బయ్యారం గనుల నుంచి జగన్‌కు రూ.14 లక్షల కోట్ల ఆదాయమా? 1956 నుంచీ రాష్ట్రంలో వెలికితీసిన అన్ని రకాల ఖనిజాల విలువే 2 లక్షల కోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బయ్యారం గనుల నుంచి జగన్‌కు రూ.14 లక్షల కోట్ల ఆదాయమా? 1956 నుంచీ రాష్ట్రంలో వెలికితీసిన అన్ని రకాల ఖనిజాల విలువే 2 లక్షల కోట్లు

బయ్యారం గనుల నుంచి జగన్‌కు రూ.14 లక్షల కోట్ల ఆదాయమా? 1956 నుంచీ రాష్ట్రంలో వెలికితీసిన అన్ని రకాల ఖనిజాల విలువే 2 లక్షల కోట్లు

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

బయ్యారం గనుల నుంచి జగన్‌కు రూ.14 లక్షల కోట్ల ఆదాయమా?
1956 నుంచీ రాష్ట్రంలో వెలికితీసిన అన్ని రకాల ఖనిజాల విలువే 2 లక్షల కోట్లు
దేశంలోనే అతి పెద్దదైన ఎన్‌ఎండీసీ వార్షిక ఉత్పాదక టర్నోవరే 10 వేల కోట్లు
ఎన్‌ఎండీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా రూ.66 వేల కోట్లే
టీడీపీ ఉద్దేశంలో బయ్యారం గనులు పాతిక ఎన్‌ఎండీసీలకు సమానమా?
దేశంలోనే రెండో అతి పెద్ద బొగ్గు ఉత్పాదక సంస్థ సింగరేణి 
ఏటా వెలికి తీసే బొగ్గు విలువే రూ.7 వేల కోట్లు!
కాంగ్రెస్, టీడీపీలకు ఉప ఎన్నికల్లో సగం చోట్ల కూడా డిపాజిట్లు దక్కవు
టీడీపీవి ఫక్తు పిచ్చి లెక్కలు గనుకే పేరున్న ఆంగ్ల పత్రికలేవీ ప్రచురించలేదు
బయ్యారం గనుల్ని తీసుకునేందుకు ఎన్‌ఎండీసీయే తిరస్కరించింది
జగన్ ఆస్తులు లక్ష కోట్లంటున్న చిరంజీవి, వాటిని స్వయంగా లెక్కపెట్టారా?
కూతురు ఇంట్లోనే రూ.35 కోట్లు దొరికిన విషయం మరిచి జగన్‌పై విమర్శలా?
సీబీఐ కూడా లక్ష కోట్ల అక్రమార్జన జరిగిందని చెప్పలేదు కదా!
జగన్ స్వయంగా ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువగా కనిపెట్టారా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: బయ్యారం ఇనుప గనుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏకంగా రూ.14 లక్షల కోట్ల రాబడి వస్తుందని టీడీపీ చేసిన ఆరోపణలపై పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీ, కాంగ్రెస్ వారికి పది రూపాయలు వెయ్యి రూపాయలుగా, వెయ్యి రూపాయలు 10 లక్షలుగా, 10 లక్షలు వందలాది కోట్ల డాలర్లుగా కన్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే విచక్షణ పూర్తిగా కోల్పోయి, ప్రజలను మోసగించాలనే దుర్భుద్ధితో ఇలా రూ.16 లక్షల కోట్ల దోపిడీ అంటూ అడ్డగోలుగా అసత్య ప్రచారానికి పూనుకున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో టీడీపీ నేతలు తమను తాము అవమానపరుచుకుంటూ, ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. 

సోమయాజులు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేత దాడి వీరభద్రరావు శుక్రవారం ఊహకందని ఆరోపణలతో నోటికొచ్చినట్టు అసత్యాలు ప్రచారం చేయజూశారని ధ్వజమెత్తారు. అవన్నీ శుద్ధ అబద్ధాలని, పూర్తి అసంబద్ధమైనవని, నిరాధారమైనవని ఆయన సోదాహరణంగా వివరించారు. ‘‘అసలు 1956లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచీ ఇప్పటిదాకా ఇనుము, సున్నపురాయి, గ్రానైట్, పలక, మైకా వంటి అన్ని రకాల ఖనిజాల తవ్వకం నుంచీ వచ్చిన మొత్తం ఉత్పాదనే రూ.2 లక్షల కోట్లుంటుంది. ఖనిజ ఎగుమతుల మార్కెట్ బాగా ఊపుమీదున్న గత ఎనిమిదేళ్లలో చూసుకున్నా ఇది రూ.75-76 వేల కోట్లకు మించి లేదు. అలాంటిది.. నాసిరకం బయ్యారం ఖనిజం నుంచి జగన్‌కు 14 లక్షల కోట్లెలా వస్తాయి? దేశంలో అతి పెద్ద ఖనిజాల వెలికితీత సంస్థ అయిన ఎన్‌ఎండీసీ వార్షిక ఉత్పాదక టర్నోవరే రూ.10 వేల కోట్లు. ఇవి నేను చెబుతున్న వివరాలు కావు, సంస్థ 2011-12 వార్షిక నివేదికలో ఉన్నవే. అలాంటి సంస్థ బయ్యారం గనులను తీసుకున్నా, మీరు చెప్పిన రూ.14 లక్షల కోట్ల ఆదాయం రావడానికి హీనపక్షం 150 ఏళ్లు పడుతుంది. 

అందునా ఇనుము 58 శాతం మాత్రమే ఉన్న ఈ గనుల్లో అంత ఆదాయం ఎప్పటికొస్తుందనేది అనూహ్యం. కనీసం ఈ పాటి ఆలోచన కూడా టీడీపీ వారికుండదా? పైగా ఎన్‌ఎండీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువే రూ.66 వేల కోట్లు. అంటే.. నాసిరకం ఖనిజం లభ్యమయ్యే బయ్యారం గనులు ఏకంగా పాతిక ఎన్‌ఎండీసీ సంస్థలకు సమానమని టీడీపీ ఉద్దేశమా? ఇక దేశంలోనే రెండో అతి పెద్ద బొగ్గు ఉత్పాదక సంస్థ అయిన సింగరేణిలోనే ఏటా వెలికి తీసే బొగ్గు విలువ రూ.7 వేల కోట్లు! అలాంటిది.. బయ్యారంలో 14 లక్షల కోట్ల విలువ చేసే ఖనిజముందా! ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు.. అసలు మన రాష్ట్ర జీడీపీ ఎంతనే విషయమైనా పరిగణనలోకి తీసుకున్నారా? అన్ని రంగాలను కలుపుకున్నా అది రూ.4.5 లక్షల కోట్లు లేదే! అలాంటిది.. ఏమాత్రం ఆధారాలు లేకుండా లక్షల కోట్లంటూ ఇలాంటి గాలి ఆరోపణలెలా చేస్తారు?’’ అంటూ సోమయాజులు తూర్పారబట్టారు. ‘వాస్తవాలు, ఆధారాలతో నిమిత్తం లేకుండా నోటికి ఎంత వస్తే అంత స్థాయిలో ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై ప్రజలను మోసగిస్తున్నందుకు 420 కేసు పెట్టాలి. అంతేకాదు, వారిని పిచ్చాసుపత్రిలో కూడా చేర్పించాలి’ అన్నారు. 

కాంగ్రెస్ వారు తమ ఢిల్లీ పెద్దలను, టీడీపీ వారు చంద్రబాబును మెప్పించడానికి ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ మట్టికొట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇటీవల 207 బొగ్గు బ్లాకుల వేలంలో రూ.10 లక్షల కోట్ల అవకతవకలు జరిగాయని పేర్కొన్న కాగ్.. ప్రధాని కార్యాలయం తీవ్రంగా తప్పుబట్టడంతో ఆ నివేదికను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

బయ్యారం గనుల్ని ఎన్‌ఎండీసీయే తీసుకోలేదు

ఒంగోలు, ఖమ్మం (బయ్యారం), కడప వంటి చోట్ల నుంచి ఇనుప ఖనిజాన్ని వెలికి తీయాలని కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఎండీసీని పదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కోరిందని సోమయాజులు చెప్పారు. ‘‘కానీ వాటిలో నాణ్యమైన ఇనుప ఖనిజం దొరకదంటూ వారు తీసుకోలేదు. ఎగుమతులు చేయాలంటే లభ్యమయ్యే ఖనిజంలో కనీసం 63 శాతం ఇనుముండాలని, కానీ అక్కడ లభ్యమయ్యే ముడి ఖనిజంలో ఇనుము శాతం 58కి మించి లేదని చెబుతూ ఎన్‌ఎండీసీ తిరస్కరించింది’’ అని గుర్తు చేశారు. ‘‘జగన్‌కు 14 లక్షల కోట్ల రాబడి వస్తుందంటున్న టీడీపీ నేతలకు నేనొక ప్రశ్న వేస్తున్నాను. జగన్ రేపు ముఖ్యమంత్రి పదవిలోకి రావడం ఖాయం. వచ్చిన పది రోజుల్లోపే బయ్యారం గనులను మీరు మొత్తుకుంటున్న రూ.14 లక్షల కోట్లలో కేవలం ఒక్క శాతానికి, అంటే కేవలం రూ.14,000 కోట్లకే ఇచ్చేస్తాం. తీసుకుంటారా? మీ పార్టీ నేత చంద్రబాబే ఓ ఉత్తమ వ్యాపారవేత్త కదా! మీ పార్టీయే వ్యాపారుల పార్టీ కదా! తీసుకుంటారా?’’ అని సూటిగా ప్రశ్నించారు.

ఏం చెబితే అది రాసేయడమేనా?

టీడీపీ నేతల గాలి ఆరోపణలను ఏ మాత్రం సరి చూసుకోకుండా కొన్ని పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయంటూ సోమయాజులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఎవరైనా నోటికొచ్చిన ఆరోపణలు చేసినప్పుడు, కనీసం వాటిలోని నిజానిజాలనైనా సరిచూసుకోవాల్సిన బాధ్యత ఆ పత్రికలపై లేదా? రాష్ట్రంలో ఉన్నది 294 మంది ఎమ్మెల్యేలు కాదు.. 29,400 మంది అని టీడీపీ వారు చెబితే అదే నిజమనుకుని ‘ఈనాడు’ వంటి పత్రికలు రాసేస్తాయా? రాష్ట్ర జీడీపీ రూ.50 లక్షల కోట్లని ఎవరైనా చెబితే సరిచూసుకోకుండా ప్రచురించేస్తాయా?’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. రాజకీయాల కోసం పార్టీలు చేసే ఆరోపణల్లోని నిజానిజాలను కనీసం అంచనా కూడా వేయకుండా రాసేయడం ఏం పద్ధతని ప్రశ్నించారు. టీడీపీ నేతలవి ఫక్తు అసంబద్ధమైన ఆరోపణలు గనుకనే జాతీయ స్థాయిలో పేరున్న ఆంగ్ల పత్రికలేవీ వాటిని ప్రచురించలేదని సోమయాజులు గుర్తు చేశారు.

లక్ష కోట్లకు ఆధారాలేమిటి?

జగన్‌కు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై కూడా సోమయాజులు మండిపడ్డారు. అవి పూర్తిగా అసంబద్ధమని, నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఏ ఆధారాలూ లేకుండా ఇలా నోటికొచ్చినట్టు ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. ‘‘సీబీఐ 280 రోజులుగా దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో 2000 మందికి చెందిన ఫోన్లపై సీబీఐ నిఘా పెట్టింది. జగన్ ఇంట్లో పాతికేళ్లుగా పని చేసిన ప్యూన్లు, డ్రైవర్లను కూడా ప్రశ్నించింది. వారి ఖాతాలను కూడా సీబీఐ వదల్లేదు. ప్రపంచ చరిత్రలోనే ఒక దర్యాప్తు సంస్థ ఇంత తీవ్ర స్థాయిలో విచారణ చేసిన సందర్భమే లేదు. వంద ఇళ్లపై, పారిశ్రామికవేత్తల ఇళ్లపై తీవ్ర స్థాయిలో సోదాలు చేసింది. 28 బృందాలతో సీబీఐ కసితో దాడులకు ఉపక్రమించింది. 

మరి సీబీఐ వారెక్కడా లక్ష కోట్లు అక్రమార్జన జరిగినట్లు చెప్పలేదే! జగన్ తనకు తానుగా ఐటీ, లోక్‌సభ సెక్రటేరియట్ ముందు ప్రకటించిన ఆస్తుల కన్నా ఎక్కువగా ఏమైనా కనుగొన్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. అదే చిరంజీవి కుమార్తె ఇంట్లో ఐటీ సోదాల్లో రూ.35 కోట్లు పట్టుబడిందని గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, సీబీఐ ఒక పథకం ప్రకారమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వైనాన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారన్నారు. ‘‘టీడీపీ నేతలకు వారు చేస్తున్నది తప్పుడు ఆరోపణలన్నది తెలియక కాదు. ప్రజలెలాగూ తమను జీవిత కాలంలో నమ్మరనే విషయం వారికి బాగా తెలుసు. అందుకే కనీసం బాబైనా తమను నమ్మేలా చేసుకోవాలనే ఉద్దేశంతో వారు ఇలాంటి అబద్ధపు ఆరోపణలకు దిగుతున్నారు’’ అని దుయ్యబట్టారు.

ఎమ్మార్‌పై ఏది నిజం?

ఎమ్మార్ కేసులో జగన్‌కు రూ.800 కోట్లు ఇచ్చారని చెప్పడం అపహాస్యంతో కూడుకున్న ఆరోపణ అని సోమయాజులు అన్నారు. ‘‘ఈ వ్యవహారంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ తొలుత మాజీ మంత్రి శంకర్రావు, వి.హన్మంతరావు హైకోర్టుకు లేఖ రాశారు. కోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన రాష్ట్ర విజిలెన్స్ విభాగం, రూ.3,900 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. అప్పట్లో ఆ నివేదిక ఇచ్చింది ఇప్పటి డీజీపీ దినేశ్‌రెడ్డే. ఇక.. ఎమ్మార్‌పై 280 రోజుల పాటు దర్యాప్తు జరిపి, ఎంతో మందిని జైళ్లలో పెట్టిన సీబీఐ.. ఈ వ్యవహారంలో రూ.139 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తన చార్జిషీటులోనే పేర్కొంది! మరి ఎక్కడ పది వేల కోట్లు? ఎక్కడ 3,900 కోట్లు? ఎక్కడ రూ.139 కోట్లు? సాధారణంగా దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమైన మొత్తాన్ని రెండు మూడు రెట్లు ఎక్కువ చేసి చూపుతాయి. ఆ లెక్కన సీబీఐ రూ.139 కోట్లు అన్నదంటే, ప్రభుత్వానికి వాటిల్లిన నష్టం దాదాపుగా రూ.43 కోట్లని స్పష్టం అవుతోంది. ప్రభుత్వానికి రూ.43 కోట్ల నష్టం వచ్చే వ్యవహారంలో జగన్‌కు ఎవరైనా రూ.800 కోట్లిస్తారా? ఆరోపణలు చేసే ముందు కొద్దిగానైనా ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ 800 కోట్ల ఆరోపణలేమిటి? శంకర్రావు తన లేఖలో రాసిన రూ.10 వేల కోట్లు ఏమయ్యాయి? విజిలెన్స్ నిర్ధారించిన రూ.3,900 కోట్లు ఏమయ్యాయి?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఎవరో చెబితే చేసేస్తారా?

వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినందుకే తాము సంతకాలు చేశామన్న ఒక మంత్రి వ్యాఖ్యలను సోమయాజులు ప్రస్తావిం చారు. ‘‘ఇదెంత అసంబద్ధం? వైఎస్ జీవించి ఉండి, తనకు సోనియా చెబితేనే చేశానంటే ఊరుకుంటారా? పోనీ, సోమయాజులనే వ్యక్తికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని ముఖ్యమంత్రి చెబితే చేశానని ఎమ్మార్వో అంటే సరిపోతుందా? ఆ తప్పు ముఖ్యమంత్రిదేనని చెబితే చాలా? అంతెందుకు, సుప్రీంకోర్టు జడ్జి చెబితేనే తాను ఫలానా జడ్జిమెంటు ఇచ్చానని ఒక మున్సిఫ్ మేజిస్ట్రేట్ చెబితే ఒప్పుకుం టారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే కాంగ్రెస్, టీడీపీ రెండూ సగానికి పైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వారెన్ని చెప్పినా ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు.

లక్ష కోట్లను చిరంజీవి లెక్కించాడా?

చిరంజీవి లాంటి వారు వారిపై వచ్చిన ఆరోపణలను మర్చిపోయి, జగన్ లక్ష కోట్లు అక్రమార్జన చేశారని ఆరోపించడం విడ్డూరంగా ఉందని సోమయాజులు అన్నారు. ‘‘ఏదో తానే లెక్కించినట్టుగా, లక్ష కోట్లని చెప్పడం ఎంతవరకు సబబు? పార్టీ పెట్టి ఎన్నికలప్పుడు టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు ఎవరి మీదా రాలేదు. 

కానీ చిరంజీవిపై అలాంటి దుమారం రేగింది. సామాజిక న్యాయమంటూ పార్టీ పెట్టిన చిరంజీవికి 75 లక్షల మంది ప్రజలు ఓట్లేశారు. కానీ వారందరినీ గాలికొదిలి, చివరికి తాను ఏ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారో అందులోనే కలిసిపోయారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా నిలబడిన శోభా నాగిరెడ్డిని అనర్హురాలిగా ప్రకటించాలనేంత వరకూ చిరంజీవి వెళ్లారు. ఇప్పుడు కూడా తన సభలకు అసలు జనమే లేకున్నా, జగన్‌ను విమర్శిస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. 

ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 శాతం, పీఆర్పీకి 22 శాతం, టీడీపీకి 30 శాతం ఓట్లు లభించాయని సోమయాజులు గుర్తు చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదన్నారు. ‘‘పీఆర్పీ విలీనమైనందున కాంగ్రెస్ అభ్యర్థులకు 62 శాతం ఓట్లు రావాలి. కానీ ఇప్పుడు రెండు పార్టీలకు కలిపినా 22 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీగా పరిస్థితిని సానుకూలంగా మల్చుకోవాల్సిన టీడీపీ బాగా వెనకబడిపోయింది. కాంగ్రెసేమో తీవ్ర ప్రభుత్వ వ్యతితరేకతను ఎదుర్కొంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రజల్లో ఎంతో కొంత వ్యక్తిగత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కానీ, ఎలాంటి వ్యతిరేకతకూ ఆస్కారం లేని విపక్ష టీడీపీ అతి దారుణంగా వెనకబడిపోవడానికి వారు చేస్తున్న ఇలాంటి మతిలేని, నిరాధారమైన ఆరోపణలే కారణం’’ అని విమర్శించారు.
Share this article :

0 comments: