సీబీఐ చార్జిషీట్ చట్టవిరుద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ చార్జిషీట్ చట్టవిరుద్ధం

సీబీఐ చార్జిషీట్ చట్టవిరుద్ధం

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

బెయిల్ అడిగితే దర్యాప్తు పూర్తి కాలేదని సీబీఐ చెప్పింది.. మరుసటి రోజే దర్యాప్తు 
పూర్తయిందంటూ చార్జిషీట్ దాఖలు చేసింది
సాయిరెడ్డికి బెయిల్ రాకూడదనే ఇలా చేసింది
సీబీఐ అసంపూర్తి చార్జిషీట్ దాఖలు చేసింది.. దానికి చట్ట ప్రకారం ఎటువంటి విలువా లేదు
కాబట్టి విచారణ స్వీకరణ ఉత్తర్వులను కొట్టివేయండి: సుశీల్‌కుమార్
జగన్‌పై పీసీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది..?: జడ్జి

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దర్యాప్తు పూర్తి కాకుండానే ఈ ఏడాది మార్చి 31న సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించడాన్ని సవాలు చేస్తూ ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర ప్రసాదరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ తీర్పును వాయిదా వేశారు. 

31న దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ, తదనుగుణంగా నిందితులకు సమన్లు జారీ చేస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఇదే సమయంలో దర్యాప్తు మొత్తం పూర్తయిన తరువాత మాత్రమే చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించేలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించాలంటూ దాఖలు చేసిన ఈ రెండు వ్యాజ్యాలపై జస్టిస్ చంద్రకుమార్ సుదీర్ఘంగా వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పద్మనాభరెడ్డి, సుశీల్‌కుమార్ వాదించగా... సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ వాదనలు వినిపించారు. రెండు రోజుల క్రితం పద్మనాభరెడ్డి, సుశీల్‌కుమార్ వాదనలు ముగించగా, రావల్ సోమవారం వాదనలు ప్రారంభించి, మంగళవారం కూడా వాటిని కొనసాగించారు. ఈ వాదనలకు తిరిగి సుశీల్‌కుమార్ సమాధానం చెప్పారు. 

బెయిల్ రాకూడదనే చార్జిషీట్: జగన్ ఆస్తుల కేసులో రెండవ నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి సీబీఐ ఎదుట 30 రోజులు హాజరయ్యారని, ఆయనను సీబీఐ దాదాపు 300 గంటలకు పైగా ప్రశ్నించిందని సుశీల్‌కుమార్ వివరించారు. జైలులో ఉన్నప్పుడు సాయిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరితే, దర్యాప్తు పూర్తి కాలేదని కోర్టుకు సీబీఐ చెప్పిందని... అయితే కేవలం రెండు రోజుల తరువాతే ఆశ్చర్యకరంగా దర్యాప్తు పూర్తయిందంటూ చార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపారు. కేవలం సాయిరెడ్డికి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే దర్యాప్తు పూర్తి కాకపోయినా, చార్జిషీట్ దాఖలు చేసిందని, ఇది చట్ట విరుద్ధమని ఆయన వివరించారు. 

నిందితులపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సీబీఐ వద్ద ఇప్పటివరకు నిర్దిష్టమైన ఆధారాలేవీ లేవని తెలిపారు. పాత అంశాలతో సీబీఐ రోజుకో చార్జిషీట్ దాఖలు చేస్తోందని, ఇది చట్ట విరుద్ధమని, మార్చి 31న దాఖలు చేసిన చార్జిషీటే తుది చార్జిషీట్ అవుతుందని వివరించారు. సీబీఐ అధికారులు ఈ కేసులో చట్ట నిబంధనలను, విధి విధానాలను పక్కన పెట్టి, తమకు కావాల్సిన విధంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలను సైతం కాలరాస్తున్నారని, అందుకు వారు దాఖలు చేస్తున్న చార్జిషీట్లే ప్రత్యక్ష ఉదాహరణలని చెప్పారు. మొదటి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించే సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. 

ఆ ఉత్తర్వులను కొట్టివేయాలి: ప్రతీ చార్జిషీట్‌లో జగన్, సాయిరెడ్డిలను మొదటి, రెండవ నిందితులుగా పేర్కొన్నారని, జగన్‌పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-12 కింద కేసు నమోదు చేశారని సుశీల్‌కుమార్ కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఈ సెక్షన్ కింద కేసు పెట్టేది ప్రజా ప్రతినిధులపై కదా, దీనిని అప్పటికి ఎంపీ కాని జగన్‌పై ఎలా పెడతారని ప్రశ్నించారు. తాము చెప్పేదీ అదేనని, సీబీఐ అధికారులు ఇలాంటి తప్పులు చాలానే చేశారని, వీటిని ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నా ప్రయోజనం ఉండటం లేదని సుశీల్‌కుమార్ వివరించారు. ఎప్పుడు తాము పిటిషన్ దాఖలు చేసినా, సీబీఐ మాత్రం దర్యాప్తు కీలక దశలో ఉందని చెప్పిన మాటే చెబుతోందని కోర్టుకు నివేదించారు. ఎఫ్‌ఐఆర్ ఒక్కటేనని, చార్జిషీట్‌లు మాత్రమే అనేకం దాఖలు చేస్తోందని, ఇలా చేయవచ్చునని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. 

చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని, సీబీఐ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలపైనే దర్యాప్తును పూర్తి చేయాలని ఆయన తెలిపారు. సీబీఐ దాఖలు చేస్తున్న చార్జిషీట్‌లను చూస్తుంటే, ఈ కేసులో సంవత్సరాల తరబడి దర్యాప్తు కొనసాగించేలా కనిపిస్తోందన్నారు. రెండవ చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతి కోరే సమయంలో అదనపు డాక్యుమెంట్ల సమర్పణకు అనుమతించాలని మాత్రమే కోర్టును కోరిందే తప్ప, రెండవ చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పరిశీలిస్తే, రాజశేఖరరెడ్డి, జగన్, సాయిరెడ్డిలు కలిసి కుట్రపన్నారని ఉందని, అంటే దీనిని ఒకే కుట్రగా భావించాలి తప్ప, ఒక్కొక్కరికి ఒక్కో కుట్రను ఆపాదించడం సరికాదని, కాని సీబీఐ ఒక్కో వ్యక్తికి ఒక్కో కుట్రను ఆపాదిస్తూ, ఒక్కో కుట్రను ఒక్కో కేసుగా విభజించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన న్యాయమూర్తికి నివేదించారు. అందువల్ల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. 

నేరాలు వేర్వేరు: హరేన్ రావల్

అంతకుముందు హరేన్ రావల్ వాదనలు కొనసాగిస్తూ.. రెండవ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించకూడదనే నిబంధనేదీ లేదని, మేజిస్ట్రేట్ తన విచక్షణాధికారం మేర నిర్ణయం తీసుకోవచ్చునని తెలిపారు. విచారణకు స్వీకరించడం చట్ట విరుద్ధమనుకున్నా, విచారణను నిలుపుదల చేసే పరిధి హైకోర్టుకు లేదని వివరించారు. చార్జిషీట్‌లలో నిందితులు ఒక్కటే కావచ్చునని, అయితే నేరాలు వేర్వేరని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటే, రాతపూర్వకంగా ఇవ్వాలని ఇరుపక్షాల న్యాయవాదులకు సూచించారు.
Share this article :

0 comments: