వాన్‌పిక్‌లో సర్కారు ఒక్క రూపాయీ నష్టపోలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాన్‌పిక్‌లో సర్కారు ఒక్క రూపాయీ నష్టపోలేదు

వాన్‌పిక్‌లో సర్కారు ఒక్క రూపాయీ నష్టపోలేదు

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

నిమ్మగడ్డ తరఫు న్యాయవాది రాజశేఖర్ వాదన
ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు
నష్టాల సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమే నిమ్మగడ్డ వ్యాపారం
వ్యాపారదక్షతతో ఆ సంస్థలను అభివృద్ధి చేశారాయన
ఉపాధి, ఆదాయం పెంచి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించారు
రూ.3 కోట్లకు కొన్న‘మ్యాట్రిక్స్’ సంస్థను 
అభివృద్ధి చేసి రూ.6,610 కోట్లకు విక్రయించారు
వాన్‌పిక్‌లో సర్కారు ఒక్క రూపాయీ నష్టపోలేదు
విచారణ సమయంలో ప్రసాద్ ఏమేం చెప్పారన్నది రిమాండ్ 
రిపోర్ట్‌లో ఎందుకు చేర్చలేదు, ఆ ధైర్యం సీబీఐకి లేదా..
ఇలా వేధిస్తే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నష్టాల్లో ఉన్న జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే నష్టాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టి వాటిని అభివృద్ధి చేయడమే ప్రసాద్ వ్యాపారమని ఆయన తరఫు న్యాయవాది రాజశేఖర్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. మూతబడిన మ్యాట్రిక్స్ ల్యాబ్స్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసి అభివృద్ధి అనంతరం ఏకంగా రూ.6,610 కోట్లకు విక్రయించిన చరిత్ర నిమ్మగడ్డకు ఉందని, బిజినెస్ వరల్డ్ పత్రిక కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిందని నివేదించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌టీఎస్ అధికారి బీకే బ్రహ్మానందరెడ్డిలను 14 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ముఖ్య న్యాయమూర్తి పుల్లయ్య గురువారం విచారించారు. ప్రసాద్ అరెస్టే చట్ట విరుద్ధమని, అరెస్టు అవసరమని భావించినప్పుడు దర్యాప్తు అధికారి తన నిర్ణయాన్ని సమర్థించుకునేలా స్పష్టంగా కారణాలను రికార్డు చేయాల్సి ఉందని రాజశేఖర్ తెలిపారు. రిమాండ్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను వేరుగా వేయాలని చట్టం చెబుతోందని, అయినా రిమాండ్‌కు ముందే సీబీఐ కస్టడీ కోరడం చట్ట విరుద్ధమని అన్నారు. రిమాండ్ రిపోర్టు ఎలా ఉండాలి, కస్టడీ పిటిషన్ ఎలా వేయాలనే విషయాన్ని కోర్టు పదేపదే సీబీఐకి స్పష్టం చేసినా ఆ సంస్థ వైఖరిలో మార్పు లేదన్నారు. ‘‘సీబీఐ ముందు ప్రసాద్ ఎన్నిసార్లు హాజరయ్యారు, విచారణ సమయంలో ఏయే విషయాలు చెప్పారన్న అంశాలను దర్యాప్తు అధికారి ఎస్పీ వెంకటేశ్ రిమాండ్ రిపోర్టులో ఎందుకు ప్రస్తావించలేదు? వాటిని రిపోర్టులో పేర్కొనే ధైర్యం ఆయనకు లేదా? సీబీఐ దర్యాప్తుకు ప్రసాద్ పూర్తిగా సహకరించారు. గత ఆగస్టు నుంచి అరెస్టు దాకా 13 సార్లు వారి ఎదుట హాజరయ్యారు. తెలిసిన అన్ని విషయాలూ వెల్లడించారు. ఇంకా చెప్పాల్సిందేమీ లేదు’’ అని పేర్కొన్నారు. పెట్టుబడుదారులను ఇలాగే వేధిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని తెలిపారు.

రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డారు

అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంలో నిమ్మగడ్డ ప్రసాద్ కృషి చేశారని, నిజాంపట్నం పోర్టు ప్రాజెక్టును రాష్ట్రానికి తేవడంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారని న్యాయవాది వివరించారు. ‘‘ఆయన తన తెలివితేటలు, వ్యాపారదక్షతతో మూతబడ్డ కంపెనీలను కొనుగోలు చేసి వాటిని అభివృద్ధి చేసి పూర్వ వైభవం తెచ్చారు. కంపెనీల ఏర్పాటుతో ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రస్‌ఆల్‌ఖైమాకు చెందిన రాక్ కంపెనీకి ఒప్పందం జరిగింది. రాక్ నియంత్రణలో వాన్‌పిక్ ప్రాజెక్టు ఉంది. ప్రభుత్వానికి సమాచారం అందించాకే రాక్‌లో ప్రసాద్ భాగస్వామిగా చేరారు. నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. ఇచ్చిన భూమిని కూడా లీజు పద్ధతిపైనే ఇచ్చారు. 33 ఏళ్ల తర్వాత లీజును 11 ఏళ్ల చొప్పున పొడిగించేలా ఒప్పందం చేసుకున్నారు. లీజు ముగిశాక ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుంది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఇతర పెట్టుబడిదారులెవరినీ అరెస్టు చేయలేదు. నాలుగు సంస్థలు, వాటి యజమానులను నిందితులుగా పేర్కొంటూ ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత అరెస్టు చేస్తున్నారు. అరెస్టుల విషయంలో సీబీఐ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది’’ అని ఆరోపించారు. మొదటి చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించిందని గుర్తు చేశారు. ఈ దశలో సీబీఐ విచారణకు సహకరిస్తున్న నిమ్మగడ్డను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

థర్డ్‌డిగ్రీ ప్రయోగించేందుకే కస్టడీ

నిమ్మగడ్డ ప్రసాద్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించేందుకే కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరుతోందని న్యాయవాది రాజశేఖర్ తెలిపారు. ‘‘సీబీఐ ప్రాసిక్యూటర్లు వాస్తవాలను మాత్రమే కోర్టు ముందుంచాలి. మసిపూసి అవాస్తవాలతో కూడిన వాదనలు విన్పించరాదు. కానీ వారు రిమాండ్ రిపోర్టులో పేర్కొనని అనేక విషయాలపై వాదనలు విన్పిస్తున్నారు. పెట్టుబడిదారులతో ప్రభుత్వ అధికారులు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు.అన్ని రికార్డులూ సీబీఐ వద్దే ఉన్నప్పుడు ఇంకా అరెస్టు చేసి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఏముంది? సీబీఐ యాంత్రికంగా కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. అవసరం లేకపోయినా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కస్టడీ కోరుతోంది. రాష్ట్ర మంత్రివర్గం అనేక నిర్ణయాలు తీసుకుంది. వాటన్నిం టినీ పట్టించుకోకుండా, కేవలం వాన్‌పిక్ ఒప్పందంపై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. సీబీఐ విచారణ సమయంలో ఆయన చెప్పాలనుకున్న అన్ని విషయాలనూ ఇప్పటికే చెప్పారు. ఇంకా చెప్పాల్సిందేమీ లేదు’’ అని పేర్కొన్నారు.

ఒప్పందాల్లో లొసుగుల్లేవు

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్లలో ఎక్కడా బ్రహ్మానందరెడ్డి ప్రస్తావన లేదని ఆయన తరఫు న్యాయవాది గుర్తు చేశారు. అయినా ఆయన్ను సీబీఐ ఈ కేసులో ఇరికించిందంటూ వాదనలు విన్పించారు. రాక్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాల్లో ఎలాంటి లొసుగులూ లేవు. మంత్రివర్గ నిర్ణయాల మేరకు ఒప్పందం జరిగింది. అందులో లొసుగులుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కానీ నిబంధనల మేరకు జరిగింది కాబట్టే ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు’’ అని పేర్కొన్నారు. కస్టడీ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

నిమ్మగడ్డ సహకరించలేదు: సీబీఐ
తమ దర్యాప్తునకు నిమ్మగడ్డ సహకరించలేదని, తామడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. సీబీఐ తరఫున సంస్థ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు విన్పించారు. ‘‘నిమ్మగడ్డకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పించింది. 24 వేల ఎకరాలను ఆయన సంస్థలకు కేటాయించింది. రైతుల నుంచి సేకరించిన భూములకు ఎకరాకు రూ.లక్ష పరిహారం చెల్లించి, రూ.3 లక్షలు చెల్లించినట్టు రికార్డుల్లో చూపారు. భూ కేటాయింపుల్లో నిమ్మగడ్డ సంస్థలకు అనుకూలంగా బ్రహ్మానందరెడ్డి జీవోలు జారీ చేశారు. వారిద్దరినీ కస్టడీలో విచారించడం అనివార్యం. అనేక కీలక పత్రాలను వారికి చూపించి నిర్ధారించుకోవాల్సి ఉంది. కాబట్టి 14 రోజులపాటు కస్టడీకి అప్పగించండి’’ అని కోరారు.
Share this article :

0 comments: