సాక్షి మీడియాకు ప్రకటనలు నిలిపివేయడంపై మండిపడ్డ మేధావులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి మీడియాకు ప్రకటనలు నిలిపివేయడంపై మండిపడ్డ మేధావులు

సాక్షి మీడియాకు ప్రకటనలు నిలిపివేయడంపై మండిపడ్డ మేధావులు

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012


ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పాత్రికేయులు, ప్రముఖుల అభిప్రాయాలు

వివిధ రంగాల నేతల ఏకాభిప్రాయం మేరకు సదస్సు రెండు తీర్మానాలను ఆమోదించింది. కార్యక్రమ సమన్వయకర్త టీవీ రావు ఈ తీర్మానాలను చదివారు. తీర్మానాల సారాంశమిదీ..

1)భావ ప్రకటనా స్వేచ్ఛకు, జర్నలిస్టులు, ఇతర సిబ్బంది మాన ప్రాణాలకు, ముద్రణ, ప్రసార వ్యవస్థలకు అవరోధంగా, హానికరంగా తీసుకునే అన్ని చర్యలను సదస్సు తీవ్రంగా ఖండిస్తోంది.
2)దేశవ్యాప్తంగా ఉన్న సాక్షి జర్నలిస్టులు, ఇతర సిబ్బంది జీతాలకు అవరోధం కల్పించే విధంగా సాక్షి కరెంటు అకౌంట్లను సీబీఐ స్తంభింపజేయడాన్ని, ప్రభుత్వం సాక్షి పత్రికకు, మీడియాకు ప్రకటనలు (అడ్వర్టయిజ్‌మెంట్లు) నిలిపివేయడాన్ని సదస్సు తీవ్రంగా ఖండిస్తోంది.

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి పత్రిక, చానల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లను సీబీఐ స్తంభింపజేయడం, ప్రభుత్వం ప్రకటనలను నిలిపివేయడం సర్కారు నిరంకుశత్వ ధోరణికి పరాకాష్టని సీనియర్ పాత్రికేయులు, మేధావులు మండిపడ్డారు. పత్రిక ముద్రణకు ఆటంకం కలిగించే ఎలాంటి చర్య అయినా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలాగే కొనసాగితే మీడియా మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు.

‘ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ’అనే అంశంపై ఫోరం ఫర్ అనలిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ (ఫ్యాక్ట్) సంస్థ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన చర్చాగోష్ఠిలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. సర్కారు తీరును తీవ్రంగా ఖండించారు. ఫ్యాక్ట్ సంస్థ ప్రతినిధి టి.వి.రావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలపక్షం వహించే పత్రికల గొంతు నొక్కడం అధికార పార్టీలకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ నుంచి ఈ ధోరణి మొదలై నేడు సాక్షి వరకూ వచ్చిందని, ఇప్పుడైనా తీవ్రంగా ప్రతిఘటించకపోతే భవిష్యత్తులో ఇతర పత్రికలకు సైతం ముప్పు కలిగే ప్రమాదముందని హెచ్చరించారు. మినీ ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ధోరణిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కొన్ని పత్రికలు, చానళ్లు అవినీతి కేసుల్లో మంత్రులనెందుకు అరెస్టు చేయడంలేదన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలకు అసలు ప్రాధాన్యమివ్వకుండా, సాటి పత్రికపై చిన్నపాటి వ్యాఖ్యలకు ఎక్కడా లేని ప్రాధాన్యమిస్తుండటం దురదృష్టకరమని అన్నారు. సీబీఐ విచారణ పూర్తి కాకుండానే చార్జిషీట్ మీద చార్జిషీట్ దాఖలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా సాక్షి పత్రికను ఇబ్బందిపెట్టడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. ప్రముఖ పాత్రికేయులు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తే ఆ పత్రికను ఎలా ఇబ్బందిపెడతారో ప్రస్తుతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టులు ఐక్యంగా ఒకే తాటిపైకి రావడం అవసరమని సూచించారు.

పభుత్వానికి ఉన్నపళంగా ప్రకటనలు నిలిపివేసే హక్కు లేదని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి గుర్తుచేశారు. సాక్షి మీడియా పెట్టుబడులపై సీబీఐ విచారిస్తోందనే సాకుతో ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం సరికాదన్నారు. సాక్షి పుట్టడమే తప్పు అన్నట్టు వ్యవహరించడం విచక్షణారాహిత్యమని విమర్శించారు. ప్రముఖ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ సాక్షి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడంలో ఏ పార్టీకి, మీడియా సంస్థలకు కూడా సంబంధం లేదని స్వయానా సీఎం చెప్పడం అనుమానాలకు తావిస్తోం దన్నారు. ఎలాంటి సంబంధం లేకుండా ప్రతిపక్షాలు, ఇతర మీడియా సంస్థలను సీఎం ప్రస్తావించాల్సిన అవసరమేముందని ప్రజలు అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న మరికొందరు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

పాలకుల మనోవైకల్యమే కారణం

పాలకుల మనోవైకల్యమే పత్రికలపై దాడికి కారణం. సాక్షిపై ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకించడాన్ని కూడా కొందరు నాయకులు, కొన్ని పత్రికలు తప్పుపడుతున్నాయి. ఇది సరికాదు. సాక్షిలో వెయ్యి మంది ఉద్యోగులే ఉన్నారని హేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రికి వెయ్యి కుటుంబాలు ఉపాధి కోల్పోవడమంటే లెక్కలేనట్టుంది. సాక్షిని అణచివేసేందుకు ప్రయత్నించడం కోటి మందికి పైగా పాఠకుల హక్కులను హరించడమే. రౌండ్ టేబుల్ సమావేశం కోసం బుక్ చేసిన జూబ్లీ హాల్‌ను రాత్రికి రాత్రే ప్రభుత్వం రద్దు చేయడంలో దమననీతి కనిపిస్తోంది. మూడు నాలుగు రోజులుగా కొన్ని రాజకీయ పక్షాలు, మీడియా సంస్థలు ఏకంగా జర్నలిస్టు సంఘాలపైనే గురిపెట్టాయి. సాక్షి విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన మాపై కొన్ని రాజకీయ పక్షాలు, కొందరు వ్యక్తులు తప్పుబడుతున్నారు.
-దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్

ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే

పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగం. గతంలో పలు కేసుల్లో కూడా సుప్రీం కోర్టు ఈ అంశాన్ని స్పష్టం చేసింది. పత్రిక ముద్రణకు ఎలాంటి ఆటంకం కలిగించినా అది పత్రికా స్వేచ్ఛపై దాడే. సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేయడమే. ఫ్యాక్ట్ సదస్సుకు జూబ్లీహాల్‌ను కేటాయించి తిరిగి రద్దు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం.
-శ్రీనివాసరెడ్డి, ఐజేయూ నేత

ప్రకటనల్లోనూ రాజకీయమే

పత్రికలకు కేటాయించే ప్రకటనల్లో కూడా ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రభుత్వానికి వత్తాసు పలికే పత్రికలకు లబ్ధి చేకూర్చేందుకు, వారి అన్యాయాన్ని వ్యతిరేకించే వారి ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రకటనలను అడ్డంపెట్టుకుంటోంది. ప్రభుత్వం ప్రకటనలను ఛారిటీగా ఇవ్వడంలేదు. ఈ పరిస్థితుల్లో స్పందించకుంటే ప్రభుత్వం భవిష్యత్తులో పత్రికలపై దమనకాండను మరింత తీవ్రతరం చేస్తుంది.
-కె.అమర్‌నాథ్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు

రెండో గొంతు ఉండకూడదా?

సీబీఐ దర్యాప్తు రాజకీయ శక్తుల దర్యాప్తుగా మారింది. సీబీఐ దర్యాప్తులో, చార్జిషీట్‌లలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది? ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాక్షి మీడియా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రంలో మూడో శక్తి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మీడియాలో రెండో గొంతు, రెండో బొమ్మ ఉండకూడదనే కుట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీలు భాగస్వాములయ్యాయి. ఆదాయ పన్ను అధికారులు ఆదేశించారు కాబట్టి సాక్షిని మూసేయాలని అసెంబ్లీలో ప్రకటించిన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌కు.. ఐటీ ఆదేశాలను పలుమార్లు సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలియకపోవడం దురదృష్టకరం.
-జీవీడీ కృష్ణమోహన్, సీనియర్ జర్నలిస్టు

ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ

రాష్ట్రంలో మీడియా మనుగడకే ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ సమాచారం ప్రజల్లోకి వస్తే వారి ఉనికికి, రాజకీయ మనుగడకు భంగకరమని భావిస్తున్న శక్తులు ఆ సమాచారాన్ని పాఠకులకు అందిస్తున్న మీడియాను అసలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న చర్యలను మనం పరిమిత దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. విస్తృత దృష్టితో చూడాలని చెబుతున్నవారు కూడా సంకుచితంగా, పరిమితంగా ఉందాం అని మాట్లాడుతున్నారు. కానీ నీ నెత్తిన రాయి పడ్డప్పుడు నువ్వు ఏడువు. నా నెత్తిన రాయిపడ్డప్పుడు నేను ఏడుస్తా. అవకాశం దొరికితే నేనూ రెండు రాళ్లేస్తా.. అనే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పౌరసమాజం ముందుకు రాకపోతే ఇది పెడధోరణులకు దారి తీస్తుంది. మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుంది.
-ఆర్.దిలీప్‌రెడ్డి, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్

ఇది ఉద్యోగులను చంపడమే

సాక్షి మీడియా అకౌంట్లను స్తంభింపజేయడం, ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేయడమంటే ఆ సంస్థలోని ఉద్యోగులను చంపడమే. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం సాక్షికి ప్రజాసేవా సంఘాలన్నీ అండగా నిలుస్తాయి.
-ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి

గొంతునొక్కే ప్రయత్నం

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అభిప్రాయాలు వ్యక్తీకరించే మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
-శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టు

మీడియాపై దాడికి పరాకాష్ట

ఇది మీడియాపై దాడికి పరాకాష్ట. ప్రభుత్వం టార్గెట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం వేరు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యహరించడం చాలా దురాగతం.
-కె.బి.లక్ష్మి, సీనియర్ జర్నలిస్టు

ఉదయం మూతపడినప్పుడు..

ఉదయం పత్రిక మూతపడినప్పుడు ఉద్యోగాలు కోల్పోయినవారిలో కొందరు నేటికీ హోటళ్లు, కిళ్లీ కొట్లు నడుపుకుంటూ ఇబ్బందుల్లో ఉన్నారు. పార్లమెంటులో 45% మంది డెకాయిట్లు ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోవడంలేదు. సాక్షిలో ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదు.
-ఎన్.సీతారాములు, సీనియర్ జర్నలిస్టు
అందరి మాటా మీడియా పరిరక్షణే

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మీడియాను పరిరక్షించుకోవాలనే అందరూ చెప్పారు. స్వేచ్ఛకు జరుగుతున్న అవరోధాలను వివరించడమే కాకుండా, మీడియాను పరిరక్షించేందుకు పౌరసేవా సంఘాలుగా మేం కంకణబద్ధులై కృషిచేస్తాం.
-టీవీ రావు, సమన్వయకర్త 

Share this article :

0 comments: