ఉప ఎన్నికల తీర్పుతో రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికల తీర్పుతో రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకండి

ఉప ఎన్నికల తీర్పుతో రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకండి

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012



అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘రాష్ట్రంలో కుళ్లు, కుతంత్రాలతో చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయతీకే మీ ఓటు.. పేదవాడికే మీ ఓటు.. రైతన్నకే మీ ఓటు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిజాయతీతో కూడిన రాజకీయాలు చేసి రైతులకు, పేదలకు అండగా నిలబడి పదవులను త్యాగం చేసిన వారికే ఓటేసి గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటు ద్వారా రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు నాంది పలకాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తరఫున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా నాలుగో రోజు శుక్రవారం ప్రచారం చేశారు. గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రజా సంక్షేమం పట్టదా?: రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులే కష్టాల్లో ఉండటంతో అక్కాచెల్లెమ్మలకు తగిన కూలీ కూడా ఇవ్వలేకపోతున్నారు. కనీస వేతనంగా రూ.137 ప్రకటించిన ప్రభుత్వమే.. ఉపాధి హామీ పనులను మాత్రం కాంట్రాక్టు తరహాలో క్యూబిక్ మీటర్ చొప్పున లెక్కించి రూ.60 నుంచి రూ.70 ఇస్తోంది. పేదవాడు అనారోగ్యం పాలై అప్పులపాలు కాకూడదని దివంగత నేత వైఎస్ ఓ స్వప్నం చూశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందించాలని భావించారు. 

కానీ.. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఓ పథకం ప్రకారం కుదిస్తోంది. వైఎస్ మరణించాక ఈ మూడేళ్లలో ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటైనా కొత్త ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. యాక్సిడెంట్ అయ్యో.. గుండెపోటు వచ్చో 108కు ఫోన్ చేస్తే.. 20 నిమిషాల్లోపు రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు.. తమ తరఫున పోరాడుతుందేమోనని ఆశగా ప్రతిపక్షంవైపు చూస్తే.. అదేమో అధికారపక్షంతో కుమ్మక్కైంది. అధికార, విపక్షాలు రెండూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి.

త్యాగధనులకు పట్టం కట్టండి: రాజకీయాల్లో రెండు రకాల మనుషులు ఉంటారు. రైతన్నకు.. పేదవాడికి ఏమైనా కష్టమొస్తే.. తమకు కాదు కదా ఆ కష్టమొచ్చింది.. పోయేది రైతన్న.. పేదవాడే కదా అని చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ రైతన్న, పేదవాడితో ఐదేళ్లకు ఒకసారే కదా పని పడేది అనుకుంటున్నారు. కానీ.. రాజకీయాల్లో ఇంకో రకం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా ఉంటారంటే.. రైతన్న కోసం.. పేదవాడి కోసం తమ పదవులను కూడా త్యాగం చేస్తారు. అవిశ్వాస తీర్మానంలో పేదవాడికి.. రైతన్నకు అండగా నిలబడేందుకు 17 మంది ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేశారు. ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. 

అవిశ్వాస తీర్మానానికి ముందు ఆ 17 మంది ఎమ్మెల్యేలతో నేను చెప్పిన మాటలు నా జీవితంలో మరచిపోలేను. ‘రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవాళ పదవులు ఉంటాయి.. రేపు పోతాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం. ప్రతి కార్యకర్త, ఫలానా వ్యక్తి మా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో నాయకులుండాలి’ అని చెప్పా. పేదవాడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోవాలని, తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లోనూ తన ఫొటో ఉండేలా వారికి మేలు చేయాలని తపించే నాయకుడు ఏ ఒక్కడూ రాష్ట్రంలో కన్పించడం లేదు. రాష్ట్రంలో త్వరలో 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటు పేదవాడికి.. మీరు వేసే ఓటు రైతన్నకు అండగా నిలవాలి. ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి.. ఆ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా నడిపిస్తోన్న కాంగ్రెస్ పెద్దలకు కనువిప్పు కలిగించేలా ఉండాలి.

అడుగడుగునా నీరాజనం..

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయదుర్గంలో నాలుగు రోజులు పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డంలో మంగళవారం రాయదుర్గం ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించిన జగన్.. శుక్రవారం రాయదుర్గం మండలం గుండ్లపల్లి క్రాస్ వద్ద ముగించారు. శుక్రవారం ఉదయం గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో సుబ్రమణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జననేత..ఆ తర్వాత రోడ్‌షో నిర్వహించారు. తాళ్లకెర ప్రజలు జగన్‌కు నీరాజనం పలికారు. ఆ తర్వాత రంగసముద్రం, కేపీ దొడ్డిల్లో రోడ్‌షోలు నిర్వహించారు. కేపీదొడ్డి నుంచి బీటీపీకి వచ్చే క్రమంలో కోనాపురం ప్రజలు తమ ఊరికి రావాల్సిందేనని జగన్‌ను పట్టుబట్టితీసుకెళ్లారు. ఆ తర్వాత బీటీపీ, గుమ్మఘట్ట, గోనబావి, పూలకుంట క్రాస్, వెంకటాపురం క్రాస్, కలుగోడు, రంగచేడు, బేలోడు, కొత్తపల్లి, నేత్రపల్లి, భూపసముద్రం, జుంజురాంపల్లి, కెంచానపల్లి, ఆవులదట్ల, గుండ్లపల్లి క్రాస్‌లలో పర్యటించారు. సమయాభావం వల్ల నేత్రపల్లి అనంతరం భూపసముద్రంలో జగన్ రోడ్‌షో ముగించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రచారం నిర్వహించేందుకు అక్కడికి బయలుదేరి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఎమ్మిగనూరు చేరుకోనున్న జగన్ అక్కడ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి ఇంట్లో బసచేస్తారు.
Share this article :

0 comments: