జగన్ భద్రత గాలికి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ భద్రత గాలికి

జగన్ భద్రత గాలికి

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

పట్టనట్లు వ్యవహరిస్తున్న సీబీఐ
పట్టించుకోని ఐఎస్‌డబ్ల్యూ విభాగం
జైల్లో సెక్యూరిటీపై నిపుణుల సందేహాలు 


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో సీబీఐ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని సీబీఐ పట్టనట్లు వ్యవహరిస్తోందని, బాధ్యత వహించాల్సిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) పట్టించుకోవట్లేదని గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం దిల్‌కుశ గెస్ట్‌హౌస్ నుంచి చంచల్‌గూడ జైలు వరకు జగన్‌ను సీబీఐ తరలించిన తీరు, చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. 


జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పలువురు నిపుణులు జైల్లో జగన్ భద్రతపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న నాయకుడు. ఈ కేటగిరీలో ఆయన భద్రత కోసం 58 మంది సిబ్బందితో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, మూడు ఎస్కార్ట్‌లు, ఇంటి వద్ద పికెట్ ఉంటాయి. సీబీఐ విచారణకు పిలవడంతో శుక్ర, శని, ఆదివారాల్లో వీటితోనే దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌కు హాజరయ్యారు. జగన్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ ఆదివారం సాయంత్రం ప్రకటించడంతో అప్పటినుంచి మరుసటి రోజు ఉదయం వరకు దిల్‌కుశలోనే ఉన్నారు. 

ఆయన్ను సీబీఐ అధికారులు సోమవారం ఉదయం 10.30 గంటలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపరుస్తారన్నది ఆదివారం రాత్రి తెలిసిన విషయమే. ట్రాఫిక్ మళ్లింపులు తదితర అంశాలకు సంబంధించి పోలీసులు మీడియాకు జారీ చేసిన నోటిఫికేషన్స్‌లోనూ ఈ విషయం ఉంది. అంటే జగన్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళతారన్న విషయం ప్రతి ఒక్కరికీ పూర్తిగా తెలుస్తుంది. అయినప్పటికీ సీబీఐ అధికారులు జగన్‌ను సోమవారం ఉదయం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వాహనంలోనే కోర్టుకు తరలించారు. 

ఆయనను కోర్టుకు తరలించే సందర్భంగా భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సీబీఐ గాలికొదిలేసింది. కోర్టు విచారణ పూర్తయిన తరవాత చంచల్‌గూడ జైలుకు కూడా జగన్‌ను సాధారణ వాహనంలోనే తరలించారు. నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ నుంచి చంచల్‌గూడ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం జనసమ్మర్ద ప్రాంతాల మీదుగా ఇలా తీసుకువెళ్లడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందన్నది నిపుణుల మాట. వీఐపీల భద్రతను సమీక్షించాల్సిన, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సైతం జగన్ విషయంలో పట్టనట్లు వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీబీఐ జగన్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి ఏ నిమిషం ఏమి జరుగుతోందనే విషయం వారి నుంచి తెలుసుకుని పరిస్థితులకు తగ్గట్టు సలహాలు, సూచనలు అందించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐఎస్‌డబ్ల్యూపై ఉంది. అయితే జగన్‌ను దిల్‌కుశ నుంచి సీబీఐ కోర్టుకు, అక్కడ నుంచి చంచల్‌గూడ జైలుకు ఎలా తరలిస్తున్నారు? ఏ వాహనం వాడుతున్నారు? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? అనే విషయాలపై ఐఎస్‌డబ్ల్యూ దృష్టి పెట్టలేదని స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేస్తే... నిందితుడికి సంబంధించిన ప్రైవేట్ వాహనాన్ని వినియోగించడానికి అనుమతించరు. పోలీసులకు లేదా ప్రభుత్వానికి చెందిన వాహనంలోనే తరలిస్తుంటారు. 

జగన్ వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వ్యక్తిగతమైంది కాదు. ఆయన భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విభాగమైన ఐఎస్‌డబ్ల్యూ కేటాయించిందే. అయినప్పటికీ ఆయన భద్రత విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదు. మరోవైపు జగన్ హాజరవుతున్న నేపథ్యంలో సోమవారం నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు తీసుకున్న ప్రత్యేక భద్రతా ఏర్పాట్లంటూ ఏమీ లేవు. వారి దృష్టంతా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులపైనే ఉండటంతో... వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

లోపలకు, బయటకు వచ్చే వారిని పూర్తి స్థాయిలో తనిఖీ చేయడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అనుమానితుల్ని గుర్తించడానికి చేసిన ఏర్పాట్లు లేవు. ఈ పరిణామాలను బేరీజు వేస్తున్న సెక్యూరిటీ రంగ నిపుణులు జైల్లో జగన్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఖైదీ హోదాలో, స్పెషల్ బ్యారక్‌లో ఉన్నప్పటికీ... ప్రభుత్వం, సీబీఐ చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Share this article :

0 comments: