ఇక జగన్ వెంటే: మైసూరారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక జగన్ వెంటే: మైసూరారెడ్డి

ఇక జగన్ వెంటే: మైసూరారెడ్డి

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012


ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తా
సీబీఐ విచారణ అంతా రాజకీయం
రాజకీయాలు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి

హైదరాబాద్:టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఉదయం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో కలిసి మైసూరా అల్పాహార విందు చేశారు. ఈ సంఘటనతో తత్తరపాటుకు లోనైన టీడీపీ నాయకత్వం హడావుడిగా మైసూరాను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు జగన్ వెళ్లేటప్పటి వరకూ మైసూరారెడ్డి అక్కడే ఉండి ఆయనను సాగనంపారు. ఆ తరువాత మైసూరా బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను ఇకపై జగన్ వెంటే ఉంటానని ప్రకటించారు. జగన్ తనను మర్యాద పూర్వకంగా అల్పాహార విందుకు ఆహ్వానిస్తే వచ్చాననీ తన సహాయ సహకారాలు కావాలని కోరారనీ అందుకు తాను అంగీకరించి తన శాయశక్తులా శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పాననీ వెల్లడించారు. జగన్ రాజకీయంగా ఎదుగుతున్న నాయకుడనీ ఆయన ఎదుగుదలకు తమ లాంటి పెద్దవాళ్లు ఆశీస్సులు అందించాల్సిన అవసరం ఉందని భావించాననీ మైసూరా వివరించారు.

రాష్ట్రంలో జగన్ కేసులపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన సంస్థ ఒత్తిడులకు లొంగి పక్షపాతంతో విచారణ జరుపడం అనేది చాలా తప్పుడు విధానం అని మైసూరా అన్నారు. సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని దేశమంతా కోడై కూస్తోందనీ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే దానిని వినియోగిస్తున్నాయనేది వెల్లడవుతోందనీ ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ కేసులో ఈ విమర్శలు పూర్తిగా నిజం అవుతున్నాయని మైసూరా అన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చే సింది జగన్‌ను అరెస్టు చేయడానికేనని ఆయన అన్నారు. మోపిదేవిని అరెస్టు చేసింది తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని చెప్పడానికేనని ఆయనను అనవసరంగా బలిపశువును చేశారని మైసూరా అన్నారు. రాజకీయ పార్టీలు కుమ్మక్కు అయి కక్ష సాధిస్తున్నాయనే విషయం స్పష్టంగా తెలిసి పోతోందని ఆయన అన్నారు. జగన్ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో సీబీఐని అడ్డం పెట్టుకుని ఆయన్ను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఈ విచారణ నిస్పక్షపాతంగా కనపడటంలేదన్నారు. జగన్‌పై సీబీఐ విచారణ వేసేందుకు దారితీసిన పరిస్థితులన్నీ తనకు తెలుసన్నారు. ఈ కేసులో ఫలానా వ్యక్తి పేరు చెప్పండని సాక్షులను బెదిరించటం, వేధించటం వంటివి జరుగుతున్నాయన్నారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సీబీఐ విచారణ చేస్తోందన్నారు.ఆ సంస్థ చట్టపరంగా విచారిస్తే ఇబ్బంది లేదని, అయితే అది కొందరి ఒత్తిడికి లొంగి పనిచేస్తోందన్నారు.

జగన్ పట్ల ప్రజల్లో అభిమానం ఉందని, ఆయన అధికారంలోకి వస్తే తమకు మేలు చేస్తారని పేదలు, రైతులు ఆశతో ఉన్నారని వెల్లడించారు. వెఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్ధతు ఉందన్నారు. రాజకీయాల్లో ఏదైనా ఉంటే ప్రజ ల్లోకి వెళ్లి తేల్చుకోవాలే తప్ప పక్షపాతంతో కూడుకున్న విచారణలతో కాదని ఆయన అన్నారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలను నిర్వహించ బోతున్నారని ప్రశ్నించగా జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని చేస్తానని అన్నారు. జగన్‌కు ప్రజాదరణ పెరుగుతోందనీ ఉప ఎన్నికల్లో 18 స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని వచ్చిన వార్తలను ప్రస్తావించగా అది అర్థం లేనిదని, రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత చంద్రబాబును కలిసి ఏదైనా పని ఉంటే పిలవండి వచ్చి చేసి పెడతానని చెప్పానన్నారు. రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనందుకే టీడీపీని వీడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించగా అది నిజం కాదని అన్నారు. తాను మళ్లీ రాజ్యసభ కావాలని బాబును అడుగలేదన్నారు. తానూ, బాబు ఇంకా బతికే ఉన్నారు కనుక ఇది నిజమో కాదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

వై.ఎస్‌తో విభేదించి బయటకు వచ్చానని ఎపుడూ చెప్పలేదు
మైసూరా తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ వై.ఎస్. రాజశేఖరరెడ్డితో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బైటకు వచ్చానని ఎపుడూ చెప్పలేదని వై.ఎస్ మరణించినపుడు కూడా తాను ఆయనకు మంచి నివాళి అర్పించానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. మీకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి సహాకారం అందించాల్సిందిగా జగన్ కోరారని, అందుకు అంగీకరించానని చెప్పారు.

పార్టీ కార్యాలయంలో...
మైసూరా మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి కొద్ది సేపు ఉన్నారు. ఆయనను పార్టీ ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, పి.ఎన్.వి.ప్రసాద్, కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి పద్మ, జ్యోతుల నెహ్రూతో సహా పలువురు సాదరంగా ఆహ్వానించి అందరినీ పరిచయం చేశారు. వై.వి.సుబ్బారెడ్డి ఆయనకు పార్టీ కండువాను వేశారు. 

Share this article :

0 comments: