‘‘పౌర స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుం ది. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే పౌర స్వేచ్ఛను తుడిచిపెట్టడమే’’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘‘పౌర స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుం ది. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే పౌర స్వేచ్ఛను తుడిచిపెట్టడమే’’

‘‘పౌర స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుం ది. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే పౌర స్వేచ్ఛను తుడిచిపెట్టడమే’’

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

‘‘పౌర స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుం ది. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే పౌర స్వేచ్ఛను తుడిచిపెట్టడమే’’
-థామస్ జెఫర్సన్


భారత పౌరులకు రాజ్యాంగం వాగ్దానం చేసిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగమని భారత అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. ‘ఎమర్జెన్సీ’ పేరు చెప్పి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాసే హక్కు ప్రభుత్వ యంత్రాంగానికి లేదని కూడా సుప్రీంకోర్టు విస్పష్టంగానే ప్రకటించింది. పత్రికా స్వేచ్ఛకు చిన్నపాటి విఘాతం కలిగించే ఎలాంటి ప్రభుత్వ చర్యలనూ న్యాయస్థానాలు సమర్థించిన దాఖలా దేశంలో ఒక్కటి కూడా లేదు. 

‘పత్రికా స్వేచ్ఛ’ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కు. ఈ ఆర్టికల్ లో పొందుపరచిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. భారత పౌరులకు రాజ్యాంగం వాగ్దానం చేసిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగమని భారత అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. ‘ఎమర్జెన్సీ’ పేరు చెప్పి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాసే హక్కు ప్రభుత్వ యంత్రాంగానికి లేదని కూడా సుప్రీంకోర్టు విస్పష్టంగానే ప్రకటించింది. ప్రభుత్వాలు తమకు అవసరమని భావించినప్పుడల్లా భావవ్యక్తీకరణ స్వేచ్ఛపైన, అందులో అంతర్భాగమైన పత్రికా స్వేచ్ఛపైన ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధం. 

దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందనుకున్న అరుదైన సందర్భాల్లో, ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడటానికి మాత్రమే ఆంక్షలు విధించడానికి రాజ్యాంగం అనుమతించిందన్నది విస్మరించడం తగదు.
రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం పరిపాటిగా మారింది. పత్రికా ప్రచురణకు ఆటంకం కలిగించేలా ఎలాంటి ఆంక్షలు విధించినా, అది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడంగానే భావించాలి. పత్రికా ప్రచురణకు, వార్తా సేకరణకు, పంపకానికి, రోజువారీ పత్రికా కార్యకలాపాలు నిర్వహించడానికి కావాల్సిన సొమ్ము బ్యాంకు కరెంటు ఖాతాలో ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు నిర్వహించకుండా ఖాతాలను స్తంభింపజేయడమంటే పత్రికా ప్రచురణకు, పంపకానికి, వార్తాసేకరణకు మూలమైన ఆక్సిజన్‌ను అడ్డుకోవడమే. ఒక పత్రికకు సంబంధించిన ఈ బ్యాంకు ఖాతాలను నిలిపివేసినప్పుడు, ఆ పత్రిక మనుగడకి ముప్పు వాటిల్లితే అది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడమే.

‘సాక్షి’ దినపత్రిక ప్రారంభించడానికి సమకూర్చిన మూలధనం చట్టవిరుద్ధమైనదన్న ఆరోపణతో దర్యాప్తు చేస్తున్న సీబీఐ దినపత్రిక ప్రచురణకు, ఉద్యోగుల వేతనాలకు, సర్క్యులేషన్ ఖర్చులకు, అడ్వర్‌టైజ్‌మెంట్ సొమ్ములకు సంబంధించిన రోజువారీ లావాదేవీలతో కూడిన బ్యాంకు కరెంట్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ సీఆర్‌పీసీలోని సెక్షన్ 102 కింద రెండు రోజుల క్రితం చర్య తీసుకుంది. సీఆర్‌పీసీలోని ఈ నిబంధన ప్రకారం నేరం చేయడానికి మూలమైన ఆస్తిని మాత్రమే జప్తు చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది. ఉద్యోగులు, ప్రకటనకర్తలు, హాకర్లతో జరిపే లావాదేవీలకు సంబంధించిన కరెంటు ఖాతాలు ఏ విధంగానూ ఆ చట్టం పరిధిలోకి రావు. 14 లక్షలకు పైగా సర్క్యులేషన్ కలిగిన సాక్షి పత్రిక కరెంట్ ఖాతాలను ఫ్రీజ్ చేయడమంటే వేలాది మంది ఉపాధికి విఘాతం కలిగించడమే. ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును నిరాకరించడమే. పత్రికా ప్రచురణ, టీవీ చానల్ దైనందిన కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి లేదు.

దేశ సమగ్రతకు భంగం కలిగినప్పుడు మాత్రమే పత్రికా ప్రచురణకు, టీవీ ప్రసారాల నిలిపివేతకు చర్యలు తీసుకోవచ్చునని చట్టం చెబుతుంది. ‘సాక్షి’ విషయంలో సీబీఐ ఆరోపణ అది కాదు. అయినా అలాంటి చర్యలు చేపట్టడ మంటే ప్రజాస్వామ్యం మనుగడకు ప్రాణమైన పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే. గతంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వ్యవహారంలో ప్రింటింగ్ యంత్రాన్ని అమర్చే నిమిత్తం ప్లాట్‌ఫారమ్ నిర్మించడానికి ఢిల్లీ యంత్రాంగం అనుమతి నిరాకరిస్తే, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) ద్వారా సంక్రమించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగకరమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే న్యూస్ ప్రింట్ కంట్రోల్ నియంత్రణ కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును ప్రకటిస్తూ న్యూస్‌ప్రింట్‌ను పత్రికలకు సరసమైన ధరకు సరఫరా చేయకపోవడం కూడా హక్కులను ఉల్లంఘించడమేనని ప్రకటించింది. 

పత్రికా స్వేచ్ఛకు చిన్నపాటి విఘాతం కలిగించే ఎలాంటి ప్రభుత్వ చర్యలనూ న్యాయస్థానాలు సమర్థించిన దాఖలా దేశంలో ఒక్కటి కూడా లేదు. బిల్డింగ్ పర్మిషన్ విషయంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుపట్టిందంటే, వేలాది మంది జర్నలిస్టుల హక్కులను హరించే విధంగా, పత్రికా ప్రచురణ, సర్క్యులేషన్‌కు విఘాతం కలిగించే సీబీఐ చర్య ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ముందస్తు నోటీసును ఇవ్వకుండా అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ప్రాథమిక హక్కులకు భంగకరమే కాకుండా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కూడా. సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛను రక్షించే విషయంలో వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలిద్దాం.

‘ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో 1985లో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టు, హైకోర్టు జోక్యం చేసుకోవచ్చునని ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద సంక్రమించే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే విభిన్న ఆలోచనలను, విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛే. ఇవి పత్రిక సర్క్యులేషన్‌తో ముడిపడ్డ అంశాలు. రాజకీయ అభిప్రాయాలను కలిగి ఉండటం, నిర్భయంగా ప్రభుత్వ విధానాలను విమర్శించడం వంటివే పత్రికా స్వేచ్ఛ అవసరం అన్న భావనకు ప్రధాన మూలం. స్వేచ్ఛతో కూడిన భావవ్యక్తీకరణ ద్వారా ప్రభుత్వ పథకాల సక్రమ అమలు సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు సరైన మార్గంలో నడవడానికి ఇది మరింతగా దోహదపడుతుంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లోపించిన చోట ఎటువంటి చర్యలైనా నిరర్ధకమేనని సుప్రీం కోర్టు ప్రకటించింది.
న్యూస్‌ప్రింట్ నియంత్రణ ఆర్డర్ పేరుతో పత్రిక ప్రచురించాల్సిన పేజీ లను నియంత్రించడం కూడా పరోక్షంగా పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని సుప్రీం కోర్టు ‘బెన్నెట్ కాలమెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో తీర్పు చెప్పింది. 

ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృతస్థాయి ధర్మాసనం ఈ కేసులో తీర్పు చెబుతూ ‘‘ఎమర్జెన్సీ అమలులో ఉన్నాసరే పత్రికా స్వేచ్ఛకు భంగకరంగా పరిణమించే ఎటువంటి చర్య అయినా రాజ్యాంగవిరుద్ధం’’ అని 1972లో సుప్రీంకోర్టు స్పష్టచేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా సమాజం అభివృద్ధిచెందడం సాధ్యం కాదు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య మనుగడకు ప్రధాన ఇరుసు. ఇది పౌరులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కుతో పాటు, విషయాలను తెలుసుకోవడానికి వీలుకల్పిస్తుంది. పత్రికాపఠనం ద్వారా ప్రజలు రాజకీయ అవగాహనను పొందుతారు. పత్రిక మనుగడకు విఘాతం కలిగించే ఎటువంటి చర్య అయినా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది.


పత్రిక పేజీలను, ధరను నియంత్రించడానికి ఉద్దేశించిన ఉత్తర్వుల విషయంలో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ‘సకాల్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో అలాంటి నియంత్రణ రాజ్యాంగ విరుద్ధమని 1961లో సుప్రీం తీర్పు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనాలు నేటికీ ఆ కేసులో న్యాయమూర్తులు వెలువరించిన అభిప్రాయాలను పత్రికా స్వేచ్ఛ రక్షణకు సంబంధించి ఆదర్శంగా భావిస్తాయి. ఈ కేసులో సుప్రీం తీర్పు చెబుతూ ‘‘పత్రిక తన అభిప్రాయాలను, పాఠకుల మనోగతాన్ని, సమస్యల తీవ్రతను ప్రచురించకుండా నిరోధించడం, రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన భావవ్యక్తీకరణ హక్కుకు భంగకరం. ఇది హక్కులను కాలరాసే చర్యగానే పరిగణించాలి’’ అని స్పష్టం చేసింది.

పత్రిక వెల, న్యూస్‌ప్రింట్ కంట్రోల్, భవన నిర్మాణ అనుమతులను నియంత్రించే ప్రభుత్వ చర్యల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీవ్రంగా స్పందించింది. అటువంటిది ఒక పత్రిక మనుగడకే ముప్పుగా పరిణమించే విధంగా సీబీఐ తీసుకున్న చర్య ఏ విధంగానూ రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదు. అయాచిత లబ్ధి ద్వారా పొందిన పెట్టుబడులతో పత్రికను స్థాపించారన్న ఆరోపణతో దాదాపు పద్నాలుగు లక్షల సర్క్యులేషన్, కోటీ నలభై లక్షల మందికి పైగా పాఠకులు, వేల సంఖ్యలో పత్రికా సిబ్బందిని కలిగి ఉన్న ‘సాక్షి’ పత్రిక దైనందిన కార్యకలాపాలకు అవసరమైన కరెంట్ ఖాతాలను స్తంభింపజేయడం, తద్వారా పత్రికా స్వేచ్ఛకు మూలమైన ఆక్సిజన్‌ను అడ్డుకోవడం రాజ్యాంగపరంగా ఏ విధంగా సమర్థనీయం?

చిన్న పత్రికల మనుగడ నిమిత్తం పత్రికల ధర నియంత్రణకు పూనుకున్నట్లు ప్రభుత్వం వినిపించిన వాదనలను కూడా గతంలో సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇతరులకు అబ్ధి చేకూర్చే పేరుతో లేదా ఇతరత్రా కారణాలతో పత్రికలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాల రాసే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఎలాంటి తటపటాయింపులు లేకుండా స్పష్టం చేసిందన్నది గమనార్హం. నేరం జరిగిందన్న ఆరోపణలు రుజువుకాకుండానే రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించే చర్యలకు సీబీఐ పూనుకోవడం మంచి సాంప్రదాయం కాదు. ‘సాక్షి’ పత్రిక రోజువారీ ఖాతాలను స్తంభింపచేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ చర్య భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, పత్రిక ప్రచురణ, పంపిణీ హక్కుకు, సహజ న్యాయసూత్రాలకు విఘాతం కలిగించేదేననడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన అనేక తీర్పుల వెలుగులో సీబీఐ చర్య అనాలోచితమైనదనే భావించాలి. పౌర, ప్రజాస్వామిక హక్కులకు, ప్రాథమిక హక్కులకు భంగకరమైన ఏ చర్య అయినా ప్రజాగ్రహం ముందు చరిత్రలో నిలిచిన దాఖలా లేదన్నది ఏలికలు గుర్తించడం విజ్ఞత అనిపించుకుంటుంది!  
Share this article :

0 comments: