శ్రీవారి ఆశీస్సుల్లోనూ రాజకీయమేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్రీవారి ఆశీస్సుల్లోనూ రాజకీయమేనా?

శ్రీవారి ఆశీస్సుల్లోనూ రాజకీయమేనా?

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012

కుట్రలో భాగమే తెరపైకి ‘డిక్లరేషన్’ అంశం 
టీ కప్పులో తుపాను సృష్టించిన చానళ్లు 
నిన్నటివరకు జగన్ కులం, మతంపై విమర్శలు 
నేడు శ్రీవారి దర్శనాన్నీ తప్పుబట్టే ప్రయత్నం 
డిక్లరేషన్’ ప్రధానం కాదంటున్న మతపెద్దలు 
భక్తి విశ్వాసాలే ముఖ్యమంటున్న ఆచార్యులు


తిరుమల, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల వేళలో రాష్ట్ర రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా చేస్తున్న కుట్రలూ, కుహకాలు హద్దులు మీరుతున్నాయి. నిన్న మొన్నటివరకు జగన్ కులం, మతం, ప్రాంతంపైన విమర్శలు గుప్పించిన రాజకీయపక్షాలు... నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వరుని జగన్ దర్శించుకోవడాన్ని సైతం వివాదాస్పదం చేస్తూ వికృత రాజకీయాలకు తెరలేపాయి. కొన్ని మీడియా చానళ్లు పనికట్టుకుని ‘డిక్లరేషన్’ వివాదాన్ని రేకెత్తించడం రాజకీయ కుట్రలో భాగమేనని స్పష్టమవుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనను ఏదో ఒక రూపంలో వివాదంలోకి నెట్టి తద్వారా తమవారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ముందస్తు కసరత్తు జరిగింది. అందులో భాగంగానే జగన్ దర్శనం చేసుకున్నప్పటి నుంచీ ఆలయం వెలుపలకు వచ్చేవరకూ డిక్లరేషన్ అంశాన్ని తమ చానళ్లలో పనికట్టుకుని ప్రచారం చేశాయి. టీటీడీని కూడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. తిరుమల శ్రీవారి దర్శనాన్ని సైతం రాజకీయాల్లోకి లాగడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భక్తికి ‘డిక్లరేషన్’ అవసరమా?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిబంధనల ప్రకారం 1987 రాష్ర్ట దేవాదాయశాఖ చట్టానికి లోబడి అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకునే సందర్భంలో ‘శ్రీవేంకటేశ్వర స్వామివారిపై నమ్మకం ఉంది’ అని తమ సమ్మతి తెలుపుతూ తప్పనిసరిగా డిక్లరేషన్ ఫారం/ రిజిస్టర్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే భక్తులందరూ స్వామివారి ఆశీస్సులకే వచ్చారన్నది టీటీడీ భావన. అందుకే ఇప్పటివరకు క్యూలో అన్యమతస్తులు కనిపించినా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. డిక్లరేషన్ ఇవ్వమని వారిని డిమాండ్ చేసిన సందర్భమూ లేదు. ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీ పలుమార్లు తిరుమలకు వచ్చిన సందర్భంలోనూ ఈ నిబంధన అమలు చేసిన దాఖలాల్లేవు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కూడా ఐదేళ్లపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. తిరుమలేశుడంటే అచంచల భక్తితోనే తన పదవీ కాలంలో 23సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. పదవిలోకి రాకముందు, ప్రతిపక్ష నేతగా 1600 కిలోమీటర్ల ప్రజాప్రస్థాన కార్యక్రమం పూర్తిచేశాక తిరుమలకు నడిచివచ్చి ముగించారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నేత తనయుడు వైఎస్ జగన్ బుధవారం శ్రీవారిని దర్శించుకోవడాన్ని వివాదం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ 2009లో దర్శనానికి వచ్చినపుడు కనిపించని డిక్లరేషన్ అంశం తాజాగా తెరపైకి తీసుకురావటంలో ఆంతర్యం ఏమిటి? దీనివెనుక హస్తం ఎవరిది? అన్న ప్రశ్నలకు ‘రాజకీయమే’అన్న సమాధానం లభిస్తోంది.

హిందూ సంప్రదాయాన్ని అవమానించడమే..
‘‘అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకునే సందర్భంలో వేంకటేశ్వరస్వామివారిపై తమకు నమ్మకముందని పేర్కొంటూ డిక్లరేషన్‌ను ఇవ్వాల్సి ఉంది. కానీ జగన్ అలాంటిదేమీ ఇవ్వకుండానే ఆలయంలోకి వెళ్లారు. ఇది హిందూ సంప్రదాయాన్ని అవమానించడమే’’
-వీరశివారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

హిందువుల మనోభావాలను కించపరిచిన జగన్.. 
శ్రీవారిని సందర్శించే సమయంలో నిబంధనలు పాటించకుండా జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. శ్రీవారిని అవమానించడం వైఎస్ కుటుంబానికి అలవాటుగా మారింది. తిరుమల ఏడుకొండల్లో రెండే శ్రీవారివని గతంలో వ్యాఖ్యానించిన వైఎస్ అందుకు ఫలితం అనుభవించారు. 
-దాడి వీరభద్రరావు, టీడీపీ నేత

ప్రత్యేక మర్యాదలు కల్పించలేదు
డిక్లరేషన్ అంశాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వారి అనుచరుల దృష్టికి మా సిబ్బంది తీసుకెళ్లారు. గతంలో దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని, అందువల్ల మరోసారి ఇవ్వాల్సిన అవసరంలేదంటూ వారు చెప్పినట్టు మా సిబ్బంది ద్వారా తెలిసింది. అలాగే ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్లపాటు సాక్షాత్తు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినందున కొత్తగా మరోసారి సమ్మతి (డిక్లరేషన్) తెలపాల్సిన అవసరం లేదనే వాదన వచ్చింది. దీనిపై నేను కూడా పరిశీలిస్తాను. టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శనం చేసుకున్నాకే ఆయనకు దర్శనం కల్పించాము. ఎలాంటి ప్రత్యేక మర్యాదలూ కల్పించలేదు. -ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ ఈవో

దేవాలయాల అభివృద్ధిలో వైఎస్‌కు సాటిలేరు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల అభివృద్ధికి వైఎస్ చేసిన కృషి మరెవ్వరూ చేయలేదు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆలయాల పరిస్థితిని అధ్యయనం చేశారు. వాటి అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారు. సీఎం అయ్యాక చట్టాన్ని సవరించి దేవాలయాల అభివృద్ధిని చేపట్టారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశారు. అర్చకుల సంక్షేమానికి కృషి చేశారు. ఆయన తిరుపతి వెళ్లినా, చిలుకూరు వచ్చినా ఓ భక్తునిగానే చూశామే తప్ప క్రిస్టియన్‌గా చూడలేదు. ఆయన తనయుడు జగన్‌నూ అలాగే భావిస్తున్నాం. తిరుపతిలో సంతకం చేయకుండా వెళ్లడం పెద్ద తప్పేమీ కాదు. -సౌందరరాజన్, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు

సోనియావద్ద డిక్లరేషన్ తీసుకున్నారా?
వేంకటేశ్వర స్వామివారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలతో జగన్‌తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పనికట్టుకుని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ చిన్నతనం నుంచి అనేకమార్లు తిరుమలకు వచ్చారు... 2009లో వచ్చారు... మళ్లీ ఇప్పుడు వచ్చారు. భవిష్యత్‌లో మరిన్నిసార్లు ఖచ్చితంగా వస్తారు. భగవంతుని పట్ల నమ్మకం, విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన. అసలు ఇటాలియన్ అయిన సోనియాగాంధీనుంచి ఒక్కసారైనా డిక్లరేషన్ తీసుకున్నారా? ఆమెకు వర్తించని నిబంధనలు జగన్‌కు మాత్రమే వర్తిస్తాయా? 
-భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ 

డిక్లరేషన్ అవసరం లేదని అంగీకరించారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి దర్శన విషయంలో డిక్లరేషన్ అవసరం లేదనే వాదనతో టీటీడీ ఈవో ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఏకీభవించారు. టీటీడీ తరఫున మావద్దకు ఎలాంటి డిక్లరేషన్ పత్రాలు తీసుకురాలేదు. నేనే వ్యక్తిగతంగా ఈవోను కలసి వివరించాను. ఐదు సంవత్సరాలు భక్తి విశ్వాసాలతో పట్టువస్త్రాలు సమర్పించి, అధికారంలో ఉండగా 23సార్లు, ఇతర సందర్భాల్లో పదుల సార్లు శ్రీవారిని దర్శించుకున్న దివంగత సీఎం రాజశేఖరరెడ్డి తనయుడికి డిక్లరేషన్ అవసరమా? అని ప్రశ్నించినప్పుడు ‘అవసరంలేదు’ అని ఈవో చెప్పారు. 
-చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తుడా మాజీ చైర్మన్ 

తండ్రికి లేని నిబంధన కొడుక్కి ఎందుకు?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని రాజకీయం చేయడం అవివేక చర్య. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అనేకసార్లు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు లేని నిబంధనలను జగన్‌కు వర్తింపజేయడం సబబు కాదు. సోనియాగాంధీ శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఈ నిబంధనలను ఎందుకు వర్తింపజేయలేదు? తల్లి చనిపోయిన ఏడవ రోజు అక్కినేని నాగార్జున తిరుమల దర్శనానికి వస్తే అతనికి స్వాగతం పలికి లోనికి ఆహ్వానించిన అధికారులు జగన్ దర్శనాన్ని వివాదాస్పదం చేయడం తగదు. 
-ద్రోణం రాజు రవికుమార్, రాష్ట్ర బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య యువజన విభాగం 

శ్రీవారి వద్ద రాజకీయమా?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాన్ని కొందరు రాజకీయం చేయటం సరికాదు. గతంలో ఆయన అనేకమార్లు దర్శనం చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అప్పుడులేని వివాదం ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చింది? ముఖ్యమంత్రిగా వైఎస్ చేసినంతగా మరెవరూ దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమానికి కృషి చేయలేదు. ఆయన ప్రవేశపెట్టిన 3,600 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం మళ్లీ వెలుగులకు కారణమైంది. 
-గంగు భానుమూర్తి, తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షులు
Share this article :

0 comments: