‘ ఈనాడు’లో సగం విలువ చెయ్యదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ ఈనాడు’లో సగం విలువ చెయ్యదా?

‘ ఈనాడు’లో సగం విలువ చెయ్యదా?

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

‘‘మా కంపెనీ షేర్‌ను రూ.350కి విక్రయించడాన్ని సీబీఐ తప్పుబడుతోంది. మరి మా కంపెనీ షేర్లను ఇతరులకు కేటాయించడానికి సరిగ్గా 7 నెలల ముందు ‘ఈనాడు’ కూడా తన వాటా విక్రయించింది. రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉండి కూడా అది రూ.6,800 కోట్ల వాల్యుయేషన్‌తో 100 రూపాయల విలువ గల ఒక్కో షేరును రూ.5,28,630 చొప్పున విక్రయించింది. మరి దేశంలోనే 8వ స్థానంలో ఉన్న ‘సాక్షి’ పత్రిక వాల్యుయేషన్ దాన్లో సగం కూడా చెయ్యదా? ఆ ధరకు బయటివాళ్లకు షేర్లు కేటాయించటం తప్పా సార్?’’

ఇదీ... సోమవారం సీబీఐ కోర్టులో న్యాయమూర్తికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విన్నపం.

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి):నేరుగా న్యాయస్థానంలోనే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ‘ఈనాడు’ పత్రిక వాల్యుయేషన్‌ను ప్రస్తావించటం, దాన్లో సగం విలువ కూడా ‘సాక్షి’కి ఉండటం తప్పా సార్? అని ప్రశ్నించటం మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయమయింది. మంగళవారం ఒక చానల్ యాంకర్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘‘జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా కోర్టులోనే ఈనాడు వాల్యుయేషన్‌ను ప్రస్తావించారు. కాబట్టి మీరు దీన్ని సమర్థిస్తారో లేదో చెప్పాల్సి ఉంది’’ అని తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. దీనికి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సమాధానమిస్తూ... ఈనాడు 35 ఏళ్లుగా మార్కెట్లో ఉందని, రామోజీ ఫిలిం సిటీ వంటి ఆస్తులు దానికి ఉన్నాయని, అందుకని ఆమాత్రం వాల్యుయేషన్ కరెక్టేనని చెప్పారు. 

కానీ వాస్తవమేంటంటే ‘ఈనాడు’ అనేది ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో భాగం. దానికి ఈనాడు పత్రిక, ఈటీవీ చానళ్లు తప్ప వేరే ఆస్తులేవీ లేవు. వాటినే రూ.6,800 కోట్లుగా విలువ కట్టి, కొంత వాటాను ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించారు. రిలయన్స్ నేరుగా కాక పదులకొద్దీ గొట్టాం కంపెనీల్ని ఏర్పాటు చేసి... ఆ గొట్టాల ద్వారా ‘ఈనాడు’లోకి రూ.2,600 కోట్ల మొత్తాన్ని ప్రవహింపజేసింది. బహుశా! ఇవి తెలియకో, లేక తెలిసీ ఉద్దేశపూర్వకంగానో తెలుగుదేశం ప్రతినిధులు దీన్ని కప్పిపుచ్చి ఉండొచ్చు.

ఇక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన అంశం ఒకటుంది. ‘సాక్షి’ విలువపై ఏమీ లేకున్నా ఇంతలా గగ్గోలు పెడుతున్న ‘ఈనాడు’ గురించి 2010లోనే బ్రిక్‌వర్క్‌రేటింగ్ సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. దీన్లో ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌కు ఏఏ(మైనస్) రేటింగ్ ఇచ్చింది. దీనర్థం ఈ కంపెనీ బాగుందని కాదు. పర్వాలేదు... అని మాత్రమే. ఇంకా ఆ నివేదికలో ‘ఈనాడు’ డొల్లతనాన్ని అదెలా బయటపెట్టిందో కావాలంటే మీరే చూడండి...

ఎన్‌సీడీల జారీకి సిద్ధమైన ఉషోదయా...!

మార్గదర్శి కుంభకోణం బయటపడటంతో.. కొన్ని దశాబ్దాలుగా డిపాజిటర్ల నిధులతో అక్రమంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చిన రామోజీరావు హెచ్‌యూఎఫ్‌కు, ‘ఈనాడు’కు కోలుకోలేని దెబ్బతగిలింది. వేలకొద్దీ ఎకరాల భూములు, వేల కోట్ల వ్యాపారాలు ఉన్నా.., ఒక్కసారిగా డిపాజిటర్ల డబ్బులు చెల్లించాల్సి వచ్చేసరికి విలవిల్లాడిపోయారు. పీకల్లోతు కష్టాల్లో మునిగి, బయట అప్పు సైతం పుట్టని పరిస్థితుల్లో చంద్రబాబు ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రంగంలోకి దించారు. ఫలితంగా 2008లో రిలయన్స్ నుంచి గొట్టాం కంపెనీల ద్వారా అనుమానాస్పద రీతిలో రూ.2,600 కోట్లు ప్రవహించాయి. అయితే ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆ నిధులు చాలలేదు. దీంతో బయటి వారి నుంచి మరో రూ.600 కోట్లు సేకరించేందుకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో 2010 ఫిబ్రవరిలో రేటింగ్ సంస్థ బ్రిక్‌వర్క్ రేటింగ్స్‌ను సంప్రతించారు. ఎన్‌సీడీలు జారీ చేసే నిమిత్తం రేటింగ్ ఇవ్వాలని కోరారు. బ్రిక్‌వర్క్ సంస్థ దీనికి ఏఏ(మైనస్) రేటింగ్ ఇచ్చింది. 
ఇవీ... ‘బ్రిక్’ చెప్పిన నగ్నసత్యాలు...

ఉషోదయాలో ఈనాడు పత్రిక, ఈటీవీ చానళ్లు, ప్రియా ఫుడ్స్ కలిసి ఉన్నాయి. ఈ సంస్థకు వచ్చే ఆదాయంలో మెజారిటీ... అంటే 40 శాతం పత్రిక నుంచి, 36 శాతం చానళ్ల నుంచి, 24 శాతం ఫుడ్స్ నుంచి వస్తోంది. 

35 ఏళ్లుగా ఉన్న ‘ఈనాడు’ పత్రిక సర్క్యులేషన్ జనవరి-జూన్ 2009లో ఏబీసీ ప్రకారం 13 లక్షలు. దేశంలోనే 10వ స్థానం. కానీ ఇక్కడ గమనించాల్సిందేంటంటే అదే సమయంలో... ఆర్‌ఎన్‌ఐ ఆడిట్ ప్రకారం ‘సాక్షి’ సర్క్యులేషన్ 12.83 లక్షలు. ప్రస్తుతం దేశంలో 8వ స్థానానికి చేరుకుంది.

టీవీ చానళ్ల వ్యాపారంలోను, ఫుడ్స్ విభాగంలోను ‘ఈనాడు’కు పోటీ విపరీతంగా ఉంది. బ్రిక్ సంస్థ పేర్కొనకపోయినా... అప్పటికే ‘సాక్షి’ ద్వారా ‘ఈనాడు’ పేపర్‌కు కూడా గట్టిపోటీ ఎదురైంది.

ఈ కంపెనీ పెయిడప్ క్యాపిటల్ (చెల్లించిన మూలధనం) చాలా తక్కువ. కేవలం రూ.1.26 కోట్లు మాత్రమే. అంటే ప్రమోటర్లు ఈ కంపెనీలో పెట్టుబడిగా పెట్టిన మొత్తమన్న మాట. అంటే దీన్లో వాటాదారులయిన రామోజీరావు, ఆయన కుటుంబీకులు మొత్తమ్మీద ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టిన పెట్టుబడి రూ.1.26 కోట్లే. కానీ దీనికి వాల్యుయేషన్ మాత్రం బావుందని, అందుకే 2008లో ఈక్వేటర్ సంస్థ 21 శాతం వాటా కోసం రూ.1,424 కోట్లు చెల్లించిందని బ్రిక్‌వర్క్ పేర్కొంది.

అంటే రూ.కోటీ 23 లక్షలు పెట్టుబడి పెట్టిన రామోజీరావు... తన కంపెనీని రూ.6,800 కోట్లుగా విలువ కట్టించి... అది చూపించటం ద్వారా రూ.2,600 కోట్లు రిలయన్స్ సంస్థల నుంచి తెచ్చుకున్నారని దీన్నిబట్టి స్పష్టం కావటం లేదా? ఒక్క ఏడాది కూడా పెద్దగా లాభాలేవీ లేకుండా... ప్రతి ఏటా నష్టాలే చూపిస్తూ వచ్చిన ఉషోదయాకు ఇంతటి వాల్యుయేషన్ ఎలా సాధ్యమైంది? రూ.1.23 కోట్ల పెయిడప్ క్యాపిటల్ ఉన్న సంస్థకు రూ.6,800 కోట్ల విలువ కట్టడం ఎక్కడైనా ఉందా?

ఈ రూ.600 కోట్ల ఎన్‌సీడీలు జారీ చేసి... దానికి సెక్యూరిటీగా హైదరాబాద్ సమీపంలో తమకున్న భూముల్ని పెడతామని రామోజీ ఈ రేటింగ్ సంస్థకు చేసిన దరఖాస్తులో వెల్లడించారు. అసలు రామోజీరావు భూములన్నీ అప్పటికే వివాదంలో ఉన్నాయి. వీటన్నిటినీ లిటిగెంట్ భూములుగా ల్యాండ్ ట్రిబ్యునల్ ప్రకటించింది కూడా. మరి వివాదంలో ఉన్న భూముల్ని తనఖాగా పెట్టి రూ.600 కోట్లు అప్పు తెచ్చుకుంటానని చెప్పటం మోసం కాదా? చీటింగ్ కాదా?

ఈ సంస్థ విపరీతమైన నష్టాల్లో ఉందని కూడా బ్రిక్ స్పష్టం చేసింది. ‘‘ఉషోదయాకు 2008 ఆర్థిక సంవత్సరంలో రూ.1,174 కోట్ల ఆదాయంపై రూ.57 కోట్ల నష్టం వచ్చింది. తరువాతి ఆర్థిక సంవత్సరం... అంటే 2009లో రూ.1,220 కోట్ల ఆదాయంపై రూ.149.20 కోట్ల నష్టం వచ్చింది. అయితే పునర్నిర్మాణంలో భాగంగా ఉషోదయా సంస్థ ఒక సాఫ్ట్‌వేర్ లైబ్రరీని రూ.775 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.670 కోట్లను కంటెంట్ సరఫరా చేసిన సంస్థలకు చెల్లించింది. పదేళ్ల పాటు ఆ మొత్తాన్ని మినహాయిస్తూ పోతుంది కాబట్టి ఈ రెండేళ్లలో ఇంతటి నష్టాలు వచ్చాయని భావించాలి’’ అని పేర్కొంది.

నిజానికి ఉషోదయా సంస్థ ఆ సాఫ్ట్‌వేర్ లైబ్రరీని కొన్నది ఎక్కడో బయటి సంస్థల నుంచి కాదు. తన జేబు సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నుంచే. తన టీవీకి చెందిన సిని మాలు, టెలీఫిలింలు, సీరియళ్లను ఆ సంస్థకు బదలాయిం చి... ఆ సంస్థ నుంచి ఉషోదయా కొన్నట్టుగా చూపి నష్టా ల్ని ఆ రకంగా భర్తీ చేసుకునే ప్రయత్నం చేశారన్న మాట. 

ఈ ఎన్‌సీడీలు జారీ చేసేటప్పటికే సంస్థ రుణాలు - ఈక్విటీ రేషియో 0.31గా ఉంది. ఎన్‌సీడీల జారీ తరవాత ఇది 0.66కు చేరుతుంది.

నికర ప్రాఫిట్ మార్జిన్లు 2008 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 4.6 శాతం కాగా... 2009లో మైనస్ 12.2 శాతం. 

ఇవండీ బ్రిక్ చెప్పిన లెక్కలు. అంటే... లాభాలు లేవు. మరో పదేళ్లపాటు లాభాలు వస్తాయన్న నమ్మకమూ లేదు. భూములు లాంటి ఆస్తులన్నీ వేరే కంపెనీల పేరిట ఉన్నాయి. వరసగా నష్టాలు వస్తూనే ఉన్నాయి. పెపైచ్చు ప్రమోటర్లు పెట్టిన పెట్టుబడి (పెయిడప్ క్యాపిటల్) కేవలం 1.23 కోట్ల రూపాయిలు. మరి ఇలాంటి సంస్థకు రూ.6,800 కోట్ల వాల్యుయేషన్ లభించినపుడు... కొత్త టెక్నాలజీతో, అంచనాలు ఏమాత్రం తప్పని సర్క్యులేషన్‌తో ఆరంభమై... ఆరంభంతోనే రాష్ట్రంలో అగ్రగామిగా ఎదిగి... దేశంలో 8వ స్థానానికి చేరిన ‘సాక్షి’ పత్రికకు ‘ఈనాడు’లో సగం విలువ కూడా ఉండదా? ఆ విలువ మేరకు షేరును రూ.350 చొప్పున విక్రయిస్తే తప్పా? సోమవారం సీబీఐ న్యాయమూర్తి ముందు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విన్నపమిదే. ఎదుటివారిపై బురద చల్లటం మాని రామోజీరావు జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఇదే.
Share this article :

0 comments: