అరెస్ట్ అవసరమే లేదు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అరెస్ట్ అవసరమే లేదు..

అరెస్ట్ అవసరమే లేదు..

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

విచారణకు అందుబాటులో ఉన్నారు.. సహకరిస్తున్నారు
సాక్షులను బెదిరించిన దాఖలాలే లేవు
పది నెలలుగా ప్రశ్నించకుండా ఇప్పుడు అరెస్టు చేశారు
సీబీఐ తీరును అనుమానించాల్సి వస్తోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసులో జగన్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. విచారణకు సహకరిస్తున్నప్పుడు జగన్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం సీబీఐకి ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను అరెస్ట్ చేసిన తీరును, సమయాన్ని చూస్తుంటే.. ఈ అరెస్ట్‌ను రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. సీబీఐ చర్య ప్రజాస్వామ్యయుతంగా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. 

జగన్‌ను ఏ కారణంతో అరెస్ట్ చేశారో సీబీఐ అధికారులు ఇంతవరకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొంటున్నారు. పది నెలలుగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఏనాడూ జగన్‌ను ప్రశ్నించలేదని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రశ్నించదలచుకుంటే... మొదటి నిందితునిగా ఉన్న జగన్‌నే ప్రశ్నించి ఉండేదని, అప్పుడు చేయని పనిని ఇప్పుడు చేయడంలో ఆంతర్యమేమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచి జగన్ ప్రజల్లోనే తిరుగుతున్నారనే విషయాన్ని వారు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. 25న విచారణకు రావాలని పిలిచినప్పుడు దాన్ని గౌరవిస్తూ ఆయన విచారణకు హాజరై, గంటల కొద్దీ సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. సీబీఐకి జగన్ పూర్తిగా సహకరించారని, అందుకే ఈ రెండు రోజులు జగన్‌ను అరెస్ట్ చేయలేకపోయారని పేర్కొంటున్నారు. ‘‘ఈ నెల 28న జగన్‌ను కోర్టు ముందు హాజరు కావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు జగన్ కోర్టు ముందు హాజరైనప్పుడు.. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో మెమో దాఖలు చేయాలని సీబీఐ అధికారులు భావించారు. అయితే తమ చట్టవిరుద్ధ చర్యలకు సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందిస్తుందో లేదో అన్న అనుమానం అధికారులకు వచ్చింది. అందుకే సీబీఐ అధికారులు జగన్‌ను అరెస్ట్ చేశారు’’ అని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని మరికొందరు న్యాయవాదులు కూడా వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసులో జగన్ ఎక్కడికీ పోలేదు. సాక్షులను బెదిరించిందీ లేదు.. సాక్ష్యాలను తారుమారు చేసిందీ లేదు.. మరి ఏ కారణంతో జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది? మరిన్ని వివరాలు రాబట్టాలనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు ప్రశ్నించవచ్చు. ప్రశ్నించేందుకే అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సీబీఐ చర్య ప్రజాస్వామ్యయుతంగా లేదు. కాబట్టే సీబీఐ తీరును అనుమానించాల్సి వస్తోంది’’ అని మరో సీనియర్ న్యాయవాది చెప్పారు.
Share this article :

0 comments: