భూమా నాగిరెడ్డికి గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించాలని హైకోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూమా నాగిరెడ్డికి గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించాలని హైకోర్టు

భూమా నాగిరెడ్డికి గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించాలని హైకోర్టు

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ కన్వీనర్ భూమా నాగిరెడ్డికి గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత ఉపసంహరణపై పోలీసులకు నోటీసులు జారీ చేశారు. తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ చంద్రకుమార్ విచారించారు. భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని, ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పిటిషనర్ కదకలికను నియంత్రించాలనే ఉద్దేశంతో పోలీసులు భద్రతను ఉపసంహరించారని ఆయన తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ కోర్టుకు నివేదించారు.

పోలీసులు ఇటీవల భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేశారని, తరువాత భద్రత సమీక్షా కమిటీ (ఎస్‌ఆర్‌సీ) ఆయనకున్న భద్రతను ఉపసంహరించాలని సిఫారసు చేసిందని, ఆయనకున్న ఐదుగురు భద్రతా సిబ్బందిని ఉపసంహరించారని వివరించారు. భద్రతను ఉపసంహరించే ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. హైకోర్టు ఆదేశాలతో భద్రతను ఇచ్చినప్పుడు, ఉపసంహరించే ముందు కోర్టు అనుమతి తీసుకుని ఉండాల్సిందని స్పష్టం చేశారు. తక్షణమే భూమా నాగిరెడ్డికి ఐదుగురు భద్రతా సిబ్బం దిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ఐజీ, కర్నూలు ఎస్‌పీలకు నోటీసులు జారీ చేశారు. విచారణను జూన్ 18కి వాయిదా వేశారు.
Share this article :

0 comments: