సాక్షిని ఏమీ చేయలేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షిని ఏమీ చేయలేరు

సాక్షిని ఏమీ చేయలేరు

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

సాక్షి మూతపడుతుందని ఎల్లో మీడియా శివతాండవం చేస్తోంది
పత్రిక గొంతు నొక్కడం ద్వారా జగన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు
తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా న్యాయం, ధర్మానిదే అంతిమ గెలుపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి అందరూ కట్టగట్టుకుని వచ్చినా సాక్షిని ఏమీ చేయలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సాక్షి’ పత్రిక, టీవీ చానల్ ఆవిర్భవించిన నాటి నుంచీ ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాటి గొంతును నులిమివేయాలన్నదే ఎజెండాగా పెట్టుకున్నారని.. అందులో భాగంగానే నిత్యం వ్యతిరేక వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. సాక్షి ఖాతాలను సీబీఐ స్తంభింపజేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటి ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని ప్రచారం చేస్తూ.. సాక్షి మూతపడుతుందని, చానల్ ఉండదని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, వారి చానళ్లు కొద్ది రోజులుగా శివతాండవం చేస్తున్నాయని దుయ్యబట్టారు. 

సాక్షి మీడియాపై ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులు ఎంత కక్ష గట్టి వ్యవహరిస్తున్నారో దీనిని బట్టి అర్థమవుతోందన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశమని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మమేనని.. అందుకే తాము తుదికంటా పోరాడుతామన్నారు. సాక్షి పత్రికకూ, చానల్‌కూ ప్రకటనలు నిలిపివేస్తూ జారీ అయిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. అసలు అవినీతికి కారణమని చెబుతున్న 26 జీవోలు అక్రమమో, సక్రమమో తేల్చకుండా సాక్షిని అణచివేయాలన్న కాంగ్రెస్, టీడీపీ ఆలోచనలకు అనుగుణంగా సీబీఐ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పత్రిక గొంతును నొక్కివేయడం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బ తీయాలన్నదే వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. అయితే ఇలాంటి చర్యలకు, తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడం ఖాయమని ఉద్ఘాటించారు. దీనికి సంబంధించి నీల్సన్ సంస్థ చేసిన సర్వే వివరాల ప్రతిని విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.

కల్లు తాగిన కోతుల్లా: చెడు వినకు, కనకు, మాట్లాడకు అనేది మూడు కోతుల చిహ్నమని, కానీ ఇక్కడ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి అనే మూడు కోతులు.. కల్లు తాగి పిచ్చి పట్టిన కోతుల్లా ఇష్టానుసారం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని అంబటి మండిపడ్డారు. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేకపోవడంతో వీరిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘సాక్షిలో అన్నీ అవినీతి పెట్టుబడులంటూ ఆరోపణలు చేస్తున్న వీరికి.. పెట్టుబడులు పెట్టే సమయంలో అది కనిపించలేదా? అప్పుడు ఏమైనా కోమాలో ఉన్నారా’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసలు ‘క్విడ్ ప్రొ కో’ ఉందా లేదా అనేది తేల్చకుండా కేవలం సాక్షిలో పెట్టుబడులు పెట్టినందుకు నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేయడం ఎంత మాత్రం సరికాదన్నారు. సోనీ సంస్థ తొలుత ఈటీవీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని చూసిందని, కానీ వాటిలో అంత సరుకు లేదని తెలిశాక నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మాటీవీలో పెట్టుబడులు పెట్టిందన్నారు. అప్పటినుంచీ తనకు రావాల్సిన అవకాశం మాటీవీకి వెళ్లిందే అన్న దుగ్ధతో నిమ్మగడ్డపై రామోజీరావు కక్ష గట్టి ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను అణగదొక్కడానికి రామోజీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సాక్షి పత్రికను మూసివేయడం గానీ, చానల్‌ను నిలిపివేయడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని అంబటి విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: