ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు!

ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు!

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన చార్జిషీట్‌ను
సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడాన్ని సవాల్ చేసిన విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ 


వాదనలు వినిపించిన పద్మనాభరెడ్డి, సుశీల్‌కుమార్ 
సీబీఐ తీరు నిబంధనలకు విరుద్ధం
హైకోర్టు నిర్దేశించినట్టు కాకుండా తనకిష్టమొచ్చినట్టు చేస్తోంది 
రోజుకో చార్జిషీటు దాఖలు 
ఇలా చేయడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు 
కోర్టు విచారణకు స్వీకరించడం కూడా చెల్లదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం లో సీబీఐ ఇష్టారాజ్యంగా దర్యాప్తు సాగిస్తోందని సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి కోర్టుకు నివేదించారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా కాక, తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు చేస్తోందని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు, చార్జిషీట్ దాఖలు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు.

ఈ కేసులో దర్యాప్తు పూర్తి కాకుండానే గత మార్చి 31న సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించడాన్ని సవాలు చేస్తూ ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర ప్రసాదరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి బెజ్జారం చంద్రకుమార్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.పద్మనాభరెడ్డి, సుశీల్‌కుమార్ తమ తమ వాదనలను వినిపించారు. 

మొదట పద్మనాభరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో సీబీఐ రోజుకో చార్జిషీట్ దాఖలు చేస్తోందని తెలిపారు. చట్ట ప్రకారం దర్యాప్తు పూర్తయిన తరువాత దాఖలు చేసే తుది నివేదికే చార్జిషీట్ అవుతుందని, అయితే సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చేయకుండా చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారని వివరించారు. ఇలా అసంపూర్తి దర్యాప్తుతో దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించిందని, ఇలా చేయడం చట్ట విరుద్ధమని ఆయన కోర్టుకు నివేదించారు. 

వేర్వేరుగా దాఖలు చేసే చార్జిషీట్లను ఏమనాలి?
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పలువురు వ్యక్తులను, కంపెనీలను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, అటు తరువాత ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణల, వ్యక్తుల ప్రస్తావన లేకుండా ఈ ఏడాది మార్చి 31న సీబీఐ చార్జిషీట్‌ను దాఖలు చేసిందని వివరించారు. ఈ కేసులో ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ రాకూడదనే ఏకైక లక్ష్యంతో.. సీబీఐ అధికారులు ఆ చార్జిషీట్‌ను హడావుడిగా దాఖలు చేశారని తెలిపారు. 

ఒకసారి చార్జిషీట్ దాఖలు చేశారంటే చట్ట ప్రకారం దర్యాప్తు పూర్తయినట్లు లెక్కని, అయితే సీబీఐ అధికారులు మాత్రం ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు దాఖలు చేస్తూ.. ప్రతిసారీ ఇంకా దర్యాప్తును కొనసాగిస్తున్నామని కోర్టుకు చెబుతున్నారని వివరించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు సైతం ఇలా దాఖలు చేస్తున్న చార్జిషీట్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వాటిని విచారణకు స్వీకరిస్తోందని తెలిపారు. మొదటి చార్జిషీట్‌ను ఒరిజినల్ అని చెప్పిన సీబీఐ, తరువాత దాఖలు చేసే చార్జిషీట్లను కూడా ఒరిజినల్ అని చెబుతోందని, ఒక కేసులో మొదట దాఖలు చేసే చార్జిషీట్ మాత్రమే ఒరిజినల్ అవుతుందని, మిగిలినవన్నీ అనుబంధ చార్జీషీట్లు అవుతాయని, అయితే సీబీఐ మాత్రం ప్రతి చార్జిషీట్‌ను స్వతంత్ర చార్జిషీట్‌గా పరిగణిస్తూ, ప్రతి దానికి సీసీ నంబర్ కేటాయించాలని కోరుతోందని పద్మనాభరెడ్డి తెలిపారు. 

ఇలా దాఖలు చేస్తున్న చార్జిషీట్లు చట్ట ప్రకారం చెల్లుబాటు కావని, వాటిని విచారణకు స్వీకరించడం కూడా చెల్లదని ఆయన తెలిపారు. కొత్త విషయాలు, వాస్తవాలను వెలుగు చూస్తేనే, సెక్షన్ 173 (8) కింద తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చునని, అయితే సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేయకుండానే తొలి చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. దర్యాప్తు పూర్తి కాకుండానే దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించడం, తదనుగుణంగా సమన్లు జారీ చేయడం ద్వారా సీబీఐ కోర్టు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయిందని వివరించారు. చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ, తదనుగుణంగా సమన్లు జారీ చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. 

దర్యాప్తు పూర్తికాకుండానే చార్జిషీట్లు: తరువాత సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. ఈ మొత్తం కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనివారిని సీబీఐ అధికారులు నిందితులుగా చేర్చారని వివరించారు. ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు దాఖలు చేయడానికి వీల్లేదని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించిందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో లేని అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు, సీబీఐ దర్యాప్తును కొనసాగింవచ్చునని, అయితే సీబీఐ అధికారులు అసలు ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలకు సంబంధించే దర్యాప్తును పూర్తి చేయలేదని, అలాంటప్పుడు చార్జిషీట్లు ఎలా దాఖలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తి.. సీబీఐ వాదనల నిమిత్తం విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Share this article :

0 comments: