ఎన్టీఆర్ ట్రస్టు గురించి చెప్పరేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్టీఆర్ ట్రస్టు గురించి చెప్పరేం?

ఎన్టీఆర్ ట్రస్టు గురించి చెప్పరేం?

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ నిప్పులు
ఆయన ఉన్మాదిలా మారిపోయి జగన్‌పై విమర్శలు చేస్తున్నారు
వాస్తవానికి రాక్షసులందరి ప్రతిరూపమే చంద్రబాబు
మీ రాక్షస పాలన తాలూకు ఛాయలు ప్రజల్ని ఇంకా వెంటాడుతున్నాయి
మీ పాలనలో ప్రతి పేజీ రక్తచరిత్రే కదా..
వైఎస్సార్ కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ టీడీపీ అధినేతకు సవాల్

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక ఉన్మాదిలాగా మారిపోయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పైనా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపైనా అవాకులు చవాకులు పేలుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. సోమవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ గజదొంగల పార్టీ అని.. రాష్ట్రంలో రాక్షసులు పుట్టారని చంద్రబాబు మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారు.

వాస్తవానికి రాక్షసులందరి ప్రతిరూపమే చంద్రబాబు’ అని విమర్శించారు. టీడీపీ అధినేత తొమ్మిదేళ్ల పాలనలో ఆయన రాక్షస రూపం ఎలా ఉంటుందో ప్రజలింకా మర్చి పోలేదని.. అందుకే ఏ ఎన్నికలొచ్చినా ఆయన్ను ఓడిస్తూ వస్తున్నారని చెప్పారు. ‘ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావని.. అన్ని సీట్లలోనూ ఓడిపోతారని బాబు ప్రచారం చేస్తున్నారు. ఆ 18 సీట్లలో మా పార్టీ విజయం సాధిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?’ అని బాబుకు ఆమె సవాలు విసిరారు.

ఎన్టీఆర్ ట్రస్టు గురించి చెప్పరేం?

నిన్నటి దాకా జగన్ లక్ష కోట్లు దోచుకుని వాటిని దాచుకోవడానికే రాజకీయాలు చేస్తున్నారని ఇష్టానుసారం ఆరోపణలు చేసిన బాబు.. ఇప్పుడు ఆయన గజదొంగ అని దిగజారుడు ప్రచారం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో రాజకీయాలు దిగజారడం ప్రారంభమైంది చంద్రబాబు హయాం నుంచేనని.. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగడానికి ఆద్యుడు ఆయనేనని చెప్పారు. ‘ఏపీ ఎన్నిక ల్లో అయ్యే ఖర్చు చూసి జాతీయ స్థాయిలోనే బాబోయ్ అన్న పరిస్థితి బాబు పాలనలోనే ఏర్పడింది. రాష్ర్టంలో మీడియాతో సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిన ఘనతా ఆయనదే’ అని తెలిపారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన భూకేటాయింపుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. ఏనాడైనా ఎన్టీఆర్ ట్రస్టు గురించి వాస్తవాలు చెప్పారా? అని నిలదీశారు.

‘ఎన్టీఆర్ ట్రస్టుకు మీరే చైర్మన్‌గా ఉంటారు. ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు. ముఖ్యమంత్రి హోదాలో ట్రస్టుకు భూమిని కేటాయిస్తారు. ట్రస్టు పేరు చెప్పి విదేశాల్లో దండిన డబ్బులు టీడీపీకి మళ్లించుకుంటారు. ఇన్ని చేసినా.. మీరు ట్రస్టుకు సంబంధించిన విషయాలు ఎన్నడైనా వెల్లడించారా? ఐఎంజీ భారత, జీఎమ్మార్ సంస్థలకు మీరు కేటాయించిన భూముల్లో ఎన్ని కోట్లు చేతులు మారాయో చెప్పండి. విశాఖపట్నంలో ఒకప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న మూర్తికి వేలాది ఎకరాలు కేటాయించిన ఉదంతంలో ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి’ అని ఆమె ప్రశ్నించారు.

అక్రమాస్తులకు చిరునామా రామోజీరావే..

రాష్ట్రంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఏనాడూ ఆలోచించని రాక్షసుడు చంద్రబాబు అని పద్మ దుయ్యబట్టారు. ఎన్నడైనా ప్రజల సమస్యలపై మనసు పెట్టి ఆలోచించారా అని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే డబ్బు కోసం మరణిస్తున్నారని చెప్పిన రాక్షసుడు చంద్రబాబు అని అన్నారు.

తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడిన బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ జైలుకు వెళ్లడంపై హర్షం వ్యక్తం చేసిన బాబు తన సంగతేమిటో కూడా గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. ఇదే తెహల్కా.డాట్ కామ్ 2002 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజకీయ వేత్త చంద్రబాబు అని ప్రచురించిన విషయానికి ఏం సమాధానం చెబుతారని ఆమె నిలదీశారు.

తన పాలన చాలా గొప్పదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. ‘మీరేమైనా రాముడికి వారసులా? మీదేమైనా రాముడి పాలనా.. ప్రజలు గుర్తుంచుకోవడానికి? మీ పాలనలో ప్రతి పేజీ కూడా రక్త చరిత్రే కదా! విద్యుత్ చార్జీలు తగ్గించమన్నందుకు బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకోలేదా? తమ వేతనాలు పెంచాలని ఆందోళన చేసిన అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన విషయం మరిచారా? వాటిని బాబు మర్చిపోయి ఉండవచ్చు కానీ.. ఆ రాక్షస పాలన తాలూకు ఛాయలు ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయి’ అని మండిపడ్డారు.

జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన కేసులు అక్రమమో, సక్రమమో ఏ కోర్టూ తేల్చకముందే అవి అక్రమాస్తులంటూ జగన్‌కు ఆపాదిస్తున్నారంటూ పద్మ ‘ఈనాడు’ పత్రికాధిపతిని తప్పుపట్టారు. వాస్తవానికి రాష్ట్రంలో అక్రమ ఆస్తులకు చిరునామా రామోజీరావేనని విమర్శించారు. రామోజీ ఫిలింసిటీలో వందలాది ఎకరాల పట్టా, అసైన్డ్ భూములు ఉన్నాయని.. అవి అక్రమమని ల్యాండ్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందని చెప్పారు. పాల్మాకుల వద్ద 60 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా రామోజీ అధీనంలో ఉందని.. మరి దాని మాటేమిటని ఆమె నిలదీశారు. రామోజీరావు తన పత్రికలో అడ్డగోలుగా రాస్తూ.. తాను చెప్పిందే ప్రజలు నమ్మాలనుకుంటే కుదరదని.. తాము ఈ పరిస్థితిని తప్పకుండా ఎదుర్కొంటామని ఆమె అన్నారు.
Share this article :

0 comments: