సత్యమేవ జయతే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే!

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

‘పోగాలము దాపురించినవారు దీప నిర్వాణగంధమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు, వినరు...’ అని నీతి చంద్రికలోని ఒక సంభాషణ చెబుతుంది. కాంగ్రెస్ పాలకులు ఇప్పుడా అవస్థలో ఉన్నారు. తమ పాపాలను ప్రశ్నిస్తూ, నిజాలను నిర్భయంగా బయటపెడుతున్న ‘సాక్షి’పై అక్కసుతో రగిలి పోతున్నారు. అధికారం మరికొన్ని అడుగుల దూరంలోనే ఉందనుకున్నంతలో తమ తొమ్మిదేళ్ల నిర్వాకాన్ని, పాలకపక్షంతో కుమ్మక్కయిన తీరును ఎప్పటికప్పుడు నడిబజారుకు ఈడుస్తోందన్న కక్షతో ఉన్న తెలుగుదేశాధినేత వీరికి గొంతు కలిపారు. అందరూ కలిసి ఏదో వంకతో, ఇంకేదో ఆరోపణతో ‘సాక్షి’ గొంతు నులమాలని శతథా ప్రయత్నిస్తున్నారు. 

గత ఏడాదిగా సాగుతున్న ఈ కుట్రల పరంపరలో ఇప్పుడు తాజా అంకానికి తెరలేచింది. వేలాదిమంది సిబ్బందితో పనిచేస్తూ కోట్లాది మంది పాఠకుల అభిమానం చూరగొన్న ‘సాక్షి’ ఆర్థిక వనరుల్ని స్తంభింపజేసి, తమకు అడ్డూ ఆపూ లేకుండా చేసుకోవాలని పాలకులు కొత్త ఎత్తులేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి తాము రాసిందే రాతగా, గీసిందే గీతగా రాష్ట్రంలో చలా మణీ చేసుకున్న మీడియా సంస్థలు ఈ పాలకులకు తోడయ్యాయి. పర్యవసానంగానే అధికారపక్షానికి పరిచారికగా పనిచేయడంలో సాటిలేని మేటిగా నిరూపించుకున్న సీబీఐ మరింత బరితెగించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల ఖాతాల్లో లావాదేవీలు స్తంభింపజేయాలంటూ రెండు బ్యాంకులకు నోటీసులు జారీచేసింది. 

‘సాక్షి’లోకి అక్రమ పెట్టుబడులు వచ్చాయంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణల్లో కొత్తేమీ లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ ఈ వాదనకు తెరలేపింది. దానిపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘ చర్చ జరిగింది. అన్నింటికీ సవివరంగా వైఎస్ సమాధానాలిచ్చారు. ‘సాక్షి’సైతం ఆ ఆరోపణల్లోని డొల్లతనాన్ని తెలుగు ప్రజానీకం ముందు పరిచింది. వైఎస్ కనుమరుగైన తర్వాత ఈ ఆరోపణలనే ఆసరా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో అటు అధికారపక్షమూ, ఇటు ప్రతిపక్షమూ కుమ్మక్కై కోర్టు గడప తొక్కాయి. 

న్యాయస్థానం ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిననాటినుంచీ ఆ పేరుతో సీబీఐ తెరవెనక చేసిందంతా విష ప్రచారమే. ఈ నంగనాచితనానికి యెల్లో మీడియా పతాకస్థాయినిచ్చి పండుగచేసుకోవడం తెలుగు ప్రజలకు తెలియందేమీ కాదు. ఆ కథనాలకు సైతం ‘సాక్షి’ ఎప్పటికప్పుడు వివరణలను ఇస్తూనే ఉంది. అందులోని కంతల్ని బయటపెడుతూనే ఉంది. సీబీఐకి అది కంటగింపైంది. అందుకే సంస్థ ఖాతాల్ని స్తంభింపజేయాలని, తద్వారా అటు భావవ్యక్తీకరణ స్వేచ్ఛనూ, ఇటు ప్రజలకు గల సమాచారం తెలుసుకొనే హక్కునూ కాలరాయాలని ప్రయత్నిస్తోంది. చార్జిషీట్లలో అసలు ప్రస్తావనే లేని ఇందిరా టెలివిజన్ ఖాతాను కూడా స్తంభింపజేశా రంటేనే సీబీఐ దుష్టపన్నాగం ఏ స్థాయికి చేరుకుందో సులభంగానే గ్రహించవచ్చు.

ఇంతకూ సీబీఐ ఇంతవరకూ పెట్టిన మూడు చార్జిషీట్లలో ఏముంది? అందులో ఎఫ్‌ఐఆర్ నిండా ఉన్న ఆరోపణల్ని మరోసారి ఏకరువు పెట్టడం ఉంది. తన వాదనల్ని తనే ఖండించుకున్న వైనముంది. అంతకుమించి అసంగతమైన అంశాలు, అనౌచిత్యమైన విషయాలు ఆ మూలనుంచి ఈ మూలవరకూ ఉన్నాయి. కొన్ని ఫార్మా సంస్థలు ప్రభుత్వం నుంచి రూ. 16 కోట్లు లబ్ధిపొందడంవల్ల ‘సాక్షి’లో రూ.30 కోట్లు పెట్టుబడులు పెట్టాయని తొలి చార్జిషీటు ఏకరువుపెట్టింది. రెండో చార్జిషీటు ఇందుకు పూర్తిగా విరుద్ధమైన కథనాన్ని వినిపించింది. 

కంపెనీకి లేని విలువను చూపించి ఇన్వెస్టర్లను మాయచేసి పెట్టుబడులు పెట్టించారని ఆ చార్జిషీటు చెప్పుకొచ్చింది. మూడో చార్జిషీటు మరీ వింతగా ఉంది. పరవాడ ఫార్మా సెజ్‌లో రాంకీ సంస్థకు బాబు సర్కారు 2,100 ఎకరాలు కేటాయించగా, అందులో గ్రీన్ బెల్ట్‌ను తగ్గిస్తూ వైఎస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థకు 50 ఎకరాలు కలిసొచ్చి ‘సాక్షి’లో రూ.10 కోట్లు పెట్టుబడులు పెట్టిందని సీబీఐ ‘తేల్చింది’. జనంనుంచి పన్నుల రూపంలో గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న సొమ్మును జీతభత్యాలుగా తీసుకుంటూ ఇంత యాంత్రికంగా దర్యాప్తు చేస్తున్న తీరు, కేసు నడిపిస్తున్న తీరు నిజంగా దిగ్భ్రాంతిపరుస్తున్నది. 

నిజాయితీ, నిష్పాక్షికత ఉంటే దర్యాప్తు చేసే క్రమంలో ఎన్నో అంశాలు తారసపడతాయి. వాటి మూలాల్లోకి సైతం వెళ్తే అసలు దొంగలెవరో తేలుతుంది. నేర పరిశోధనా క్రమంలో సాధారణ స్థాయి కానిస్టేబులైనా సులభంగా గ్రహించే ప్రాథమిక అంశమిది. కానీ, దురదృష్టమేమంటే సీబీఐలో ఈ మాత్రం గ్రహింపు లోపించింది. బీజేపీ నాయకుడు బంగారు లక్ష్మణ్‌ను లంచం కేసులో పట్టించిన శామ్యూల్ మాథ్యూస్ ఈమధ్య మొత్తుకున్నది ఇదే. 

ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ ఈమధ్య లోకానికి వెల్లడించిన టట్రా ట్రక్కుల కుంభకోణం గురించి శామ్యూల్ 11 ఏళ్లక్రితమే 105 టేపుల్లో సీబీఐకి పక్కా సమాచారం అందించినా ఆ సంస్థ మన్నుతిన్న పాములా ఉండిపోయింది. టట్రా ట్రక్కుల అధినేత రాజీవ్‌గాంధీ సన్నిహితుడైనం దువల్లో, ఆ టేపులు వినడానికి తీరిక లేకపోవడంవల్లో సీబీఐ అటువైపు దృష్టి సారించలేదు. దేశాన్ని కుదిపేసిన ఘటనల్లో సైతం సీబీఐ దర్యాప్తు ఇంత ప్రశ్నార్థకంగా ఉంటే, ఇక ‘సాక్షి’పై సాగిన దర్యాప్తు గురించి చెప్పేదేముంది? చంద్రబాబు జోలికెళ్లకపోవడంలో ఆశ్చర్యమేముంది?

ఇన్ని లొసుగులతో, ఇంత బోలుగా జరిగిన దర్యాప్తు ఆధారంగా ఖాతాలను స్తంభింపజేయడానికి సీబీఐ ప్రయత్నిస్తే పాలక, ప్రతిపక్షాలు దానికి వంతపాడటం వింతల్లోకెల్లా వింత. ఈ చర్య ఫలిస్తే, ప్రత్యామ్నాయ మీడియా కనుమరుగైతే తాము మళ్లీ గత వైభవంతో వెలిగిపోవచ్చని, పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోవచ్చని యెల్లో మీడియా ఆత్రుతపడటం నైచ్యం. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి జాగీరో కాదు. ‘సాక్షి’ని ప్రాణప్రదంగా గుండెల్లో పెట్టుకుని చూసుకున్న అశేష పాఠకలోకమే ఈ కుట్రలను తుత్తునియలు చేస్తుంది. నియంతల అహంకారానికి, వారికి వంతపాడుతున్న వందిమాగధులకు తిరుగులేని జవాబిస్తుంది. సత్యాన్ని చిదిమేయడం ఎవరివల్లా కాదు. ఈ అర్భక పాలకుల వల్ల అసలే కాదు. సత్యమేవ జయతే!
Share this article :

0 comments: