ధర్మానకు ఈసీ హెచ్చరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధర్మానకు ఈసీ హెచ్చరిక

ధర్మానకు ఈసీ హెచ్చరిక

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012


ఉప ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావును కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా హెచ్చరించింది. మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సచివాలయంలో విలేకరులకు తెలిపారు. గత నెల 7వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రాక్షారామంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... సోనియా గాంధీ కన్నా అతి పెద్ద క్రిస్టియన్ ఎవరున్నారని వ్యాఖ్యానించారు. 

మంత్రి వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్ నుంచి సీడీతో సహా నివేదికను తెప్పించుకుని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కమిషన్ వారం రోజుల క్రితమే మంత్రి ధర్మానకు నోటీసులు జారీ చేసింది. మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒకపక్క మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టమైన నిబంధనలుండగా స్వయంగా మంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. తప్పును అంగీకరించకుండా సమర్థించుకునేలాగా మంత్రి సంజాయిషీ ఇవ్వడం పట్ల కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. 

బంగారం, వెండి, నగదు కలిపి రూ.47.18 కోట్లు స్వాధీనం

ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఇప్పటివరకు బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, నగదుతో కలిసి మొత్తం రూ.47.18 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. ఈ జిల్లాల్లో రూ.36.41 కోట్లు స్వాధీనం చేసుకోగా మరో రూ.10.77 కోట్ల విలువగల బంగారం, వెండి, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే 1.90 లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇందుకు సంబంధించి 10,490 కేసుల నమోదుతో పాటు 4,826 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆభరణాలు తయారుచేసే పెద్ద పెద్ద సంస్థలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదు ఎన్నికల్లో పంపిణీకేనని తేలిన పక్షంలో న్యాయస్థానంలో విచారణ జరుగుతుందన్నారు. ఎన్నికలతో సంబంధం లేని డబ్బు అని తేలితే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు. 

తనిఖీలు గౌరవంగా చేయాలని ఆదేశించాం

వాహనాల తనిఖీలో ఎవ్వరికీ మినహాయింపులు లేవని, ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలను కూడా తనిఖీలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వాహనంలో సూట్‌కేసు తనిఖీ అగౌరవంగా చేశారనే నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా తనిఖీలు చేయాలని, గౌరవపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

12వ తేదీ 5 గంటల వరకు పోలింగ్

నెల్లూరు పార్లమెంట్ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ తెలి పారు. ఉప ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు గుర్తింపు కార్డులు లేదా ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్ తప్పనిసరి అని చెప్పారు. ఫొటో ఓటర్ స్లిప్‌లు ముందుగా అందని వారు ఎవరైనా ఉంటే పోలింగ్ రోజు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి ఆఫీసర్ నుంచి పొందవచ్చునని తెలిపారు.

నగదు, మద్యం పంపిణీపై ఫిర్యాదు చేయండి

ఉప ఎన్నికల స్థానాల్లో ఎవరైనా సరే ఓటర్లకు నగదు, మద్యం పంపిణీలకు పాల్పడితే సామాన్య ప్రజానీకం ఫిర్యాదు చేయాల్సిందిగా భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. పంపిణీకి నగదును ఎక్కడైనా నిల్వ ఉంచినా 08897000401, 402, 403, 404, 405నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు చేయాల్సిందిగాఆయన కోరారు. 
Share this article :

0 comments: