విడుదలైన సాయిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విడుదలైన సాయిరెడ్డి

విడుదలైన సాయిరెడ్డి

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కోర్టు పునర్విచారణ
బెయిల్ మంజూరుకు స్పష్టమైన కారణాలు వివరించిన జడ్జి
‘సుప్రీం’ మార్గదర్శకాలకు లోబడే బెయిలిచ్చినట్టు స్పష్టీకరణ
సుప్రీం మార్గదర్శకాల్లో ఒక్కోదానికీ స్పష్టమైన వివరణ
బెయిల్ నిరాకరణ వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షేనని వ్యాఖ్య
సీబీఐ కేవలం వాదనే తప్ప ఆధారాలు చూపలేకపోయిందన్న న్యాయమూర్తి 
విడుదలైన సాయిరెడ్డి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఆడిటర్ విజయసాయిరెడ్డికి సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించడంతో పాటు పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆ మేరకు బాండ్లను సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు. పాస్‌పోర్టును ఇప్పటికే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించారు. దాంతో సాయిరెడ్డిని విడుదల చేయాలని చంచల్‌గూడ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో కోర్టు ఉత్తర్వులు అందుకున్న జైలు అధికారులు ఆయన్ను విడుదల చేశారు.

సాయిరెడ్డి వాదనతో ఏకీభవించిన జడ్జి

సాయిరెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమారుతిశర్మ ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు గతంలో నిలుపుదల చేయడం, బెయిల్ పిటిషన్‌ను పునర్విచారించాలని ఏప్రిల్ 20న ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి నాగమారుతి శర్మ మళ్లీ విచారణ ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాయిరెడ్డి, సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలు విన్నారు.సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు సూచించిన మేరకు, బెయిల్ మంజూరుకు కారణాలను తన ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారు. బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాయిరెడ్డి బెయిల్‌కు అర్హుడేనని తేల్చిచెప్పారు. సుప్రీం నిర్దేశించిన తొమ్మిది మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించి, ఒక్కోదాని గురించీ పూర్తిస్థాయిలో వివరించారు. అవి సాయిరెడ్డికి ఎలా వర్తిస్తాయో కూడా తెలిపారు. ‘‘కోర్టు షరతులను ఉల్లంఘించే అవకాశం లేనప్పుడు బెయిలివ్వవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో కోర్టు విధించిన షరతులను సాయిరెడ్డి ఉల్లంఘించే అవకాశం లేదని భావిస్తూ బెయిలిస్తున్నా’’ అని పేర్కొన్నారు. 

గతంలో బెయిలిచ్చిన సందర్భంగా విధించిన షరతులను కూడా సాయిరెడ్డి ఉల్లంఘించని విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ‘‘బెయిల్ కోరే వ్యక్తి నేరానికి తిరిగి పాల్పడే అవకాశం లేదని భావించినప్పుడు దాన్ని మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా సాయిరెడ్డికి బెయిలిస్తున్నా, బెయిల్ నిరాకరణ వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్ష విధించడమే. సాయిరెడ్డి నేరం చేశారనేందుకు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని సీబీఐ చెబుతున్నా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయనకు బెయిల్ మంజూరు చేసే విచక్షణాధికారం ఈ కోర్టుకుంది’’ అని తేల్చి చెప్పారు. సీబీఐ దర్యాప్తుకు తొలినుంచీ సహకరిస్తున్నానని, దాదాపు 300 గంటల పాటు సీబీఐ అధికారులు తనను పలుమార్లు విచారించారని, తొలిసారి బెయిలిచ్చినప్పుడు విధించిన షరతులను తూచా తప్పుకుండా పాటించానని సాయిరెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఆయన షరతులను ఉల్లంఘించే ఆస్కారం లేదని, అందువల్ల బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని, ఎంతో పేరున్న చార్టెడ్ అకౌంటెంట్‌నని, అందువల్ల తనకు బెయిలిస్తే పారిపోయే అవకాశాలు ఏ మాత్రమూ లేవని సాయిరెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.

మొత్తం వ్యవహారంలో సాయిరెడ్డే ప్రధాన సూత్రధారని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇస్తే గతంలో చేసిన తప్పులను పునరావృతం చేసే అవకాశాలు ఉన్నాయన్న సీబీఐ వాదనను తోసిపుచ్చారు. తప్పుల పునరావృతమనే ప్రశ్నే తలెత్తదని తేల్చి చెప్పారు. బెయిల్‌పై విడుదల చేస్తే తాను సాక్ష్యాలను తారుమారు చేస్తానన్నది సీబీఐ వాదన మాత్రమే తప్ప, అందుకు సంబంధించి కోర్టు ముందు ఎలాంటి ఆధారాలనూ ఉంచలేదన్న సాయిరెడ్డి వాదనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. కేవలం సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న భయాందోళన కారణంగా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించరాదని, అందుకు ఆధారాలు కూడా చూపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. సాయిరెడ్డి జైలు నుంచి బయటికొస్తే దర్యాప్తుకు అడ్డంకులు సృష్టించడమే గాక సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న సీబీఐ అభ్యంతరం కేవలం వాదనే తప్ప అందుకు ఆధారాలేవీ లేవని తేల్చి చెప్పారు. మొత్తం కేసులో సాయిరెడ్డి ఒక్కరినే సీబీఐ అరెస్ట్ చేసిందని, మిగతా వారు బయట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా, పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Share this article :

0 comments: