‘సాక్షి’ మూతే సీబీఐ లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’ మూతే సీబీఐ లక్ష్యం

‘సాక్షి’ మూతే సీబీఐ లక్ష్యం

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

* 2జీ కేసులో సైతం టెలికం కంపెనీల ఖాతాల్ని స్తంభింపజేయలేదు
* కేవలం కక్ష సాధింపుతోనే జగతి కేసులో ఇలా చేస్తున్నారు 
* దర్యాప్తు పూర్తయి, చార్జిషీట్లు వేశాక స్తంభింపజేయడం చట్ట విరుద్ధం
* ఖాతాల్ని తిరిగి తెరిపించాలని సీబీఐని ఆదేశించండి
* సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి న్యాయవాదుల విజ్ఞప్తి
* ఖాతాల్ని స్తంభింపజేయలేదంటూ సీబీఐ విచిత్ర వాదన
* ఆ మేరకు బ్యాంకులకు లేఖ మాత్రమే రాశామన్న న్యాయవాది
* ఇలాంటి వాదనలు చేయొద్దు: న్యాయమూర్తి పట్టాభి సీరియస్
* లేఖ రాశాక ఫ్రీజ్ చేయకుంటే ఊరుకుంటారా అంటూ ప్రశ్నాస్త్రాలు
* వాదనలు పూర్తి... తీర్పు ఈ నెల 14కు వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి పత్రికను, చానల్‌ను మూసేసి.. అవి అందించే సమాచారాన్ని ప్రజలకు చేరకుండా చేయటమే సీబీఐ లక్ష్యంగా కనిపిస్తోందని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ సంస్థలు పేర్కొన్నాయి. రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే సాక్షి సంస్థల బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపజేసిందని, ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఇలాంటి కుటిల యత్నాలకు పాల్పడుతున్నారని తెలియజేశాయి. ఖాతాలను స్తంభింపజేయటాన్ని సవాలు చేస్తూ జనని ఇన్‌ఫ్రాతో కలిసి జగతి, ఇందిరా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చాయి. సీబీఐ న్యాయవాది బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపిస్తూ ఒకదశలో తాము జగతి, ఇందిరా, జనని ఖాతాలను స్తంభింపజేయలేదన్నారు! దాంతో జగతి సంస్థల న్యాయవాది ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. 

‘‘అలాగైతే మాకేం నొప్పి? కోర్టుకెందుకు వస్తాం? ఇక్కడికొచ్చి పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తాం?’’ అంటూ గట్టిగా ప్రశ్నించడంతో న్యాయమూర్తి పట్టాభి రామారావు జోక్యం చేసుకుని దీనిపై సీబీఐ లాయర్‌ను ప్రశ్నించారు. ‘‘బ్యాంకుకు లేఖ రాశాం. అయితే ఖాతాల్ని స్తంభింపజేసినట్టుగా బ్యాంకుల నుంచి మాకింకా సమాచారం రాలేదు’’ అని లాయర్ బదులివ్వడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరు లేఖ రాశాక కూడా బ్యాంకులు ఆ ఖాతాల్ని స్తంభింపజేయకుంటే ఊరుకుంటారా?’’ అని ప్రశ్నించారు. ఇలాంటి వాదన వినిపించటం సరికాదని స్పష్టం చేశారు. విచారణ ముగియటంతో తీర్పును ఈ నెల 14న వెలువరిస్తానంటూ వాయిదా వేశారు.

నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు..
జగతి సంస్థల తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, వి.సురేందర్‌రావు వాదనలు కొనసాగించారు. ఖాతాలు స్తంభింపజేయటాన్ని తీవ్రమైన చర్యగా అభివర్ణించారు. ‘‘అనుక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేసే చానల్‌ను, పత్రికను నడపడం చాలా సంక్లిష్టం. రోజూ లక్షల రూపాయల విలువైన న్యూస్ ప్రింట్ కావాలి. తెల్లవారుజామున 3-4 గంటల మధ్య పత్రికను పాఠకులకు అందుబాటులోకి తేవాలి. చానల్లో ప్రతి క్షణం తాజా సమాచారం ప్రసారం చేస్తుండాలి. అలా నిరంతరం కార్యకలాపాలు సాగకుంటే షేరు విలువ పడిపోతుంది. అలా మరికొన్నాళ్లు సాగితే సంస్థ పూడ్చుకోలేని నష్టాల్లోకి వెళుతుంది. అప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర నిందితులు నిర్దోషులుగా బయటపడినా, కోర్టులు జోక్యం చేసుకున్నా జరిగిన నష్టాన్ని ఏమాత్రం పూడ్చలేవు’’ అని వారు వివరించారు. ‘‘రూ.60 వేల కోట్ల 2జీ కుంభకోణాన్ని కూడా సీబీఐ సంస్థే దర్యాప్తు చేస్తోంది. అంతటి కేసులో కూడా టెలికం కంపెనీల బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేయలేదు. అలా చేస్తే టెలికం రంగం కుప్పకూలిపోయి ఉండేది’’ అన్నారు. ఖాతాల స్తంభన వల్ల టర్మ్ లోన్లు, ఇతర కార్యకలాపాలకు విఘాతం కల్గుతుందన్నారు.

దర్యాప్తులో పారదర్శకత లేదు..
సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, దానిది పూర్తిగా తొందరపాటు చర్యని జగతి న్యాయవాదులు చెప్పారు. ఇందుకు చట్టం ఎంతమాత్రం అనుమతించదన్నారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది. అలా చేసిన తరవాత సీఆర్‌పీసీ సెక్షన్ 102 కింద ఖాతాల్ని స్తంభింపజేసే అధికారం దానికి లేదు. గతేడాది ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక ఈ ఏడాది మార్చి 31న దర్యాప్తు పూర్తి చేసి మొదటి చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. ఏప్రిల్ 23న ఒకటి, ఈ నెల 7న మరొకటి.. ఇలా మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. 

ఇంతా చేసి, ఇప్పుడు ఖాతాల్ని నిలిపేసింది. ఒకవేళ ఇదే పని చేయాలనుకుంటే మొదటే చేయొచ్చుగా? జగతి, ఇందిరా, జనని సంస్థల ఖాతాల వివరాలు సీబీఐకి ముందే తెలుసుగా? కేసు నమోదు చేసినప్పుడే వాటన్నింటి వివరాలూ దాని దగ్గరున్నాయిగా? అయినా అప్పుడేమీ చేయకుండా ఇప్పుడిలా చేయడంలో అర్థమేమిటి?’’ అని వారు వాదించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 102 కింద ‘సాక్షి’ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే ముందు సరైన కారణాలను చూపాల్సి ఉన్నా, న్యాయస్థానాన్ని కూడా సంతృప్తి పరచాల్సి ఉన్నా సీబీఐ అలాంటిదేమీ చేయలేదని విన్నవించారు.

బ్యాంకు గ్యారంటీ ఇస్తే అభ్యంతరమేంటి?
జప్తు చేసిన ఖాతాల్లో ఉన్న నగదుకు సమానమైన మొత్తాన్ని బ్యాంకు గ్యారంటీగా ఇస్తామని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రా స్పష్టం చేయడంతో దీనిపై సీబీఐ న్యాయవాదిని జడ్జి పట్టాభి రామారావు ప్రశ్నించారు. ‘‘జప్తు చేసిన ఖాతాల్లో ఉన్న నగదుకు సమానమైన మొత్తానికి వాళ్లు బ్యాంకు గ్యారంటీ ఇస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ ఖాతాల్లో లావాదేవీల్ని అనుమతించడానికి మీకున్న అభ్యంతరమేమిటి?’’ అని ప్రశ్నించారు. ఇందుకు చట్టం అనుమతించదని సీబీఐ న్యాయవాది పేర్కొనటంతో, ‘‘చట్టం గురించి తెలుసుకోండి. సీఆర్‌పీసీలోని 451, 542 సెక్షన్లు చదవండి’’ అని సూచించారు. ‘‘మీ తీరు చూస్తుంటే న్యాయవ్యవస్థ లోకి కొత్తగా వచ్చిన మేజిస్ట్రేట్ ముందు వాదిస్తున్నట్లుగా ఉంది. ఈ పద్ధతి సరికాదు’’ అంటూ మందలించారు.

సీబీఐ ఓవరాక్షన్ చేస్తోంది..
‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు లబ్ధి చేకూర్చినట్టుగా సీబీఐ చెబుతున్న జీవోలను ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేయలేదని జగతి న్యాయవాదులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఈ జీవోలకు కారణమైన మంత్రులు, ఐఏఎస్ అధికారులను అరెస్టు చేయలేదు. అంటే నష్టం జరగలేదని ప్రభుత్వం భావిస్తున్నట్టేగా? మరి ప్రభుత్వమే అలా భావిస్తున్నప్పుడు సీబీఐకి అభ్యంతరమెందుకు? అది ఓవరాక్షన్ చేస్తోంది. ఎవరి ప్రయోజనాల కోసమో ఇలా చేస్తోంది’’ అని అన్నారు. 

ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టారని భావిస్తే.. ఆయా సంస్థలు, వ్యక్తులకిచ్చిన షేర్లను సీజ్ చేయొచ్చని సూచించారు. ‘‘సీబీఐ తొలి చార్జిషీట్‌లో పేర్కొన్న మేరకు హెటిరోకు రూ.8.64 కోట్ల విలువైన భూమిని కేటాయించినందుకు అది సాక్షిలో రూ.19.5 కోట్ల పెట్టుబడులు పెట్టిందనేది ఆరోపణ. అలాంటప్పుడు హెటిరోకు ఇచ్చిన షేర్లను సీజ్ చేసుకోవచ్చు. అభియోగాలు నిరూపణ కాకుండానే, అది అక్రమ సంపద అని నిర్ధారించి ఎలా స్తంభింపజేస్తారు’’ అని ప్రశ్నించారు.

ఉద్యోగుల్ని రోడ్డున పడేసేందుకే!!
సాక్షి సంస్థలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని, ఖాతాల స్తంభన ద్వారా వారంతా రోడ్డున పడే ప్రమాదముందని జగతి న్యాయవాదులు విన్నవించారు. క్విడ్ ప్రొ కొగా సీబీఐ చెబుతున్న సొమ్ము ఇందిరా టెలివిజన్‌లోకి ఒక్క రూపాయి కూడా వచ్చినట్టు చార్జిషీట్లో పేర్కొనలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ సంస్థ ఖాతాల్ని స్తంభింపజేయటం అత్యున్నత న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. 

‘‘జగతి పబ్లికేషన్స్ ఇప్పటికే రూ.3.13 కోట్ల చెక్కులు జారీ చేసింది. ఖాతాల స్తంభన వల్ల అవి బౌన్సయ్యే ప్రమాదముంది. అప్పుడు దానిపై వారు వేసే కేసులు ఈ సీబీఐ కేసుల కన్నా తీవ్రమైనవి, సాక్షి ప్రతిష్టను మసకబార్చేవి. పెపైచ్చు ఈ చర్య వల్ల సాక్షి టీవీ వ్యూయర్‌షిప్ తగ్గిపోయే ప్రమాదముంది. తర్వాత ప్రకటనలూ తగ్గుతాయి. గతంలో తీసుకున్న ప్రకటనలను కూడా ప్రసారం చేయలేకపోవచ్చు. అంతిమంగా టీవీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవచ్చు. అపుడు సివిల్, క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు’’ అని వివరించారు. సీబీఐ రెండో చార్జిషీట్ ప్రకారం షేర్‌హోల్డర్ల డబ్బు కూడా ఇదే బ్యాంకు ఖాతాల్లో ఉందన్నారు. 

‘‘రెండో చార్జిషీట్‌లో పేర్కొన్న మేరకు మాధవ్ రామచంద్రన్, దండమూడి అరవింద్ కుమార్, టీఆర్ కన్నన్‌ల పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్‌లో ఉన్నాయి. వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధీ పొందలేదు. వారు కేవలం మోసపోయిన వారేనని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు వారి డబ్బున్న ఖాతాలను ఎలా స్తంభింపజేస్తారు?’’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాక అవి కక్ష సాధింపులకు దిగుతున్నాయని, సీబీఐ ఖాతాల స్తంభన కూడా దీన్లో భాగమేనని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించేందుకే సీబీఐ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతోందన్నారు.
Share this article :

0 comments: