విచారణకు సహకరించట్లేదని సీబీఐ వారు అంటున్నారు. ఒక్కసారి మీరు ఆ సమయంలోని సీడీలు పరిశీలిస్తే మీకే తెలుస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విచారణకు సహకరించట్లేదని సీబీఐ వారు అంటున్నారు. ఒక్కసారి మీరు ఆ సమయంలోని సీడీలు పరిశీలిస్తే మీకే తెలుస్తుంది

విచారణకు సహకరించట్లేదని సీబీఐ వారు అంటున్నారు. ఒక్కసారి మీరు ఆ సమయంలోని సీడీలు పరిశీలిస్తే మీకే తెలుస్తుంది

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

* సీబీఐకి పూర్తిగా సహకరించా; ఒక్కసారి ఆ సీడీలు చూడండి
* నాకు తెలిసిందంతా చెప్పా; వాళ్లు కోరినట్టు చెప్పలేదంతే!
* ప్రచారం కోసం 15 రోజులు ఆగమంటే కుదరదన్నారు
* విదేశీ సంస్థల ద్వారా వచ్చిన డబ్బులు నావే అంటున్నారు
* అలాగైతే మళ్లీ ఆ షేర్లను ఎక్కువ సొమ్ముకు ఎందుకు కొంటాను?
* ‘ఈనాడు’ షేర్ రూ.5.28 లక్షలకు అమ్మినా తప్పు కాదట?
* సర్క్యులేషన్ పరంగా దేశంలోనే 8వ స్థానంలో ఉన్న ‘సాక్షి’ షేరు విలువ రూ.350 ఉండటం తప్పట?

హైదరాబాద్, న్యూస్‌లైన్: సమయం సాయంత్రం 4 గంటలు... నాంపల్లిలోని సీబీఐ కోర్టు... ఉదయం నుంచి జరిగిన వాదోపవాదనలపై న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. జడ్జి బెంచ్ మీదకు రావడంతోనే కోర్టు హాలులో ఉన్న అందిరిలోనూ ఒకటే ఉత్కంఠ. అప్పటి వరకు పక్కనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గదిలో ఉన్న వైఎస్ జగన్‌ను సైతం సీబీఐ అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తీర్పు వెలువరించేందుకు జడ్జి సిద్ధమవుతుండగా.. అప్పుడే లేచిన జగన్ తరఫు న్యాయవాది, ‘కొన్ని విషయాలు జగన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. రెండు నిమిషాల సమయం కావాలి’ అని న్యాయమూర్తిని కోరారు. ఆయన అంగీకరించడంతో కోర్టు హాలు సెలైంట్‌గా మారిపోయింది. జగన్ ఏం చెబుతారా అనే ఆతృతతో అందరి దృష్టి ఆయనపైనే నిలిచింది. సవినయంగా చేతులు జోడించి న్యాయమూర్తికి నమస్కరించిన వైఎస్ జగన్.. తన మనసులోని మాటల్ని, వాస్తవాల్నీ ఇలా బయటపెట్టారు...

‘‘జడ్జి గారూ! మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను శిరసావహిస్తా. అయితే దానికి ముందు ఈ కేసు గురించి, సీబీఐ చేస్తున్న ఆరోపణల గురించి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఈ కేసు పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో పెట్టినది. అయినా ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను. కేవలం కొన్ని అంశాల్ని మాత్రమే రెండు నిమిషాల్లో మీ దృష్టికి తీసుకు వస్తా. నేను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నన్ను నమ్ముకుని, నాపై ఆధారపడి ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులున్నారు. పదో తేదీ వరకు ప్రచారం చేసుకునే అవకాశముంది. అదే కోరా... సీబీఐ కాదంది. ఈ రోజు ఎన్నికలకు కేవలం 10, 12 రోజుల ముందు నన్ను అరెస్టు చేసింది.. నన్ను ఎన్నికల ప్రచారంలో తిరగకుండా ఆపడానికే.

నాపై సీబీఐ ముఖ్యంగా 3 ఆరోపణలు చేసింది
* సాక్షి షేర్‌ను రూ.350కి అమ్మానని, అది తప్పని సీబీఐ చెప్పినప్పుడు నాకు బాధనిపించింది. సర్క్యులేషన్ పరంగా దేశంలో ఎనిమిదో స్థానంలో ఉన్న, రూ.6,000 కోట్ల వాల్యూయేషన్ ఉన్న సాక్షికి ఆ మాత్రం విలువ లేదా సార్! సాక్షి షేర్లను బయటి ఇన్వెస్టర్లకు కేటాయించడానికి ఏడు నెలల ముందే ‘ఈనాడు’ తన రూ.100 షేర్‌ను రూ.5,28,000కి అమ్ముకుంది. అప్పటికి ఆ కంపెనీ రూ.1,800 కోట్ల సంచిత నష్టాల్లో నడుస్తోంది. వారిది తప్పు కాదట. అది తప్పుగా అనిపించలేదా?

* విచారణకు సహకరించట్లేదని సీబీఐ వారు అంటున్నారు. ఒక్కసారి మీరు ఆ సమయంలోని సీడీలు పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. ఈ రోజు (సోమవారం) మీ ముందుకు రావాల్సి ఉన్నా.. 25నే రమ్మని సీబీఐ పిలిచింది. ప్రచారంలో ఉన్న నాకు అది కష్టమైనా వచ్చా. మూడు రోజులు వారికి పూర్తిగా సహకరించా. ఆదివారం కూడా రమ్మంటే హాజరయ్యా. వారు అడిగిన ప్రతిదానికీ సమాధానం చెప్పా. అయితే సీబీఐకి కావాల్సింది నేను చెప్పలేకపోయా! నాకు తెలిసింది మాత్రమే చెప్పా. తప్పు చేయని ఓ వ్యక్తిని, చేశానంటూ చెప్పమంటే ఎలా చెప్తా? ప్రజాస్వామ్యంలో కో ఆపరేట్ చేయడమంటే వాళ్లకు కావాల్సింది నేను చెప్పడం కాదు, నాకు తెలిసిన నిజాలను చెప్పడం. దాన్ని కో ఆపరేట్ చేయకపోవడంగా వాళ్లు చెప్పడం భావ్యం కాదు. సీబీఐ నాణానికి ఒకవైపే చూస్తోంది, విచారిస్తోంది. దాన్నే కోర్టుకు చూపిస్తోంది. ఇది కూడా నాకు బాధ కలిగించింది. నాణానికి మరో వైపును నేను కోర్టుకు చెప్పాలనుకుంటున్నాను.

*ప్లూరీ, 2ఐ ల ద్వారా నా సంస్థలోకి రూ.140 కోట్ల వచ్చాయని, ఆ డబ్బు నాదేనని, అటు వెళ్లి, ఇటు వచ్చిందని సీబీఐ ఆరోపిస్తోంది. వాస్తవానికి వారి నుంచి పెట్టుబడిగా వచ్చింది రూ.120 కోట్లే. అది నా డబ్బే అయితే, వారి దగ్గర ఉన్న షేర్లను కొన్నదాని కంటే ఎక్కువ ఇచ్చి ఎందుకు వెనక్కు తీసుకుంటాను? నా డబ్బులే అయితే నేనే పెట్టుకుంటాను కదా! ఇదంతా తప్పుడు సమాచారమని సీబీఐకి తెలిసి కూడా, అసలు సమాచారాన్ని దాచి మీ ముందు వాదించింది. ఇది బాధనిపించి మీకు చెబుతున్నాను.

ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తా!!!’’ అంటూ జగన్ ముగించారు. అంతా విన్నాక న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధింపు, బెయిల్ పిటిషన్ డిస్మిస్ విషయాలు విన్న జగన్ ముఖంపై, చెరగని చిరునవ్వుతో న్యాయమూర్తికి నమస్కరించి వెళ్లారు.
Share this article :

0 comments: