నాడు కుట్ర.. నేడు అరెస్టు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు కుట్ర.. నేడు అరెస్టు...

నాడు కుట్ర.. నేడు అరెస్టు...

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012



శంకర్రావు చేత మొదట లేఖ..
తరువాత తానే పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ పిటిషన్లే వేరు.. అందులోని అంశాలన్నీ ఒక్కటే
తేదీ లేని శంకర్రావు లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు
కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
ముందస్తు కుట్రలో భాగంగానే వ్యూహాత్మక మౌనం
కౌంటర్లు దాఖలు చేసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది
సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికలను పిటిషనర్లకివ్వని హైకోర్టు
సహజ న్యాయసూత్రాలను పాటించాలని హైకోర్టుకు సూచించిన సుప్రీంకోర్టు
అయినా దక్కని ఫలితం.. దర్యాప్తునకు ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకు జత కట్టిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎట్టకేలకు అనుకున్నది సాధించాయి. ఢిల్లీ పెద్దల అండతో, సీబీఐ సహకారంతో ఈ రెండు పార్టీలు 2011లో చేసిన వ్యూహరచనకు ఇప్పటికి ఫలితం దక్కింది. ప్రజల గుండెల్లో ఉన్న మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డిని వారి నుంచి దూరం చేయడం, జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కడం ప్రధాన లక్ష్యాలుగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా 2011 జనవరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే డాక్టర్ శంకర్రావు చేత ఢిల్లీ పెద్దలు హైకోర్టుకు లేఖ రాయించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురికి లబ్ధి చేకూర్చారని, జగన్ కంపెనీల్లో పలువురు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన తన లేఖలో హైకోర్టును కోరారు.

తనతో ఢిల్లీ పెద్దలే ఆ లేఖ రాయించారని శంకర్రావు తరువాత అధికారికంగా ధ్రువీకరించారు. రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేలా... తేదీ లేకుండా శంకర్రావు రాసిన లేఖను రాష్ట్ర హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ప్రతివాదులుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలు ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ శాఖలన్నింటినీ హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ మరో పిల్ దాఖలు చేశారు.

శంకర్రావు హైకోర్టుకు రాసిన లేఖ, తరువాత సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాలనే టీడీపీ నాయకులు యథాతథంగా తాము దాఖలు చేసిన పిటిషన్‌లో పొందుపరిచారు. వాస్తవానికి శంకర్రావు సమర్పించిన అఫిడవిట్‌ను తయారు చేసిందే తెలుగుదేశం పార్టీ వాళ్లే. అదే అఫిడవిట్‌లోని అంశాలను యథాతథంగా, కేవలం పేరా నెంబర్ల మార్పు తప్ప, మిగిలినవన్నీ మక్కీకిమక్కీగా తమ పిటిషన్‌లో దించేశారు. టీడీపీ దాఖలు చేసిన పిల్‌ను కూడా విచారించిన హైకోర్టు... ప్రతివాదులుకు నోటీసులు జారీ చేసి, ప్రభుత్వాన్ని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

కౌంటర్ దాఖలు చేయని సర్కారు: హైకోర్టునుంచి నోటీసులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కుట్రలో భాగంగా వ్యూహాత్మక మౌనం పాటించింది. కౌంటర్ దాఖలు చేస్తే, వాస్తవాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుందని, అదే జరిగితే జగన్‌ను ఈ కేసులో ఇరికించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయింది.

పతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేసినా, ప్రభుత్వం మాత్రం కౌంటర్లు దాఖలు చేయనేలేదు. చిన్న కేసులో కౌంటర్ దాఖలు చేయకుంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించే హైకోర్టు సైతం... జగన్ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోయినా ఏ మాత్రం స్పందించలేదు. ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసి ఉంటే... శంకర్రావు, టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవముందో తేలిపోయేది. కంపెనీలకు లబ్ధి చేకూరుస్తూ జీవోలు జారీ చేయడంలో మంత్రుల పాత్ర ఎంత..? అధికారుల పాత్ర ఎంత..? అనే విషయాలు ఆనాడే తేలిపోయేవి. అయితే వాస్తవాలు బయటకు వస్తే ప్రమాదమని భావించిన ప్రభుత్వం, చివరివరకు మౌనాన్నే పాటించింది. చివరకు హైకోర్టు చేసేదేమీ లేక, తాము చెప్పినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం సరికాదంటూ చిన్న అసంతృప్తితో సరిపుచ్చింది.

సహజ న్యాయసూత్రాలకు పాతర: సర్కారు నిర్లిప్తతను ఏమాత్రం పట్టించుకోని హైకోర్టు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది. దీనిపై జగన్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ దశలో జోక్యం చేసుకోలేమని, హైకోర్టు సహజ న్యాయసూత్రాలకు లోబడి వ్యవహరిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తరువాత సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ తాలూకు నివేదికను హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించారు. అయితే ఈ నివేదికను తమకివ్వాలని జగన్ కోరినా, హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదు.

దీంతో సుప్రీంకోర్టు చెప్పిన సహజ న్యాయసూత్రాలకు ఏ మాత్రం అర్థం లేకుండా పోయింది. అసలు శంకర్రావు, టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రాథమిక విచారణ నివేదికను కోరిన హైకోర్టు, చివరకు ఆ నివేదికను తెరవకుండానే ఆగస్టు 10, 2011న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం విశేషం. హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. జగన్‌మోహన్‌రెడ్డిని మొదటి నిందితునిగా పేర్కొంది. అంతేకాక హైకోర్టు చెప్పని అనేక విషయాలతో పాటు మహానేత రాజశేఖరరెడ్డి పేరును సైతం ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది. తరువాత దర్యాప్తు ప్రారంభించి ఈ ఏడాది జనవరి 2న ఆడిటర్ విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసింది.

అరెస్ట్‌కు ముందు ఆయనను దాదాపు 300 గంటలకు పైగా సీబీఐ ప్రశ్నించింది. అరెస్టయిన తరువాత ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకు సీబీఐ హడావుడిగా ఈ ఏడాది మార్చి 31న చట్ట ప్రకారం చెల్లుబాటు కాని అసంపూర్తి చార్జిషీట్ దాఖలు చేసింది. అటు తరువాత ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలనే పొందుపరుస్తూ మార్చి 28న రెండో చార్జిషీటు, అటు తరువాత ఏప్రిల్ 7న మూడో చార్జిషీట్ దాఖలు చేసింది. దర్యాప్తు పూర్తయిన తరువాత దాఖలు చేసేదే చార్జిషీట్ అవుతుందని, ఒక కేసులో ఇన్ని చార్జిషీట్లు దాఖలు చేయడం చెల్లదని సాయిరెడ్డి తరఫు న్యాయవాదులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. మొదటి చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.

ఢిల్లీ డెరైక్షన్‌లో సీబీఐ

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పది నెలలు కావస్తున్నా, ఇప్పటివరకు సీబీఐ అధికారులు జగన్ ఊసే ఎత్తలేదు. వచ్చే నెలలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఖాయం కావడంతో ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. సీబీఐ అధికారులకు జగన్‌ను గుర్తు చేశారు. జగన్ ఇలాగే ప్రజల్లో తిరుగుతుంటే డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని నిర్ణయించుకున్న ఢిల్లీ పెద్దలు సీబీఐకి దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే సీబీఐ అధికారులు ఈ నెల 25న తమ ముందు హాజరు కావాలంటూ జగన్‌కు సమన్లు జారీ చేశారు. అత్యవసరంగా అధికారులను పంపి, సమన్లను అందచేశారు. సీబీఐ రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేసేందుకు తనకు సమన్లు జారీ చేసిందని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు, 28న తాము సమన్లు జారీ చేసినందున సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు లేవని, మీది కేవలం ఆందోళన మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో జగన్ ఈ నెల 25న సీబీఐ అధికారుల ముందు హాజరై గంటల కొద్దీ వారి ముందు కూర్చొని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. చివరకు జగన్‌ను ఆదివారం రాత్రి 7.20 గంటలకు అరెస్ట్ చేశారు.
Share this article :

0 comments: