ప్రో కో వాదన చేసిన సీబీఐ... రెండో చార్జిషీట్లో మాత్రం మరో కొత్త వాదన తీసుకొచ్చింది. డెలాయిట్ సంస్థ జగతి పబ్లికేషన్స్‌కు విలువ కట్టిందని, రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లుగా సంస్థను విలువ కట్టాలని విజయసాయిరెడ్డి కోరినందువల్లే ఆ సంస్థ అంత విలువను నిర్ణయించిందని పేర్కొంది. ఈ నివేదికను చూపించి ఇన్వెస్టర్ల ద్వారా పెట్టుబడులు పెట్టించారని, ఒకరకంగా ఇన్వెస్టర్లను మోసం చేశారని పేర్కొంది. ఇన్వెస్టర్లకు లాభాలు ఎలా వస్తాయో చెప్పలేదని, లాభాలతో కంపెనీ నుంచి బయటపడే మార్గాన్ని చూపించలేదని చెప్పింది. మొత్తమ్మీద ఈ చార్జిషీటంతా డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించటం... అనే అంశం చుట్టూ తిరిగింది. 

ఇక్కడ కీలకమైన ప్రశ్నలెన్నో ఉన్నాయి. అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడుల్నా లేక పెట్టుబడిదారులు మోసపోయారనే అంశాన్నా? 

అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల తాము మోసపోయామని ఇన్వెస్టర్లెవరైనా ఫిర్యాదు చేశారా?

డెలాయిట్ నివేదికలో... ‘ఈ నివేదిక సదరు యజమానులిచ్చిన సమాచారం ఆధారంగానే తయారు చేశాం. భౌతికంగా ఆస్తుల్ని తనిఖీ చేయలేదు’ అనే గమనిక ఉందిగా!! మరి దీని ఆధారంగా పెట్టుబడులు పెట్టడమంటే గమనికను చూడనట్లా? 

షేర్ మార్కెట్లో షేర్లు కొన్నవారు నష్టపోతే సీబీఐ జవాబుదారీ వ్యవహరిస్తుందా? అసలు ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే లాభం, నష్టం రెండూ ఉంటాయన్న సంగతి సీబీఐకి తెలియదా? 

ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాల్ని విచారించటానికా సీబీఐ ఈ దర్యాప్తును చేస్తున్నది? 

‘సాక్షి’ షేరును రూ.350 చొప్పున అధిక విలువకు విక్రయించారని చెబుతున్న సీబీఐకి... ‘ఈనాడు’ తన ఒక్కో షేరును రూ.5,28,630 చొప్పున విక్రయించటం అక్రమమనిపించలేదా?

‘ఈనాడు’ తన విలువను రూ.9,000 కోట్లుగా అంచనా కట్టినపుడు సాక్షి విలువ అందులో సగం కూడా చెయ్యదా?

చార్జిషీట్ నంబర్ 3

రాంకీ చుట్టూ: విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయటానికి రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు అనుమతులివ్వటమే కాక అక్కడ గ్రీన్‌బెల్ట్ కోసం వదలాల్సిన స్థలాన్ని తగ్గించటం ద్వారా సంస్థకు 150 ఎకరాలు మిగిలేలా చేశారని, అందుకే అది జగన్‌మోహన్ రెడ్డి కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఈ చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ ఫార్మా సిటీకి సంబంధించిన వివరాలు చూస్తే... విశాఖలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ 2000వ సంవత్సరం జూలై 18న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవో ఎంఎస్ నంబరు 381ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ఒక ఫార్మా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు ఆయనే చైర్మన్. ఈ టాస్క్‌ఫోర్స్ ఫార్మా సిటీ కోసం భూముల్ని వెతికింది. 

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా ప్రాంతం మొత్తాన్ని పరిశీలించింది. చివరకు పరవాడలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాను (ఐడీఏ) ఫార్మాసిటీకి అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిజానికి పరవాడ ఐడీఏను 1997లో పారిశ్రామిక వాడగా ప్రకటించారు. కానీ అప్పట్లో జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా జరిపిన సర్వేలో ఇక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటు సరికాదని బయటపడింది. దీంతో పరవాడ ప్రాంతాన్ని తక్కువ జల, వాయు కాలుష్యాలు వెదజల్లే కలాపాలకే పరిమితం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని బేఖాతరు చేస్తూ... ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యంలో ఫార్మా లేదా కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నంబరు 501ని విడుదల చేసింది. 

2002లోనే ఏపీఐఐసీ ఆమోదం: ప్రభుత్వం జీవో వెలువరించిన వెంటనే ఏపీఐఐసీ కూడా సూత్రప్రాయంగా అక్కడ భూములు సేకరించి డెవలపర్‌కు అందజేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు తన సమ్మతిని తెలియజేస్తూ 2002 సెప్టెంబరు 3న లేఖ రాసింది. డెవలపర్‌గా ఎల్ అండ్ టీని ఎంపిక చేశారు. అయితే ఫార్మా సెజ్‌ల అభివృద్ధిలో ఎల్ అండ్ టీకి ఏమాత్రం అనుభవం లేదని, దాన్ని ఎంపిక చేయటం సరికాదని విమర్శలు వచ్చాయి. దీంతో రాంకీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి 2002లో 2,143 ఎకరాల భూములు అప్పగించింది. ఆ తరవాత 2004 ఏప్రిల్‌లో (వైఎస్ అధికారంలోకి రావటానికి నెల ముందు) రాంకీ-ఏపీఐఐసీ జాయింట్ వెంచర్ కంపెనీ హడావుడిగా ఏర్పాటయింది. 

ఇదీ జరిగిన కథ. 2,143 ఎకరాల్ని అప్పగించిన చంద్రబాబు నాయుడిని సీబీఐ ఎందుకు పట్టించుకోవటం లేదు? 
గ్రీన్‌బెల్డ్‌కు వైఎస్సార్ ప్రభుత్వం మినహాయింపులిచ్చిందంటూ జగన్ మోహన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తోంది? 
150 ఎకరాలు లబ్ధి చేకూర్చినందుకే వారు జగన్ కంపెనీల్లో 10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే 2,143 ఎకరాలు కేటాయించిన చంద్రబాబుకు ఏ మేర ప్రయోజనం చేకూర్చి ఉండాలి? ఆయన సంస్థల్లో ఎంత పెట్టుబడి పెట్టి ఉండాలి? 

మరి ఈ ముడుపులెలా వెళ్లాయి? 

దీన్నిబట్టి ఆ సంస్థ మున్ముందు లాభం వస్తుందనే ఉద్దేశంతో, కొత్త మీడియా సంస్థకు సహకరించాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టిందని అర్థం కావటం లేదా? 

‘సాక్షి’లోకి వచ్చిన ప్రతి పెట్టుబడికీ ఈ రకమైన లింకుల్ని వెదకటమే సీబీఐ పనిగా పెట్టుకుందని అర్థం చేసుకోనక్కర్లేదా? 
Share this article :

0 comments: