రాజా ఆఫ్ కరప్షన్ జగన్‌కు సంబంధించి కాదు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజా ఆఫ్ కరప్షన్ జగన్‌కు సంబంధించి కాదు..

రాజా ఆఫ్ కరప్షన్ జగన్‌కు సంబంధించి కాదు..

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

* నాకు రాజకీయాలు తెలిసినప్పట్నుంచీ.. సీబీఐ ఒక వ్యక్తిపై ఇంతలా కక్ష కట్టిన సందర్భం లేదు
* ఒక వ్యక్తిపై ఇంతమంది కక్షగట్టడం సహేతుకంగా అనిపించలేదు
* దర్యాప్తులో అడుగడుగునా అధిష్టానం పాత్ర ఉంది
* పూర్తిగా రాజకీయ పక్షపాతంతో విచారణ సాగుతోంది
* జగన్‌ను అరెస్టు చేయడానికే మోపిదేవిని బలిచేశారు
* ఆ జీవోలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే మంత్రులకు ఇబ్బందులుండేవి కాదు
* వైఎస్‌తో నాకున్నవి రాజకీయ విభేదాలే.. ఎలాంటి వైరం లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తులో అడుగడుగునా కాంగ్రెస్ అధిష్టానవర్గం పాత్ర ఉందని, వారి సలహాల మేరకే మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ అధికారి బ్రహ్మానందరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. శనివారం సాక్షి చానల్ నిర్వహించిన ‘న్యూస్ మేకర్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాజకీయ ఒత్తిడులతో సీబీఐ పూర్తి పక్షపాతంతో విచారణ సాగిస్తోందని తెలిపారు. తనకు రాజకీయాలు తెలిసినప్పట్నుంచీ.. సీబీఐ కక్ష గట్టి ఒక వ్యక్తిపై ఇంత పెద్దఎత్తున విచారణ జరిపిన సందర్భం లేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్ విషయంలో కూడా సీబీఐ ఇలా వ్యవహరించలేదన్నారు. 

జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని సీబీఐ చేస్తున్న దర్యాప్తు తనకు సహేతుకం అనిపించలేదని, ఒక యువకుడిపై అందరూ కక్షగట్టి వ్యవహరించడం తనకు నచ్చలేదన్నారు. అందుకే ‘నాకు మద్దతు కావాలి’ అని అడగ్గానే రెండో మాట లేకుండా జగన్‌కు సహకారం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాతే ఆయనపై సీబీఐ ఎంక్వయిరీ వచ్చిందని, పిటిషన్ వేసిన మాజీ మంత్రి శంకర్రావు స్వయంగా తాను సోనియాగాంధీ చెబితే పిటిషన్ వేశానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పిటిషన్ వేసిన దగ్గర్నుంచి దర్యాప్తు వరకూ ప్రతి అడుగులోనూ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం ఉందని చెప్పారు. 

‘‘జగన్‌ను ఇరికించాలన్న ఉద్దేశంతోనే హైకోర్టులో ప్రభుత్వం 26 జీవోలపై కౌంటర్ దాఖలు చేయలేదు. చివరకు మంత్రులకు, ఐఏఎస్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినపుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. వారు వ్యక్తిగతంగా సమాధానం చెప్పుకోవాల్సిందేనని నిర్ణయించడం వెనుక కూడా జగన్‌ను ఇరికించాలనే దురుద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కౌంటర్ దాఖలు చేసి ఉంటే మంత్రులు ఇరకాటంలో పడి ఉండేవారే కాదు. మోపిదేవిని అరెస్టుచేసింది కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా చిత్రీకరించడానికే. అది కూడా కాంగ్రెస్ అధిష్టానం సలహా మేరకే సీబీఐ చేసింది. మంత్రినే సీబీఐ అరెస్టు చేసింది కనుక రేపు జగన్‌ను అరెస్టు చేస్తే అందులో తమ ప్రమేయం లేదని చెప్పుకోవడానికే ఇలా చేశారు. కానీ ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో 18 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంటుంది’’ అని మైసూరా చెప్పారు. 

తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని ప్రచారం జరగడం సరికాదని స్పష్టంచేశారు. గతంలో ఇందిరాపార్కు వద్ద జగన్ దీక్ష చేసినపుడు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోరిక మేరకు తన కుమారుడు అక్కడ ఆయనకు మద్దతుగా మాట్లాడారని, వాస్తవానికి తన కుమారుడికి రాజకీయాలపై ఆసక్తే లేదని తెలిపారు. జగన్ కుటుంబంతో 30 ఏళ్లుగా ఉన్న సంబంధాల నేపథ్యంలో నా కుమారుడిలాంటి వాడికి అండగా నిలబడాలనుకున్నానని చెప్పారు. కుమారుడిలాంటి వాడని జగన్‌ను అన్నందుకు కూడా కొన్ని చానళ్లు విపరీతార్థాలు తీశాయని, ఇదేనా మన తెలుగు సంస్కృతి అని ప్రశ్నించారు.

రాజా ఆఫ్ కరప్షన్ జగన్‌కు సంబంధించి కాదు..
రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని వేసిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాడని టీడీపీ నేతలు చేసిన విమర్శలపై మైసూరా స్పందిస్తూ.. ‘‘వాస్తవానికి ఆ పుస్తకం జగన్‌కు సంబంధించింది కాదు. అసలు లక్ష కోట్ల అవినీతి అనే ఆరోపణకు ఒక చరిత్ర ఉంది. జలయజ్ఞంలో ప్రాజెక్టుల అంచనా వ్యయంపై 5 శాతం పర్సెంటే జీ చొప్పున ఎంతవుతుందో లెక్కగట్టమని, అది టీడీపీ అధినేత ఆదేశమని నాకు చెప్పారు. ఆ ప్రకారం మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయంపై 5 శాతం లెక్క గడితే తొలుత రూ.2 వేల కోట్లు అయింది. ఇది మరీ తక్కువగా ఉందని మళ్లీ ఏవో లెక్కలు వేశాం. అప్పుడు రూ.4 వేల కోట్లు వచ్చింది. ఇదీ చాలదని భావించి లీడర్ కంటికి ఆనాలంటే మరికొంత పెంచుదామని గాలి పోగేసి రూ.15,000 కోట్ల రూపాయలని తేల్చాం. అదీ కూడా సంతృప్తిగా లేకపోవడంతో రూ.30 వేల కోట్లుగా చేశాం. తర్వాత లక్ష కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణ సిద్ధం చేశాం. ఈ ఫిగర్‌ను నాయకుడు బాగుందని మెచ్చుకున్నాడు. ఈ ఆరోపణల్లో ఒక్క రూపాయి ఇచ్చిందీ లేదు.. సచ్చిందీ లేదు.. ఎవరూ చూసిందీ లేదు. ఆ రోజు అందరూ కూర్చుని రూపొందించిన లక్ష కోట్ల అవినీతి ఆరోపణ నా ఒక్కడికే ఆపాదిస్తామంటే ఎలా’’ అని ప్రశ్నించారు. తనపై ఎవరో ఆరోపణలు చేశారని చెబితే స్పందించే వాడిని కాననీ, స్పష్టంగా చదివితేనే, చూస్తేనే స్పందిస్తానని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా తనపై ఈ ఆరోపణ తనంతట తానుగా చేసి ఉంటాడనుకోననీ, ఎవరో చెబితే చేసి ఉంటాడని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. 

‘తండ్రితో వైరం, తనయునితో స్నేహం’ అని వచ్చిన వార్తలపై మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరె డ్డి, తానూ మంచి మిత్రులమని, ఆయనకు, తనకు ఎన్నడూ వ్యక్తిగత వైరం లేదని వివరించారు. రాజకీయంగా మాత్రమే ఆయనతో విభేదించానన్నారు. వైఎస్ చనిపోయినపుడు కూడా అంతరాంతరాల్లో ఆయనపై ఉన్న అభిమానం పొంగుకొచ్చి టీవీ చానళ్ల ముందు కూడా విలపించాననీ, అదీ మానవత్వం అని మైసూరా చెప్పారు. వాస్తవానికి వైఎస్‌కు కడప జిల్లాలో గ్రూపును ఏర్పాటు చేసిన వాళ్లలో తాను ముఖ్యుడనని, 1989 వరకూ తమ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఆ తర్వాతేవిభేదాలు వచ్చాయని వివరించారు. వైఎస్ బంజారాహిల్స్‌లో ఇంటి స్థలాన్ని తీసుకునేటపుడు కూడా తనను తీసుకెళ్లి చూపించారని, ఆ పక్కనే నువ్వు కూడా తీసుకో అని చెప్పారంటూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆ చానల్ వైఖరి సరికాదు..
తనపై బురదజల్లే విధంగా, తనను ఇంటరాగేట్ చేస్తున్నట్లుగా ఓ టీవీ చానల్ యాంకర్ ప్రవర్తించిన తీరు ఆయన విజ్ఞతకే వదలి వేస్తున్నానని మైసూరా చెప్పారు. అతని హావభావ ప్రదర్శన, ప్రశ్నలు అడిగిన తీరు తనకు ఆగ్రహం కలిగించినందున మధ్యలో నుంచే వాకౌట్ చేశానని చెప్పారు. ఆ చానల్ ఇంటర్వ్యూకు పిలిచినపుడు వాస్తవానికి తాను భోజనం కూడా చేయలేదని, ఆ విషయం చెప్పినా ఒత్తిడి చేస్తే వెళ్లానన్నారు. అక్కడకు వెళ్లాక యాంకర్ ప్రవర్తించిన తీరు బాగోలేదన్నారు. ఏ రాజకీయ పార్టీలో అయినా చేరే స్వేచ్ఛ తనకు ఉందని స్పష్టం చేశారు. ‘‘అంతెందుకు నన్ను ప్రశ్నలేసిన ఆ యాంకర్ మీ (సాక్షి) చానల్ నుంచి వెళ్లి పోలేదా? ఇక్కడున్నపుడు ఓ రకంగా మాట్లాడి, అక్కడికి వెళ్లి వేరే రకంగా విమర్శలు చేయడం లేదా..’ అని ప్రశ్నించారు. తనకు సాధారణంగా ఆగ్రహం రాదని, ఆవేశం వస్తే అది ఎంత దూరమైనా పోతుందన్నారు.
Share this article :

0 comments: