ఎవరు గజదొంగలో ప్రజలు నిర్ణయిస్తారు. టీడీపీపై గద్దే బాబూరావు ధ్వజం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎవరు గజదొంగలో ప్రజలు నిర్ణయిస్తారు. టీడీపీపై గద్దే బాబూరావు ధ్వజం

ఎవరు గజదొంగలో ప్రజలు నిర్ణయిస్తారు. టీడీపీపై గద్దే బాబూరావు ధ్వజం

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012



టీడీపీపై గద్దే బాబూరావు ధ్వజం
జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిక


హైదరాబాద్, న్యూస్‌లైన్: దొంగలు ఎవరో, గజదొంగలెవరో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు టీడీపీని దుయ్యబట్టారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం బాబూరావు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జీవితాన్ని, ఆయన వెంట ఉన్న వారినీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజలకు ఎవరేమిటో బాగా తెలుసన్నారు. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు ఏవిధంగా ప్రజలు ఓట్లేశారో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ విషయంలో అలాంటి పరిస్థితే నెలకొని ఉందన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తాను 30 ఏళ్ల క్రితం టీడీపీలో చేరి మూడు దశాబ్దాలుగా ఆ పార్టీలో పనిచేశానని గుర్తుచేస్తూ ఎన్టీఆర్ పర్యవేక్షణలో మూడు జిల్లాల్లో ఏది జరిగినా తానే పర్యవేక్షించానని చెప్పారు. ప్రస్తుతం టీడీపీలో ‘యూజ్ అండ్ త్రో’ (వాడుకుని వదిలేయడం) అనే విధానం కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జనసామాన్యం కోసం ప్రవేశపెట్టిన పథకాలు అమోఘమని, జగన్ మాత్రమే వాటిని అమలు చేయగలడనే విశ్వాసం ప్రజల్లో ఏర్పడిందని, ఒక ప్రజానాయకుడికి ప్రజా విశ్వాసం కన్నా కావాల్సింది ఏముందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన చేరికను పురస్కరించుకుని మే 5, లేదా 7 తేదీల్లో తన నియోజకవర్గంలో భారీ ఎత్తున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

జగన్‌ను తొక్కాలనేది సోనియా అభిమతం: గిరిబాబు

వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉండగా ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కలగన్నారని, అయితే సోనియాగాంధీ మాత్రం వైఎస్ కుమారుడు జగన్‌ను పతనం చేయాలని, ఆయనను భూస్థాపితం చేయాలని చూస్తోందని సినీ నటుడు గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కోరుకున్న వ్యక్తి కుమారుడి పతనం చూడాలనుకోవడం ఏ మాత్రం ధర్మం కాదని, రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారని చెప్పారు. గిరిబాబు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తొలి నుంచీ తాను వైఎస్ అభిమానినని, ఆయనను చూసే 2004లో కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టడం లేదని, అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మే 10 నుంచి తాను ప్రచారం చేస్తానని చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు

పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు నగర పీఆర్పీ మాజీ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన యడవల్లి కృష్ణ, భద్రాచలానికి చెందిన నూనె రామకృష్ణ తదితరులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చి పార్టీలో చేరారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే టి.బాలరాజు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు జాకబ్ సహా పలువురు నాయకులు పార్టీలో చేరారు. చాలా రోజుల విరామం తరువాత హైదరాబాద్‌కు వచ్చిన జగన్‌ను కలుసుకోవడానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు.
Share this article :

0 comments: