రాజకీయాల్లోకి వస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయాల్లోకి వస్తా

రాజకీయాల్లోకి వస్తా

Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012

ఆయనేం చెబితే అదే నాకు శిరోధార్యం
ధర్మం, అధర్మం మధ్య యుద్ధం జరుగుతోంది..
కేసు రాజకీయ కుట్ర.. అంతిమ విజయం మాదే
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేయాలన్న ఆసక్తి ఉంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకుంటాను’’ అని ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరుల ప్రశ్నలకు బదులుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రావాలను కోవడంలేదని, సామాన్య పౌరుడిగా సామాన్యుడికి చేతనైన సాయం చేయడానికే రావాలను కుంటున్నానని చెప్పారు. 

‘జగన్ ఏం చెప్పినా అదే నాకు శిరోధార్యం. జీవితాంతం వైఎస్ కుటుంబానికి విధేయుడిగానే ఉంటా’నని స్పష్టం చేశారు. ‘ఇప్పుడు జరుగుతున్నది ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం. రాజకీయ కుట్ర కారణంగానే ఈ కేసు వచ్చింది. చివరకు న్యాయమే గెలుస్తుంది. అంతిమంగా విజయం మాదే’’ అని సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

‘వైఎస్ కుటుంబం ఎవరికీ అన్యాయం చేయలేదు. ఇకముందూ చేయబోదు. మేం బోగస్ కంపెనీలను సృష్టించలేదు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదు. ఎలాంటి దర్యాప్తుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. మాపై మోపిన ఆరోపణలు నిరాధారం. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేస్తాం’’ అని ఆయన ఉద్ఘాటించారు. ‘వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి జగన్ వరకు 30 ఏళ్లుగా ఆ కుటుంబానికి ఆడిటర్‌గా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరించాను.

వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాను’ అని గుర్తు చేశారు. న్యాయపరమైన అంశాల్లో వైఎస్ కుటుంబానికి బాసటగా నిలుస్తానన్నారు. తానెప్పుడూ సాక్షులను బెదిరించలేదని చెప్పారు. బెయిల్ మంజూరు సమయంలో కోర్టు విధిం చిన షరతులకు లోబడే ఉంటానని స్పష్టం చేశారు.

వృత్తి నైపుణ్యం వల్లే పదవి
వైఎస్ కుటుంబానికి మేలు చేకూర్చేలా వ్యవహరించడం వల్లే ఓరియంటల్ బ్యాంక్ అఫ్ కామర్స్ (ఓబీసీ) డెరైక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు అయ్యాననడం పూర్తిగా అవాస్తవమన్నారు. ఆడిటర్‌గా తన వృత్తిపరమైన నైపుణ్యం వల్లే ఓబీసీ డెరైక్టర్‌గా రిజర్వు బ్యాంక్ నియమించిందన్నారు. భగవంతుడి వరప్రసాదం వల్ల టీటీడీ పదవి వచ్చిందని చెప్పారు.

ఖైదీల సౌకర్యాల కోసం పోరాడతా
జైలు జీవితం దుర్భరమని సాయిరెడ్డి చెప్పారు. ‘‘అక్కడున్న సమయంలో ఖైదీల సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు న్యాయపరమైన పుస్తకాల పఠనం, వ్యాయామాలతో గడిపాను. సాధారణ ఖైదీల కష్టాలు తెలుసుకున్నా. వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చట్టబద్ధంగా వారికి అందాల్సిన సౌకర్యాలందడం లేదు. ఖైదీలకు సౌకర్యాల కల్పన కోసం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని ఆయనన్నారు.
Share this article :

0 comments: