గాంధేయ పద్ధతిలో నిరసన .. ఊపందుకున్న ‘పోస్టుకార్డు’ ఉద్యమం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గాంధేయ పద్ధతిలో నిరసన .. ఊపందుకున్న ‘పోస్టుకార్డు’ ఉద్యమం

గాంధేయ పద్ధతిలో నిరసన .. ఊపందుకున్న ‘పోస్టుకార్డు’ ఉద్యమం

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012


న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ‘సాక్షిై’పె జరుగుతున్న కుట్రలను దేశ సర్వోన్నత వ్యక్తులకు తెలియజేసేందుకు పాత్రికేయులు భిన్నమార్గాలను ఎంచుకుంటున్నారు. సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం సరికాదని,‘సాక్షి’పై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలంటూ రాష్ర్టపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రులను పోస్టుకార్డుల ద్వారా అభ్యర్థించారు. బుధవారం వివిధ జిల్లాల్లో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి మంచి స్పందన లభించింది.

విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో పోస్టుకార్డుల ఉద్యమంలో వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ‘సాక్షి మా ఆస్తి.. దాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మాదే’నన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కూడా వేలాది కార్డులను పోస్ట్ చేశారు. పిఠాపురం పాదగయలో జర్నలిస్టులు పీకలోతు నీటిలో మునిగి ‘సీబీఐకి బుద్ధి ప్రసాదించు దేవా!’ అంటూ పూజలు చేశారు. ముమ్మిడివరం, అమలాపురంలలో ‘సాక్షి’ సిబ్బంది మంత్రి పినిపే విశ్వరూప్‌కు‘సాక్షిని సాక్ష్యం చెప్పనీయండి’అంటూ ముద్రించిన కరపత్రాలు,గులాబీపూలు ఇచ్చి గాంధేయపద్ధతిలో నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటుగా అన్నిమండలాల్లో, నల్లగొండజిల్లా వ్యాప్తంగా బుధవారం పోస్టుకార్డుల ఉద్యమం జరిగింది.

నల్లగొండజిల్లా యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి గీతారెడ్డికి సాక్షి ఉద్యోగులు, జర్నలిస్టులు గులాబీలు ఇచ్చి గాంధేయపద్ధతిలో నిరసన తెలిపారు. మిర్యాలగూడలో ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ భారతీ రాగ్యానాయక్ పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. భువనగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నేతలు పోస్టు కార్డులు రాసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు పోస్టు చేశారు. ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ చందాలింగయ్యదొర తొలికార్డుపై సంతకం చేసి, నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట పాత్రికేయులు ప్లకార్డులు చేబూని ప్రభుత్వం, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

‘సాక్షి’కి ప్రభుత్వ ప్రకటనలు రద్దు చేస్తూ విడుదల చేసిన జీఓ ప్రతులను దహనం చేశారు.కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ వి.దుర్గాదాస్‌కు, అంబేద్కర్ నగర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజనాథ్‌కు గులాబీపూలు అందజేసి నిరసన తెలిపారు.తిరుపతిలో సాక్షి సిబ్బంది ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగాగల అంబేద్కర్ విగ్రహ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరిజిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు గాంధీగిరీని పాటించారు. నరసాపురంలో మంత్రి పితాని సత్యనారాయణకు గులాబీపూలు అందించారు. ఏలూరు, కొవ్వూరుల్లో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. 

బుధ వారం తాడేపల్లిగూడెంలోనూ రిలే దీక్షలు మొదలయ్యాయి. వైఎస్‌ఆర్ జిల్లా కడపలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. శ్రీకాకుళంలో పోస్టుకార్డు ఉద్యమానికి విశేష స్పందన లభించింది. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట సాక్షి ప్రకటనల విభాగం సిబ్బంది చేపట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. కరీంనగర్‌జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు, జగిత్యాలలో ఎమ్మెల్యే రమణకు గులాబీపూలను అందజేసి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్నినియోజకవర్గ కేంద్రాల్లో పోస్టుకార్డు ఉద్య మం ఉద్ధృతంగా కొనసాగింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతికి దాదాపు 5వేల పోస్టుకార్డులను పోస్టు చేశారు.

అక్షరంపై ఆంక్షలా?
అక్షరాలపై ఎమర్జెన్సీనా..? ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి విడనాడకుంటే ప్రజా ఉద్యమం తప్పదని.. ‘సాక్షి ’పై ఆంక్షలతో జారీ చేసిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో బుధవారం జరిగిన జర్నలిస్టు, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, ప్రజా, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సుమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

పత్రికాస్వేచ్ఛ హరింపు అన్యాయం:మావోయిస్టు సుదర్శన్
‘సాక్షి’ కరెంట్ అకౌంట్ల ఫ్రీజ్, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేత, సీబీఐ వ్యవహార తీరును ఖండిస్తూ సీపీఐ మావోయిస్ట్ నల్లమల రీజియన్ రాయలసీమ కార్యదర్శి కె.సుదర్శన్ అలియాస్ రాజేష్ అలియాస్ గణేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రభుత్వాలు సీబీఐని అడ్డు పెట్టుకుని ప్రజాస్వామ్య విలువలకు పాతరేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. సీబీఐ తన దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలన్నారు.

ఈ పోరాటంలో ‘‘నేను సైతం’’అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. సాక్షికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై మీకూ స్పందించాలని ఉందా.. గుండెగొంతుకై నినదించాలని ఉందా? ఇందుకోసం సాక్షి అభిమానులు ప్రత్యేకంగా ఫేస్‌బుక్ పేజీ సిద్ధంచేశారు. అభిప్రాయాలు, ఆలోచనలను, నినాదాలను పంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ Support Sakshi కి లాగిన్ అయితే చాలు. రండి.. అక్షరం శక్తి ఏమిటో చూపించండి!
Share this article :

0 comments: