సీబీఐ చర్యపై మానవ హక్కుల సంఘాల్లో పిటిషన్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ చర్యపై మానవ హక్కుల సంఘాల్లో పిటిషన్లు

సీబీఐ చర్యపై మానవ హక్కుల సంఘాల్లో పిటిషన్లు

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

* సాక్షి, జనని ఖాతాలు రీ-ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోండి 
* ఎన్‌హెచ్‌ఆర్సీలో న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ పిటిషన్

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ చానల్‌లతో పాటు వీటికి మౌలిక వసతులు కల్పించే జనని ఇన్‌ఫ్రా ఖాతాలను ఏకపక్షంగా స్తంభింపజేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ), రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్‌హెచ్‌ఆర్సీ)లో పిటిషన్లు దాఖలయ్యాయి. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిన సీబీఐపై చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది పి.సాయికృష్ణ ఆజాద్ ఎన్‌హెచ్‌ఆర్సీలో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికే సీబీఐ ‘సాక్షి’కి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిందని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది పీఎన్ అరుణ్‌కుమార్ ఎస్‌హెచ్‌ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీఐబీ తీసుకున్న చర్య పత్రికా స్వేచ్ఛను హరించడం కిందికే వస్తుందని సాయికృష్ణ ఆజాద్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాలను తక్షణం రీ-ఓపెన్ చేసేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి సూచించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీబీఐ డెరైక్టర్, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. కేసు దర్యాప్తులో ఉందన్న అధికారంతో సీబీఐ దురుద్దేశంతో మీడియా స్వేచ్ఛను హరిస్తోందని అరుణ్‌కుమార్ ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే చార్జ్‌షీట్‌తో పాటు రెండు అదనపు చార్జ్‌షీట్లు దాఖలు చేసిందని, ఇంకా కొన్ని అదనంగా దాఖలు చేస్తామని వెల్లడించిందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

‘సాక్షి’ మీడియా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తోందని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. అకౌంట్లు ఫ్రీజ్ చేయడం ద్వారా వీరందరి జీవించే హక్కును హరించినట్లేనంటూ పిటిషన్‌లో వివరించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజల జీవించే హక్కుతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని హెచ్‌ఆర్సీని కోరారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల సంఘం జూన్ 6 లోగా నివేదిక సమర్పించాలంటూ సీబీఐ జేడీ, లేబర్ కమిషనర్‌లను ఆదేశించింది.
Share this article :

0 comments: