పెంపును ఉపసంహరించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెంపును ఉపసంహరించండి

పెంపును ఉపసంహరించండి

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

యూపీఏ ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలను తక్షణం ఉపసంహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ తరపున ఆందోళన చేపడతామని బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. 

పెట్రోలు ధరల పెంపు ఎంత మాత్రం హేతుబద్ధం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల స్థితిగతులను గాలికొదిలేసిందనీ...ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక పోతోందనడానికి పెట్రోలు ధరల పెంపు నిదర్శనం అని ఆయన విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో సతమతం అవుతున్న ప్రజానీకంపై గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పెట్రో ధరల పెంచడం సమ్మెట పోటు లాంటిదని జగన్ అభిప్రాయపడ్డారు. పైగా స్కూళ్లు తెరవనున్న ఈ తరుణంలో పెట్రోలు ధరల పెంపు ఏ మాత్రం వాంఛనీయం కాదని ఆయన అన్నారు. ఈ చర్య వల్ల అన్ని రకాల నిత్యావసర సరుకుల ధర లు మరింతగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో, ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలను పెట్రోలు ధరలను తగ్గించడం ద్వారా కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

గతంలో పెట్రోలు ధర లీటరుకు అత్యధికంగా 5 రూపాయలు పెంచగా ఈ సారి 7.50 రూపాయలు పెంచడం ఏ మాత్రం వాంఛనీయం కాదన్నారు. రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణం యూపీఏ- 2 ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేక పోవడమేనని ఆయన అన్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అత్యధిక స్థాయిలో పెట్రోలు ధరలు పెంచుతూ యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఈ కానుక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని జగన్ అన్నారు. కాగా, పెంచిన పెట్రోలు ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: