కుట్ర నిజమైంది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్ర నిజమైంది..

కుట్ర నిజమైంది..

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

* కుట్ర నిజమైంది... ‘ఢిల్లీ’ ఆదేశాలను అమలు చేసిన సీబీఐ
* అరెస్ట్ చేయబోరని వ్యాఖ్యానించిన సీబీఐ కోర్టు 
* కోర్టు అభిప్రాయాన్నీ అపహాస్యం చేసిన సీబీఐ 
* మూడు రోజులు విచారించి అరెస్ట్.. నేడు కోర్టుకు
* జగన్‌ను ఎన్నికల ప్రచారానికి దూరం చేయటమే లక్ష్యం
* ఉప ఎన్నికల వాయిదాకు హస్తిన పెద్దల పన్నాగం
* అరెస్ట్ వార్త తెలియకుండా కేబుల్ ప్రసారాలపై ఆంక్షలు 
* రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత అత్యవసర పరిస్థితి 
* వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల దాడులు, అరెస్టులు 
* అరెస్ట్‌కు కుట్ర కోణాన్ని ముందే వెల్లడించిన జగన్

జనస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోంది. జన నాయకుడిని జైలు గోడల మధ్య బంధించేందుకు బలస్వామ్యం అడ్డంగా బరితెగించింది. అధికార మదాంధులను ఎదిరించి జనం కోసం జనంతో నిలిచిన ఒకే ఒక్కడిపై చేస్తున్న కుట్రను పతాక స్థాయికి తీసుకెళ్లింది. జగన్ ప్రభంజనంలో తాము గల్లంతైపోతామన్న భయంతో ఢిల్లీ పెద్దలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా కుమ్మక్కై నడిపిన కుతంత్రాన్ని విజయవంతంగా అమలు చేశాయి. సర్కారు చేతుల్లో కీలుబొమ్మగా మారిన సీబీఐ ద్వారా జననేత జగన్‌ను అన్యాయంగా అరెస్ట్ చేయించాయి. ఈ క్రమంలో రాజకీయ, నైతిక, ప్రజాస్వామ్య విలువలన్నింటికీ నిట్టనిలువుగా పాతరేశారు. చివరికి జగన్‌ను అరెస్ట్ చేయబోరని పేర్కొన్న న్యాయస్థానం అభిప్రాయాన్నీ అపహాస్యం చేశారు.

ఈ అరెస్టుతో.. జగన్ ముందే వెల్లడించిన కుట్ర కోణాలు, ప్రజల అనుమానాలు అన్నీ నిజమేనని తేటతెల్లమైపోయింది. అల్లర్లు సృష్టించి ఉప ఎన్నికలను వాయిదా వేయించటం.. కుదరకపోతే కనీసం ఉప ఎన్నికల నేపథ్యంలో జగన్‌ను ప్రజల మధ్య లేకుండా చూడటం.. ఎన్నికల ప్రచారానికి దూరం చేయటం.. జగన్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయటం.. ఈ కుట్రదారుల లక్ష్యమని స్పష్టమైపోయింది. సర్కారు వారి కుట్ర జగన్ అరెస్టుతో ఆగలేదు... రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించారు. రాజధాని నగరం హైదరాబాద్ సహా రాష్ట్రంలో దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలతో పాటు కొన్ని జిల్లాలకు జిల్లాల్లోనే 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులోకి తెచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల దాడులు, అరెస్టులు, బైండోవర్లు, గృహనిర్బంధాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు భారీస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. వారందరినీ కూడా ఎన్నికల ప్రచారానికి, ప్రక్రియకు దూరంగా ఉంచటంతో పాటు.. వారిపై సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేయటమే ఇలా భయోత్పాతం సృష్టించటం వెనుక ఉద్దేశమన్నది విస్పష్టంగా తెలుస్తోంది.
 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఢిల్లీ పెద్దల డెరైక్షన్‌లో.. రాష్ట్ర సర్కారు, చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా చేస్తున్న రాజకీయ కుట్రలో ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. ఉప ఎన్నికల్లో జగన్ సునామీలో తమ పార్టీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమని నిర్ధారించుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు.. ఎన్నికలకు ముందుగా జన నాయకుడు జగన్‌ను జైలుకు పంపే కుతంత్రాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందించిన సంపూర్ణ సహకారంతో సీబీఐ అధికారులు ‘ఢిల్లీ’ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేశారు. 

‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’గా ఖ్యాతి గడించిన సీబీఐ.. ఆదివారం రాత్రి 7.20 గంటలకు అత్యంత హైడ్రామా నడుమ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. పెట్టుబడుల కేసులో ఈ నెల 28వ తేదీన (సోమవారం) సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. దానికి కొద్ది గంటల ముందు జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మూడు రోజులుగా జగన్‌ను హైదరాబాద్‌లోని దిల్‌కుశ అతిథిగృహంలో 25 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు.. ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయింది కాబట్టి.. చార్జిషీట్‌ను తాము విచారణకు స్వీకరించాము కాబట్టి.. సీబీఐ అధికారులు జగన్‌ను పిలిచింది విచారణాంశాలను ధ్రువీకరించుకోవటానికేనని.. ఆయనను అరెస్టు చేయబోరని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలిబుచ్చిన అభిప్రాయానికి విలువే లేకుండా పోయింది. 

జగన్ అరెస్ట్ విషయాన్ని ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆయనను ఆదివారం రాత్రి దిల్‌కుశ అతిథి గృహంలోనే ఉంచుతారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పుల్లయ్య ముందు హాజరుపరచనున్నారు. వాస్తవానికి జగన్‌ను ఆ సమయానికే కోర్టు ముందు హాజరు కావాలంటూ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. దీంతో సీబీఐ ఆ సమయానికే ఆయనను కోర్టు ముందు తప్పక హాజరుపరచాల్సి ఉంటుంది. సీబీఐ ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. 

సీబీఐ మార్కు అరెస్టు... 
అరెస్ట్‌లకు సంబంధించి గతంలో అమలు చేసిన విధానాన్నే జగన్ విషయంలోనూ సీబీఐ అమలు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించటం.. విచారణ పూర్తయి, ఇంటికెళ్లే దశలో విచారణకు పిలిపించిన వారిని అరెస్ట్ చేయటం సీబీఐ అమలు చేస్తూ వస్తున్న విధానం. ఆదివారం జగన్ విషయంలోనూ సీబీఐ ఇలానే వ్యవహరించింది. గత రెండు రోజులుగా 15 గంటలకు పైగా జగన్‌ను విచారించిన సీబీఐ అధికారులు.. మూడో రోజైన ఆదివారం కూడా ఆయనను సుదీర్ఘంగా విచారించారు. గత రెండు రోజులుగా సీబీఐకి పూర్తి స్థాయిలో సహకరించిన జగన్.. మూడో రోజు కూడా వారు అడిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. 

ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఆడిటర్ విజయసాయిరెడ్డి, పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, జూపూడి ప్రభాకరరావు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరితో కలిసి జగన్ సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకు జగన్‌ను విచారించారు. సాయంత్రం విచారణ పూర్తి కాగానే.. మొదటి రెండు రోజుల తరహాలోనే జగన్ ఇంటికి వెళ్లిపోతారని అందరూ భావించారు. జగన్‌ను విచారించిన సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ సైతం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో దిల్‌కుషా అతిథిగృహం నుంచి వెళ్లిపోయారు. దీంతో జగన్ తిరిగి ఇంటికెళ్లటం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 

జేడీ బయటకు రాగానే ఎల్లో మీడియాకు ఎప్పటిలాగే లీకులు వెళ్లాయి. జగన్‌ను అరెస్ట్ చేయనున్నారంటూ ఎల్లో మీడియాకు చెందిన టీవీ చానళ్లలో స్క్రోలింగ్స్ మొదలయ్యాయి. ఇదే సమయంలో పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రెచ్చిపోయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం, గృహ నిర్భంధాలు చేయటం ప్రారంభించింది. జగన్‌ను సోమవారం ఉదయం కోర్టు ముందు హాజరుపరచనున్న నేపథ్యంలో.. నాంపల్లి కోర్టు చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలల పాటు నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించటంతో పాటు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అరెస్ట్‌ను సీబీఐ అధికారికంగా దృవీకరించటానికి ముందు.. జగన్‌ను అరెస్ట్ చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. జగన్ అరెస్ట్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. 

అప్రకటిత ఎమర్జెన్సీ...
ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సీబీఐ హడావుడి మొదలుపెట్టింది.. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటిలాగే సీబీఐ ఎల్లో మీడియాకు లీకులిచ్చింది. దీంతో ప్రభుత్వం, పోలీసులు కూడబలుక్కుని రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే విధంగా రాష్ట్రాన్ని అష్టదిగ్బంధం చేశాయి. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు ముందు ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముందుగా హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరింప చేశారు. ఆ రెండు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్ప సామాన్య ప్రజలు, జగన్ అభిమానులెవరూ ఉండవద్దంటూ వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఒక దశలో లోటస్‌పాండ్ నుంచి మీడియా వాహనాలను కూడా పంపేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. 

ఇక జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి చోటా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రధాన కూడళ్లన్నింటిలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని స్పెషల్ బెటాలియన్‌ను కూడా హైదరాబాద్‌కు తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ జిల్లాల ముఖ్య నాయకులు కొండా మురళి, జక్కంపూడి విజయలక్ష్మి, బెక్కం జనార్దన్‌రెడ్డి, సుమతీ మోహన్‌లతో పాటు పలువురిని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 

అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసుశాఖ దాష్టీకం ప్రదర్శించింది. వందల సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం రాత్రే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయాలని డీజీపీ వి.దినేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డిలకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించిన పోలీసుశాఖ అరెస్టుల పర్వానికి తెరలేపింది. 

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఒక బస్సును గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన వ్యవహారంతో ఎలాంటి సంబంధంలేని ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసుశాఖ కుట్ర కేసు నమోదుచేయడం ద్వారా భయబ్రాంతులకు గురిచేసింది. ఏదైనా నిరసనలు చేస్తే ఇదేవిధంగా కే సులు నమోదు చేసి జైలుకు పంపుతామంటూ పోలీసులు ఎక్కడికక్కడ బెదిరింపులకు దిగారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా బెదిరింపులకు దిగారు. ఆదివారం రాత్రి కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. 

శాంతిభద్రతలపై 4 గంటలకే హోంమంత్రి ప్రకటన 
రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలంటూ ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు పక్కా ప్రణాళికను అమలు చేసినట్లు ఇట్టే అర్ధమవుతోంది. రాజధాని నగరంలో 144 సెక్షన్ పేరుతో దిల్‌కుశ అతిథి గృహం, జగన్ నివాసమైన లోటస్ పాండ్ పరిసరాలను పూర్తిగా మూసివేశారు. ట్రాఫిక్‌ను మళ్లించటంతో మూడో రోజు కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలుపుదల 
బస్సులను తిప్పవద్దంటూ పోలీసులు ఆదేశాలివ్వటంతో ఆర్‌టీసీ అధికారులు పలు జిల్లాల్లో బస్సు సర్వీసులను నిలిపివేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని సర్వీసులను రద్దు చేశారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 80 శాతం ఆర్‌టీసీ బస్సులను వెనక్కు పంపించినట్లు సమాచారం. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు చెందిన నాయకుల ఇళ్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఒంగోలులో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌కు కూడా భద్రత పెంచారు. 

కేబుల్ ప్రసారాల నిలుపుదల... 
జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు విషయం ప్రజలు తెలుసుకోకుండా నిరోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ప్రసారాలను కూడా నిలుపుదల చేశారు. జగన్ విచారణ ప్రారంభమైన శుక్రవారం నుంచే అనేక చోట్ల కేబుల్ ప్రసారాలు రాకుండా ప్రభుత్వం, పోలీసు శాఖ అడ్డుకుంది. చాలా చోట్ల విద్యుత్ ప్రసారాలను కూడా నిలిపివేశారు. అదేమని ప్రశ్నించిన సాధారణ ప్రజానీకానికి సైతం పోలీసుల నుంచి బెదిరింపులు తప్పలేదు. టీవీ చానల్ ప్రసారాలు చేయకుండా కేబుల్ ఆపరేటర్లను సైతం పోలీసులు బెదిరించారు. 

దిల్‌కుశ దగ్గర అదనపు బలగాల మోహరింపు 
సీబీఐ తాత్కాలిక కార్యాలయం దిల్‌కుశ అతిథిగృహం వద్ద పోలీసు బలగాలను రెట్టింపు చేశారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర పారా మిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించారు. వాటర్ కెనాన్‌లు, టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులన్నింటినీ దిగ్బంధనం చేశారు. భారీగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటుచేశారు. 

ఏయే సెక్షన్ల కింద కేసంటే...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) కింద ఆయనపై ఆరోపణలు చేశారు. కేసు నమోదు సమయంలో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సెక్షన్ల ఆధారంగానే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఐపీసీ 120బి (నేరపూరిత కుట్ర), ఐపీసీ 409(నమ్మక ద్రోహం), ఐపీసీ 420 (మోసం), ఐపీసీ 477ఏ (తప్పుడు లెక్కలు చూపటం), అవినీతి నిరోధక చట్టం 1988 లోని సెక్షన్ 13(1) (అధికార దుర్వినియోగానికి పాల్పడటం. అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా ఇతరుల నుంచి విలువైన వస్తువులను పొందటం. అక్రమ లబ్ధి పొందటం.) అవినీతి నిరోధక చట్టం 1988 లోని సెక్షన్ 13(2) (అధికార దుర్వినియోగం) సెక్షన్ల కింద జగన్‌పై కేసులు నమోదు చేశారు.

నేడు వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేతల భేటీ
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో సోమవారం పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. నగరంలో అందుబాటులో ఉన్న పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు (సీజీసీ), కేంద్ర కార్యనిర్వాహక సభ్యులు (సీఈసీ) పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణను రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: