ఓట్ల కోసం 400 కోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓట్ల కోసం 400 కోట్లు

ఓట్ల కోసం 400 కోట్లు

Written By news on Thursday, June 14, 2012 | 6/14/2012

* బంగారం, వెండి ఆభరణాలతోనూ ప్రలోభాలు
* తిరుపతిలోనే రూ.40 కోట్లు ఖర్చు చేసిన అధికార పార్టీ
* ఆ తరువాత అత్యధికంగా ఖర్చు చేసింది నరసన్నపేటలో
* నరసాపురం, రామచంద్రపురంలో రూ.60 కోట్లు 
* ప్రత్తిపాడు, మాచర్ల, అనంతపురం, ఎమ్మిగనూరులో రూ.100 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ
* ఓటు వేయకుండా ఉండటానికే రెండు వేలిచ్చిన కాంగ్రెస్
* షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.43 కోట్లు
* అందులో అధికార పార్టీ సొమ్ము రూ.30 కోట్లు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కోట్లు కట్టలు తెంచుకున్నాయి..! ఓట్ల కోసం నోట్ల వరద పారింది!! 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు దక్కించుకొని అయినా పరువు నిలుపుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు సుమారు రూ.400 కోట్లు ఖర్చుపెట్టాయి. ఈ విషయాన్ని ఆయా పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఎంత ఖర్చు చేసిందీ చెబుతున్నాయి. ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే రూ.40 కోట్లు ఖర్చు చేశారు. అంతేకాదు ఓటుకు రూ.2 వేలు ఇచ్చిన రికార్డు కూడా ఈ ఎన్నికల్లోనే నమోదైంది. అంతేనా.. బంగారం చెవిదిద్దులు, వెండి (కాళ్ల) పట్టీలు పంపిణీ చేసి ఈ ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోయాయి. అన్నిటికీ మించి ఓటే వేయవద్దంటూ వెయ్యి రూపాయల నోటు ఇచ్చి ఓటర్ల నుంచి ఓటర్ స్లిప్‌లు తీసుకున్న అరుదైన ఘటనకు కూడా ఈ ఉప ఎన్నికలు మౌనసాక్షిగా నిలిచిపోయాయి. తిరుపతి, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి.

పోటాపోటీగా ఖర్చు చేసిన పాలక, ప్రతిపక్ష పార్టీలు..
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ముందస్తు సర్వేలు వెల్లడించడంతో ప్రతిష్ట కోసం కాంగ్రెస్, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బును వెదజల్లాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పట్నుంచీ పోలింగ్ వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తం రూ.43 కోట్లు. ఇది కాకుండా రూ.13 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.25 కోట్ల విలువైన మద్యంను పట్టుకున్నారు. దొరికిన సొమ్ములో రూ.30 కోట్లు అధికార కాంగ్రెస్ పార్టీదికాగా.. మిగిలింది తెలుగుదేశం పార్టీ నేతల నుంచి స్వాధీనం చేసుకున్నదేనని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

ఈ డబ్బుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. వాస్తవానికి ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకున్న మొత్తానికి కనీసం పదింతలైనా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఖర్చు చేసి ఉంటాయని ఓ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ‘‘మూడు దశాబ్దాలుగా నేను పోలీసు శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించా. ఈ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం ఆందోళన కలిగించింది. చంద్రబాబు హయాం నుంచే ఖర్చు విపరీతంగా పెరిగినా ఇప్పుడు అది పరాకాష్టకు చేరింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తిరుపతిలో పరపతి కోసం అడ్డదారులు..
తిరుపతి ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఖాళీ చేసిన ఈ నియోజకవర్గం కావడంతోపాటు ఈ స్థానం ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఉండటమే ఇందుకు కారణం. ‘‘మొదట్లో రూ.15 కోట్లు ఖర్చు చేయాలని అనుకున్నాం. కానీ నామినేషన్లు ముగిసిన నాలుగు రోజులకే అది పూర్తిగా ఖర్చయింది. మళ్లీ రూ.10 కోట్లు తెచ్చినా లాభం లేకపోయింది. మొత్తం రూ.40 కోట్లు ఖర్చయింది. పోలింగ్ రోజున కూడా రూ.2 కోట్లు ఖర్చు పెట్టాం’’ అని కాంగ్రెస్ నాయకుడొకరు గొప్పగా చెప్పుకున్నారు. 

తిరుపతిలో ఎన్నికల కోసం రూ.10 కోట్లు సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరిని పురమాయించారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచే ఒక మంత్రి నాయకత్వంలో డబ్బు పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఓటుకు రూ.2 వేల చొప్పున పంచారు. చివరకు పోలింగ్ కేంద్రాలకు సమీపంలోనూ కౌంటర్లు ఓపెన్ చేసి మరీ నిధుల పంపిణీ మొదలుపెట్టారు. ఇక నరసాపురం, రామచంద్రపురంలో కాంగ్రెస్ రూ.60 కోట్ల దాకా ఖర్చు చేసింది. ప్రత్తిపాడు, మాచర్ల ,అనంతపురం, ఎమ్మిగనూరులో టీడీపీ రూ.100 కోట్లు వెదజల్లింది.

చివరికి ఓటేయొద్దంటూ..
తిరుపతిలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ కొత్త విధానానికి తెరదీసింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రమే ఓటేస్తారని భావించిన అనేక మందిని పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఉండేందుకు ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ఇదే ఫార్ములాను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోనూ అమలు చేసే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్లేస్తారని అనుమానంగా ఉన్నవారి నుంచి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటరు స్లిప్‌లను తీసుకున్నారు. రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి రావడంతో ఎన్నికల కమిషన్ తీవ్రంగానే స్పందించింది. స్లిప్ లేని వారు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్లిప్‌లు పొందాలని సూచించింది.

నరసన్నపేట, నరసాపురంలో డబ్బేడబ్బు
నరసన్నపేట నియోజకవర్గాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలోనే మకాం వేసి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. పోలింగ్‌కు ముందురోజు రాత్రి ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ధర్మాన కృష్ణదాసు మెజారిటీని బాగా తగ్గించగలిగామని కూడా వారు సంతోషంగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో భారీగానే డబ్బు ఖర్చు చేసినట్లు అంచనా. 

ఇక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామచంద్రపురం, నరసాపురం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున ఖర్చు చేశారు. నరసాపురం నియోజకవర్గంలో ఓటుకు రూ.2 వేల చొప్పున ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. పోలింగ్ సమయంలోనూ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ‘‘మంగళవారం నాటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా ఉన్నాయి. ఇంత బహిరంగంగా డబ్బు పంపిణీ చేయడం నా 28 సంవత్సరాల సర్వీసులో చూడలేదు’’ అని డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్తిపాడు, మాచర్ల, పాయకరావుపేటలో బరితెగించిన దేశం 
అవినీతి అంటూ రోజూ అరిచి గగ్గోలు పెట్టే చంద్రబాబు.. ఒకట్రెండు సీట్లు అయి నా గెలిచేందుకు కోట్లు వెదజల్లారు. నమ్మకస్తులైన కొందరిని ఎంపిక చేసి ఆయా నియోజకవర్గాల్లోనే తిష్ట వేయించి డబ్బు పంపిణీ చేయించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓటుకు రూ.వెయ్యి చొప్పున ఆ పార్టీ ఖర్చు చేసింది. ‘‘ఇది మాకు జీవన్మరణ సమస్య. ప్రత్తిపాడులో గెలవకపోతే మాకు భవిష్యత్ లేదు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందే రూ.10 కోట్లు ఖర్చు చేశాం’’ అని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. అయినా గెలిచే అవకాశాలు లేవని తెలిసి పోలింగ్ రోజున రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. పాయకరావుపేట, ఎమ్మిగనూరు, మాచర్ల, అనంతపురంలోనూ తెలుగుదేశం విపరీతంగా ఖర్చు చేసింది. ఓటుకు కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1,500 ఖర్చు చేసినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది.

చెవి దిద్దులు, వెండి పట్టాలు...
కేవలం డబ్బుపైనే కాకుండా బంగారు, వెండి ఆభరణాలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వెనుకాడలేదు. నరసాపురంలో కాంగ్రెస్, ప్రత్తిపాడు, మాచర్లలో తెలుగుదేశం పార్టీ చెవి దుద్దులు, వెండి పట్టాలు పంపిణీ చేశాయి. ఐతే ఇంత చేసినా గెలిచే అవకాశం లేదంటూ ఓ అభ్యర్థి నిర్వేదం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక ముందు ఎన్నికల్లో ఖర్చు తగ్గించడం ఎలా అన్న అంశంపై దృష్టి సారిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని సదరు అభ్యర్థే వ్యాఖ్యానించారంటే ఎన్నికల్లో ఎంతగా ఖర్చు చేశారో అర్థం చేసుకోవచ్చు!
Share this article :

0 comments: