ద్వంద్వ ప్రమాణాల సీబీఐ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ద్వంద్వ ప్రమాణాల సీబీఐ!

ద్వంద్వ ప్రమాణాల సీబీఐ!

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

బీజేపీ నాయకుడు బంగారు లక్ష్మణ్‌పై వచ్చిన లంచం ఆరోపణలు రుజువై నాలుగేళ్ల జైలు శిక్ష పడటంతో విచారణకు తెరపడింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌లమధ్య పోరాటాన్ని ఈ పరిణామం కొత్త మలుపు తిప్పింది. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2001 సమయంలో బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆయుధ డీలర్లుగా తమను తాము పరిచయం చేసుకున్న తెహల్కా జర్నలిస్టుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. తెహల్కా జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష్మణ్ చిక్కుకుని దోషి అయ్యారు. భారత సైన్యానికి థర్మల్ హ్యాండ్ హెల్డ్ ఇమేజర్స్ సరఫరా చేసేందుకు సహకరించాలంటూ కోరి ఆ జర్నలిస్టులు లంచం ఇచ్చారు. 

అధికార పార్టీకి చెందిన పెద్దల దగ్గరకెళ్లి వారి పలుకుబడితో అడ్డగోలుగా పనులు చేయించుకోవడం మన దేశంలో ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారమే. కానీ, దాన్ని రుజువుచేయడం కోసం అట్టడుగు వర్గానికి చెందిన బంగారు లక్ష్మణ్‌నే ఆ జర్నలిస్టులు ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. నిజానికి అప్పట్లో తమ పలుకుబడితో ఏ పనైనా చేయించగలరని మోత మోగిన పేర్ల జాబితాలో లక్ష్మణ్ లేనే లేరు. ఏమైతేనేం... సీబీఐ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి దర్యాప్తు చేసింది. యూపీఏ అధికారంలోకొచ్చిన తర్వాత ప్రారంభించిన దర్యాప్తును ఏడేళ్లలో పూర్తిచేసి ఆయన అవినీతిని నిరూపించి శిక్షపడేలా చేసింది. 

అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు జరపడం, రుజువైతే శిక్ష విధించడం చట్టప్రకారం సాగే చర్యలు. వాటిని ఎవరూ ప్రశ్నించలేరు. కానీ, సీబీఐ ఇతర కేసుల విషయంలో, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మన్నుతిన్న పాములా ఉండిపోతున్నదన్నది ప్రధాన ప్రశ్న. ఒకవేళ బీజేపీ అధికారంలో ఉన్నా సీబీఐ పనితీరు ఇలాగే ఉండేదా అన్నది మరో ప్రశ్న.

బోఫోర్స్ కుంభకోణం విషయమే తీసుకుంటే, ఎన్నడో 1988లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రూ.64 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. అత్యంత కీలకమైన నాయకులకు ఇందులో భాగస్వామ్యం ఉందని వేలాది పత్రాలు సాక్ష్యమిచ్చాయి. ఈ స్కాంలో రాజీవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఖత్రోచీ కీలకపాత్ర పోషించాడని వెల్లడైంది. అయినా, ఆ వ్యక్తి 1993లో మన దేశం నుంచి చడీచప్పుడూ లేకుండా సునాయాసంగా పరారయ్యాడు. ఆ తర్వాత అతన్ని పట్టుకోవడానికి వచ్చిన అవకాశాలను సైతం సీబీఐ ఉద్దేశపూర్వకంగానే వదులు కుంది.

చివరకు అతన్ని పట్టుకోవడం సాధ్యంకాదంటూ కోర్టుకు తెలియజెప్పి కేసు విచారణను రద్దుచేయించింది. పాతికేళ్ల పొడవునా దాదాపు రూ.300 కోట్ల ప్రజా ధనాన్ని వ్యయం చేశాక సీబీఐ ఇంత బాధ్యతారహితంగా కేసును మూసేయించింది. మరి లక్ష్మణ్ విషయంలో ఇంత ఉత్సాహం ఎందుకు ప్రదర్శించిందన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. యూపీఏ ప్రభుత్వం ఈమధ్య వరస కుంభకోణాలలో ఇరుక్కోవడం, వాటిపై బీజేపీ నానా యాగీ చేస్తూ కాంగ్రెస్‌కు ఊపిరాడనివ్వక పోవడం అందరూ గమనిస్తున్నదే.

ముఖ్యంగా లక్షా 76 వేల కోట్ల రూపాయల 2జీ స్కాం, కామన్వెల్త్ క్రీడల స్కాం, ఆదర్శ్ కుంభకోణం, ఓటుకు నోటు స్కాంలాంటివన్నీ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాయి. ఇలాంటి సందర్భంలో బీజేపీకి ఒక పెద్ద షాక్ ఇవ్వడానికి లక్ష్మణ్ కేసు కాంగ్రెస్‌కు అందివచ్చిందన్నది వాస్తవం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ‘అద్దాల మేడలో కూర్చుని రాళ్లు విసరొద్దు’ అంటూ బీజేపీకి హితబోధ చేయడంలోని మర్మం ఇదే. రాజకీయ క్రీడలో భాగంగా ఆ రెండు పార్టీలూ పరస్పరం రాళ్లయినా విసురు కుంటాయి. మరేమైనా చేస్తాయి.

ప్రజాధనంతో నడుస్తూ, ప్రజలకు బాధ్యతవహిం చాల్సిన సీబీఐకి ఈ గొడవతో ఏం పని? అధికారంలో ఉన్నవారికి ‘బానిసకొక బానిసకొక బానిస...’ అన్నట్టుగా వ్యవహరించాల్సిన పనేమిటి? దర్యాప్తులోనూ, దోషుల్ని నిర్ధారించడంలోనూ ఈ ద్వంద్వ ప్రమాణాలెందుకు? ఒక్క లక్ష్మణ్ విషయంలోనే కాదు... జార్ఖండ్ రాష్ట్రం కోసం అలుపెరగకుండా పోరాడిన శిబూ సోరెన్‌ను వివిధ కేసుల్లో దోషిగా తేల్చడంలోనూ ఇంతే వేగాన్ని ప్రదర్శించింది. మాయావతి, ములాయంసింగ్ యాదవ్‌లకు సంబంధించిన కేసుల్లో అయితే కాంగ్రెస్‌కు ఆ నేతలతో ఉండే అవసరాలకు అనుగుణంగా సీబీఐ అడుగులు వేస్తుంటుంది.

మన రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విషయంలో అది దర్యాప్తు పేరుతో సాగిస్తున్న తతంగాన్ని, పథకం ప్రకారం ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్న తీరును ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉన్నారు.అవినీతి ఆరోపణలన్నీ ఒకటి కాదు. రాజకీయ ప్రయోజనాలతో అవతలివారిపై నిర్విచక్షణగా, నిరాధారంగా ఆరోపణలు చేయడం ఒక రకమైతే, ఎలాంటి స్వప్రయో జనాలూ లేకుండా ప్రజాశ్రేయస్సు ధ్యేయంగా ఆధార సహితంగా ఆరోపించడం మరోటి. బోఫోర్స్ కేసు ఈ రెండో కోవకు చెందినది. 

అలాగే, తెహల్కా 2001లో చంద్రబాబునాయుడుపై చేసిన అవినీతి ఆరోపణలు కూడా ఈ తరహావే. దేశంలో కెల్లా అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు బాబేనని ఆ పత్రిక అప్పట్లో తేల్చి చెప్పింది. దేశ, విదేశాల్లో ఆయనకు రూ. 2,000 కోట్ల రూపాయల విలువైన నికర ఆస్తులున్నాయని నిర్ధారించింది. వాటి విలువ ఎన్నిరెట్లు పెరిగిందో ఇప్పుడు అంచనా వేయడం కూడా సాధ్యం కాదు. అయితే, ఇలాంటి అంశాల్లో దర్యాప్తును నీరు కార్చడమో, లేదా అసలు దర్యాప్తే లేకపోవడమో జరుగుతోంది.

ఉదాహరణకు రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఐఎంజీ అనే బోగస్ సంస్థకు బాబు సర్కారు 800 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టడంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్ ప్రభుత్వం కోరినప్పుడు తమకు సిబ్బంది లేరని సీబీఐ తిరస్కరించింది. నిష్పాక్షికంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించడంవల్లే శిక్షలుపడిన కేసుల విషయంలో కూడా ప్రజలకు అనుమానాలు తలెత్తే పరిస్థితి కనిపిస్తున్నది. సీబీఐ దీన్నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.
Share this article :

0 comments: