అవసరమనుకుంటే సాక్షిని ఆర్థికంగా ఆదుకొని సంవత్సర చందాలు కట్టి వందల కోట్లు పెట్టుబడిగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్న తెలుగు వారికి కొదవలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవసరమనుకుంటే సాక్షిని ఆర్థికంగా ఆదుకొని సంవత్సర చందాలు కట్టి వందల కోట్లు పెట్టుబడిగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్న తెలుగు వారికి కొదవలే

అవసరమనుకుంటే సాక్షిని ఆర్థికంగా ఆదుకొని సంవత్సర చందాలు కట్టి వందల కోట్లు పెట్టుబడిగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్న తెలుగు వారికి కొదవలే

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

సాక్షిని ఆర్థికంగా దెబ్బతీయాలని జరుగుతున్న కుటిల యత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమించి, అవసరమనుకుంటే సాక్షిని ఆర్థికంగా ఆదుకొని సంవత్సర చందాలు కట్టి వందల కోట్లు పెట్టుబడిగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్న తెలుగు వారికి కొదవలేదు. ఈ వాస్తవాన్ని సోనియా-అంబానీ-రామోజీరావు-చంద్రబాబు చతుష్టయం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. 

తెలుగు ప్రజల మనస్సాక్షికి ప్రతీకగా ఎదిగి, కోట్లాది మంది పాఠకుల హృదయ స్పందనగా మారిన ‘సాక్షి’ దిన పత్రిక, టీవీ చానెల్ గొంతునొక్కే ప్రయత్నాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టి, రాష్ట్ర చరిత్రలో మరో చీకటి అధ్యాయానికి తెరలేపింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకులతో చేతులు కలిపి సీబీఐ వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థను అడ్డం పెట్టుకుని ‘సాక్షి’ మీడియా సంస్థలపై దాడికి పూనుకోవడం అమానుషం, అప్రజాస్వామికం.

రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోతుందా అన్న తరుణంలో ఎంతో ప్రయాసకోర్చి, 2003లో వైఎస్ సాగించిన ‘ప్రజాప్రస్థాన పాదయాత్ర’ కాంగ్రెస్‌ను అధికారం పీఠంపై అధిష్టింపజేసిన వైనం రాష్ట్ర ప్రజల మనోఫలకంపై ఇంకా సజీవంగానే కదులాడుతోందన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం విస్మరించి ప్రవర్తించడం విచారకరం. 2004లో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాగించిన కృషి తెలుగునేలకు జాతీయ స్థాయిలో ఎనలేని ఖ్యాతిని సాధించిపెటింది.

కాంగ్రెస్ వ్యతిరేకశక్తులన్నీ ఏకమై ఏర్పడ్డ ‘మహాకూటమి’ని ఒంటిచేత్తో ఢీకొని 2009లో వరుసగా రెండోసారి పార్టీని అధికారంలోకి తెచ్చి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజల హృదయాల్లో చెరగని ముద్రగా మిగిలిపోయారు వైఎస్. అంతటి మహానేత పార్టీకి అందించిన సేవలను మరచి, నేడు కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి అక్రమాస్తుల పేరుతో సీబీఐని ఉసిగొల్పడం ఎవరి ప్రయోజనాలను కాపాడటానికో అందరూ గమనిస్తూనే ఉన్నారు.

‘ఈనాడు’లో కంపానీ అనే జేబు సంస్థ ద్వారా రిలయన్స్ గ్రూపు రూ.2,600 కోట్లు పెట్టుబడులుగా పెట్టడాన్ని గుడ్లప్పగించి చూసిన ప్రభుత్వం, నేడు జగన్ అక్రమాస్తులపై విచారణ జరిపించడం విడ్డూరమే. ‘మార్గదర్శి చిట్‌ఫండ్’ పేరుతో ఆర్థిక మంత్రిత్వశాఖ నియమనిబంధనలకు భిన్నంగా రామోజీరావు ప్రజల నుంచి రూ.2 వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించడం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఓ స్వతంత్ర బ్యాంకులా వ్యవహరించడం, బ్యాంకింగ్ రంగానికి పోటీగా ఎదగడం ఎంతటి ఆర్థిక నేరమో అందరికీ తెలిసిందే. ఇటీవల రిలయన్స్ కంపెనీ గోదావరి-కృష్ణా బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు వెలికితీతలో భారత ప్రభుత్వాన్ని మోసగిస్తూ తప్పుడు లెక్కలు చూపించి రూ.14 వందల కోట్ల మేర రాష్ట్రంలో వినియోగదారులపై భారం మోపే చర్యలకు పాల్పడటం మనం చూస్తున్నదే. 

రెండున్నర ఎకరాల ఆసామి చంద్రబాబు రెండువేల కోట్లకు మించి ఆస్తులు సంపాదించడం ఎలా సాధ్యమైందన్నది జవాబులేని ప్రశ్నగానే మిగిలి పోయింది. ‘ఈనాడు’ అండతో టీడీపీ అధికారంలో కొనసాగిన తొమ్మిదేళ్ల కాలంలో కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించే పేరిట వేలకు వేల ఎకరాలు అప్పనంగా అప్పగించిన చరిత్ర కూడా తెలిసిందే. కేజీ బేసిన్‌లోని గ్యాస్ నిక్షేపాలు వెలికితీయడానికి రిలయన్స్ కంపెనీకి చంద్రబాబు, రామోజీరావు బాహాటంగా తోడ్పడ్డారు కాబట్టే, రిలయన్స్ సంస్థ రామోజీ కంపెనీలకు వేల కోట్ల పెట్టుబడి సమకూర్చింది. ఈ పరిణామాలను దివంగత నేత వైఎస్ తీవ్రంగా వ్యతిరేకించారు. 

గ్యాస్ నిక్షేపాలు మన అవసరాలు తీరిన తరువాతే దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రిగా ప్రధానితో, కేంద్రంలోని ఇతర మంత్రులతో ఇందుకోసం రాజీలేని పోరాటం సాగించారు. చంద్రబాబు-రామోజీరావుల పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ పార్టీని వైఎస్ అధికారంలోకి తీసుకొచ్చిన తీరు చరిత్రాత్మకం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు కాలం చెల్లిందని, ఇక తమిళనాడు, గుజరాత్, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల మాదిరే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం రాష్ట్రంలో కూడా వేళ్లూనుకొని పోయిందన్న భావనను పూర్వపక్షం చేస్తూ టీడీపీని రెండుసార్లు ఓడించిన ఒకే ఒక్కడు వైఎస్. 

సోనియాను విదేశీ మహిళగా, రాజీవ్‌గాంధీని అవినీతి అక్రమాలకు పేరుగాంచిన వాడుగా ‘ఈనాడు’ రాతలు, ‘ఈటీవీ’ వార్తలను ప్రజలు ఇంకా మరచిపోలేదు. సోనియాగాంధీ వైఎస్ మరణానంతరం వైఎస్ కుటుంబంపై కనబరచిన నిర్లక్ష్యం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. దివంగత ముఖ్యమంత్రి కుటుంబం ఓదార్పు యాత్రకు అనుమతిని అడగడానికి సోనియా గాంధీని కలసినప్పుడు ఆమె ప్రదర్శించిన అహంభావ ధోరణి వైఎస్ అభిమానులను కలచివేసింది. 

ఇంతకూ వైఎస్‌పై, ఆ కుటుంబంపై వ్యతిరేకత ఎందుకు? తాను చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ పథకాలకు ఇందిర, రాజీవ్ గాంధీ పేర్లను పెట్టడం ద్వారా నెహ్రూ-ఇందిర కుటుంబాన్ని వైఎస్ గౌరవించారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తన ఆశయమని మరణానికి కొద్ది రోజులముందు వైఎస్ ప్రకటించడం, ఆ కుటుంబంపై తనకు గల ఆదర భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ కుటుంబానికి గౌరవ మర్యాదలు ఇస్తూనే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నెన్నో పథకాలను ప్రవేశపెట్టారు. 

వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు ప్రాణప్రతిష్ట చేయడంతో పాటు, బడుగు జీవుల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఇవన్నీ కేంద్ర ప్రణాళికామండలి, కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు భిన్నంగా చేపట్టిన కార్యక్రమాలే కావడం గమనార్హం. అదే విధంగా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను పరిరక్షించే పని ఆయన పెట్టుకోలేదు. సేద్యపునీటి రంగంలో లక్షా 75 వేల కోట్ల రూపాయల పథకాలకు శ్రీకారం చుట్టారు.

ఉచిత విద్యుత్తు, పావలా వడ్డీ, 108, 104 వైద్యసేవలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, తదితర ప్రజోపయోగ పథకాలను స్వతంత్రంగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ చేపట్టడం కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. 2009 ఎన్నికల సందర్భంగా దాదాపు 160 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపోటములకు తనదే బాధ్యతంటూ వైఎస్ ప్రకటించడం సోనియా గాంధీకి, ఇతర కాంగ్రెస్ పెద్దలకు మింగుడుపడలేదు. 

కేంద్ర ప్రభుత్వంపై గత 15 ఏళ్లుగా రిలయన్స్ పెత్తనం సాగుతోంది. కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల అధిపతుల కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలించే పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయరంగాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తూ, పరిశ్రమలకు మాత్రం అనేక ప్రోత్సాహకాలు కల్పించడం మనం చూస్తున్నదే. అవినీతి అక్రమాలు, గ్రూపు రాజకీయాలు, క్రమశిక్షణా రాహిత్యం, అధికారదర్పం, బడుగు-బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలంటే లెక్కలేనితనం... కాంగ్రెస్ పార్టీ విధివిధానంగా మారిపోయింది. ఇందుకు భిన్నంగా వైఎస్ పాలన సాగినందువల్లే ఆయన శత్రు శిబిరం ఏకమవుతూ వచ్చింది.

సోనియాగాంధీ-ముఖేష్ అంబానీ-రామోజీరావు- చంద్రబాబు... దుష్టచతుష్టయంగా, అపవిత్ర కూటమిగా ఏర్పడి జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన నెలకొల్పిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాడులు చేస్తూ వస్తున్నది. వైఎస్ విజయమ్మ న్యాయం కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన మరు క్షణమే అన్ని వ్యాపార, న్యాయసూత్రాలను వదిలిపెట్టి, హైకోర్టుకు వచ్చి ప్రతివాదిగా రిలయన్స్ కంపెనీ రామోజీ, చంద్రబాబులకు అండగా నిలవడం దేనికి సంకేతం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలయన్స్ సంస్థ కలిసిపోయి అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారిన చంద్రబాబు, రామోజీరావులను వదిలేసి జగన్‌మోహన్‌రెడ్డి సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానెల్‌పై దాడికి పాల్పడటం దేనికో ప్రజలు గ్రహిస్తున్నారు. 

సొంత నియోజకవర్గాలైన రాయబరేలీ, అమేథీలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోలేని వారికి భారతదేశం, ప్రత్యేకించి మన రాష్ట్రంలో రాజకీయాలను శాసించే అర్హత ఉంటుందా? తమిళనాడులో ఏ మాత్రం ప్రజాపునాది లేని చిదంబరం, గుజరాత్‌లో ప్రజలు తిరస్కరించిన అహ్మద్ పటేల్ సోనియా ముఖ్య అనుచరులుగా కొనసాగడానికి కారణం, వారు రిలయన్స్ అంబానీకి సన్నిహితులు కావడమేనన్నది బహిరంగ రహస్యం. 2జీ స్పెక్ట్రమ్ కేసు నుంచి చిదంబరంను రక్షించడానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలు, యూపీఏ అవినీతి రహిత రాజకీయాలకు సంకేతమా? 

రాష్ట్రంలో రాజకీయ కుట్రలు, కుతంత్రాలు ప్రస్తుతం అత్యంత నీచస్థాయికి చేరుకున్నాయి. ఏ విధమైన భేషజాలు లేకుండా తమ ముసుగులను తొలగించుకొని ప్రజలకు వ్యతిరేకంగా కిరణ్-చంద్రబాబు-రామోజీరావు త్రయం తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. జగన్‌కు వ్యతిరేకంగా తమ ప్రచారాన్ని ఈ ముగ్గురు ముమ్మరం చేశారు. వైఎస్, ఆయన కుమారుడు జగన్ లక్షల కోట్లు సంపాదించారని, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి, రామోజీరావు, చంద్రబాబు తదితరులందరూ నీతిమంతులని జరుగుతున్న ప్రచారాన్ని తెలుగు ప్రజలు ఏవగించుకుంటున్నారు.

వైఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలపై బురదజల్లడం, అవినీతి అక్రమాల పేరుతో దుష్ర్పచారం చేయడం, వైఎస్ జగన్‌ని రాజకీయంగా ఎదగకుండా నిరోధించడం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులను చేయడం, సాక్షి పత్రికను, టీవీ చానల్‌ను కనుమరుగు చేయడమే లక్ష్యంగా వారు ఐక్యంగా పనిచేస్తున్నారు. గత మూడేళ్లలో సాక్షి చేపలాగా ప్రవాహానికి ఎదురీదింది. కొత్తపుంతలు తొక్కి పాఠకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. 

తమ కోసం పాటుపడే నాయకులను, పత్రికలను, వ్యవస్థలను ఎలా గౌరవించాలో, రక్షించుకోవాలో తెలుగు ప్రజలకు ఎవరూ వివరించాల్సిన పనిలేదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడ్డుపడుతున్న దుష్టచతుష్టయాన్ని చరిత్ర పుటల్లో లేకుండా చేసేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సాక్షిని ఆర్థికంగా దెబ్బతీయాలని జరుగుతున్న కుటిల యత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమించి, అవసరమనుకుంటే సాక్షిని ఆర్థికంగా ఆదుకొని సంవత్సర చందాలు కట్టి వందల కోట్లు పెట్టుబడిగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్న తెలుగు వారికి కొదవలేదు. ఈ వాస్తవాన్ని సోనియా-అంబానీ-రామోజీరావు-చంద్రబాబు చతుష్టయం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.
Share this article :

0 comments: