ఓటేయపోతే.. రెండు వేలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటేయపోతే.. రెండు వేలు!

ఓటేయపోతే.. రెండు వేలు!

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

* ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు స్లిప్పులను లాగేసుకుంటున్న నేతలు 
* కోట్లు వెదజల్లుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు.. ఏరులుగా మద్యం ప్రవాహం
* భారీగా డబ్బు, మద్యం, చీరల పంపిణీని నేరుగా పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు... నరసాపురంలో మంత్రి పితాని సత్యనారాయణ మకాం
* నరసన్నపేటలో ధర్మాన కనుసన్నల్లో డబ్బు పంచుతున్న అనుచరులు
* ఒక్కో ఓటుకు రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకూ పంచుతున్న వైనం 
* పలు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమ అరెస్టులు, పోలింగ్ ఏజెంట్లకూ బెదిరింపులు... అడుగడుగునా అధికార పార్టీ అధికార దుర్వినియోగం 
* చెరి సగం నియోజకవర్గాలను పంచుకుని కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ 
* టీడీపీకి ఓటేయాలని కేడర్‌ను పురమాయిస్తున్న మంత్రులు, కాంగ్రెస్ నేతలు
* నేడు నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందుగానే తేలిపోవటంతో అధికార పార్టీకి చెందిన నేతలు బరితెగించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థి పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులను అక్రమంగా అరెస్టులు చేయటం, ఏజెంట్లను బెదిరించటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పారిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినప్పటికీ ఓటర్లు తలొగ్గటం లేదని గమనించి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు కొత్త కుట్రకు తెరతీశారు. 

ఓటర్లు ఓటు వేయకుండా నిరోధించే కుతంత్రాన్ని అమలులోకి తెచ్చారు. తమకెలాగూ ఓట్లు పడవని నిర్ధారించుకున్న అనేక చోట్ల ఓటర్ల నుంచి ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు స్లిప్పులను లాగేసుకుంటున్నారు. ఒక్కో స్లిప్పుకు రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టి మరీ గంపగుత్తగా స్లిప్పులను వెనక్కితీసుకుంటున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో చాలా చోట్ల ఈసీ అందజేసిన ఓటరు స్లిప్పు ఇస్తే ఒక్కొక్కరికీ రెండేసి వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు యథేచ్చగా కొనుగోళ్లు సాగించినట్టు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. 


దఫా ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ స్లిప్ లేదా ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఓటు వేయటానికి అనుమతి ఇస్తామని ప్రకటించటంతో కాంగ్రెస్ పెద్దలు తమకు వ్యతిరేకంగా ఓట్లు పడతాయని అనుకున్న చోట్ల ఇలాంటి బేరసారాలు మొదలుపెట్టి.. వారిని ఓటు వేయకుండా అడ్డుకునే కుట్రకు దిగారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాగేసుకుంటున్నారన్న సమాచారం రావటంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఎలాంటి ఓటర్ స్లిప్పులు లేనప్పటికీ ఓటు వేయటానికి రావాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఒక అధికారిని నియమించి ప్రత్యేకించి అక్కడికక్కడ పోలింగ్ స్లిప్పులను అందజేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. 

ఈసారి ఓటుకు మూడు వేలు... 
ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ స్థానంలో గుట్టుచప్పుడు కాకుండా బేరసారాలు సాగించే విషయంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఓటమి ద్వారా తమకేమీ నష్టం లేదంటున్న పార్టీ మొత్తంగా వంద కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలిసింది. చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మెజారిటీని తగ్గించాలని విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినట్టు సమాచారం అందుతోంది. 

కోవూరు ఉప ఎన్నికలో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ చేసిన పార్టీ.. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఒక్కో ఓటుకు మూడు వేల వరకు పంపిణీ చేయటానికి పెద్దఎత్తున డబ్బు తరలించింది. తిరుపతి పరిధిలో సగం మంది ఓటర్లకు పక్కా ప్రణాళికతో మొదట రూ.వెయ్యి పంచిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల ప్రచారం చివరి రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి, రెండో విడతగా మరో వెయ్యి పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఒంగోలులో మొదట రూ. 300 చొప్పున పంపిణీ చేయగా.. అధికార పార్టీ నేత ఒకరు హఠాత్తుగా సోమవారం ఉదయం నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. 

యథేచ్ఛగా అధికార దుర్వినియోగం... 
ప్రచార గడువు ముగిశాక ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులెవ్వరూ ఉండరాదన్న నిబంధన ఉన్నా కాంగ్రెస్ నేతలు వాటిని పట్టించుకోవటం లేదు. నియోజకవర్గాల్లోనే రహస్యంగా తిష్టవేసి అక్రమాలకు బరితెగిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు.. ప్రచారం గడువు ముగిసినా అక్కడే ఉండటం వివాదాస్పదంగా మారింది. సాంకేతికంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నప్పటికీ తిరుపతికి అత్యంత సమీపంలోని ఒక హోటల్‌లో బస చేసిన మంత్రి, ఎమ్మెల్యే.. కాంగ్రెస్ కార్యకర్తలను గ్రూపుల వారీగా పిలిపించుకుని విచ్చలవిడిగా డబ్బులు అందజేసిన విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది బయటి వ్యక్తులు ఆయా అభ్యర్థుల తరఫున పంపిణీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నట్లు సమాచారం. 

నియోజకవర్గాల వారీగా పార్టీ పెద్దలు రాజకీయాలతో సంబంధంలేని కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలకు పంపిణీ బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆయా పెట్టుబడిదారులు తమ ప్రత్యేక దూతల ద్వారా పంపిణీని ముమ్మరం చేసినట్లు సమాచారం. ఆయా అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు గ్రామాల వారీగా జాబితాలు రూపొందించుకుని మరీ పంపిణీ చేపట్టినట్లు వినిపిస్తోంది. ‘‘మా అధిష్టానం పైసా డబ్బు విదల్చటం లేదు. రాష్ట్ర ముఖ్యనేతకే బాధ్యత అప్పగించేశారు. ఆయన ఇప్పటివరకు సర్దాల్సిన మొత్తమేదో అభ్యర్థులకు ఇచ్చేశారు. ఇంకా కావాలని అభ్యర్థుల నుంచి, ఇన్‌చార్జుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఆయన అప్పులు చేసి మరీ డబ్బు పంపాల్సి వస్తోంది’’ అని రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు తమ కష్టాలను ఏకరువుపెట్టారు. 

మీకు సగం.. మాకు సగం.. మ్యాచ్ ఫిక్సింగ్! 
ఒకపక్క ఓటర్లకు డబ్బుతో గాలం వేస్తూనే తమ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు పార్టీల అగ్రనేతలు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. కాంగ్రెస్, టీడీపీలకు బలమైన ఉమ్మడి ప్రత్యర్థిగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించటానికి పలు చోట్ల మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట టీడీపీ దాదాపుగా బరి నుంచి తప్పుకోగా.. అదే తరహాలో టీడీపీ కొంత పోటీ ఇస్తుందన్న చోట కాంగ్రెస్ నేతలు స్వచ్ఛందంగా చేతులెత్తేశారని తెలుస్తోంది. ఇలా ఒక అవగాహనతో పలు నియోజకవర్గాల్లో పరస్పరం ఓట్ల మార్పిడి కోసం పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. 

* విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఎంత చెమటోడ్చినా కాంగ్రెస్ అభ్యర్థికి మూడో స్థానం తప్పదని తేల్చుకుని అక్కడ టీడీపీ అభ్యర్థికి ఓట్లేయాలని ఒక మంత్రి స్వయంగా నేతలను పురమాయించినట్టు ఆ పార్టీ నేతలే చెప్పారు. 

* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ స్థానిక నేతలు తమ పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్తున్నారు. స్థానిక అభ్యర్థి ఇదే విషయమై పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఇటువంటి చిన్న చిన్న విషయాలు తన వద్దకు తీసుకు రావద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

* పోలవరంలో అభ్యర్థి ఎంపికలో తన పంతాన్ని నెగ్గించుకున్న ఒక ఎంపీ బహిరంగంగానే టీడీపీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నేతలను పురమాయించారని సమాచారం. 

*గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక మంత్రి కొద్ది రోజులుగా చేతులెత్తేసి టీడీపీకి సరెండర్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల నుంచి ఆయన ఎన్నికల గురించి పట్టించుకోవటం లేదని.. ‘ఈ ఎన్నికల్లో మేం మీకు సహకరిస్తాం.. వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు మాకు సహకరించండి’ అని ఆయన తమతో ఒప్పందం చేసుకున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 

* మాచర్ల నియోజకవర్గంలో స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థే తన టీడీపీ ప్రత్యర్థికి ఓటు వేయాల్సిందిగా ప్రచారం చేస్తున్నారని కొందరు నేతలు పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో.. అంతా అవగాహన మేరకే జరుగుతోందన్న నిర్ధారణకు వచ్చారు. 

* ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ, కాంగ్రెస్ నేతలు పోటీపడి ఓటర్లకు నోట్లు వెదజల్లుతూ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటు వేయాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు.

* కడప జిల్లా రైల్వేకోడూరులో టీడీపీ నేతలందరూ కాంగ్రెస్‌కు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. 

* అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కాంగ్రె స్ నేత ఒకరు కేడర్‌ను పురమాయించారు. 

* నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానంలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే టీడీపీకి సహకరిస్తున్నారు. అందుకు ప్రతిగా నెల్లూరు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బరామిరెడ్డికి ఓటు వేయించే విధంగా కొందరు టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. సుబ్బరామిరెడ్డికి అమ్ముడు పోయారంటూ టీడీపీ అభ్యర్థి వంటేరు వేణుగోపాలరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరస్పరం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకున్నారు. 

* కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ టీ డీపీ నేతలు ఇదే తరహాలో వెళుతున్నారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు రూ. 8 కోట్లు ఖర్చు చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. 

ధర్మాన కనుసన్నల్లో...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని జలుమూరు, సారవకోట, నరసన్నపేట, పోలాకి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటుకు వెయ్యి నుంచి 1,500 వరకూ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి ధర్మాన నేతృత్వంలో శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన నేతలు పంపిణీ బాధ్యతలు చేపట్టారు. తమకు ఓటేయకపోయినా ఫర్వాలేదు గాని వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని ధర్మాన నగదు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ రూ.5 కోట్ల నగదు, వెండి ఆభరణాలు, చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. 

కర్ణాటక నుంచి భారీగా మద్యం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో అధికార పార్టీ నాయకులు ఓటుకు రూ.300 నుంచి రూ.500, టీడీపీ నేతలు రూ.500 చొప్పున ఇచ్చారు. కర్ణాటక నుంచి మద్యాన్ని భారీగా తెప్పించారు. అనంతపురంలోని అజయ్‌ఘోష్ కాలనీలో మహిళా ఓటర్లకు టీడీపీ నేతలు చీరలు పంపిణీ చేశారు. పోలీసులు వెళ్లేసరికి చీరలను వదిలేసి పారిపోయారు. పోలీసులు 40 చీరలు స్వాధీనం చేసుకున్నారు.

డబ్బు అందలేదని అభ్యర్థి ఇంటిముందు నిరసన
తిరుపతిలో మంత్రి పార్థసారథి ఒక హోటల్లో తిష్ట వేసి డబ్బు రాజకీయం చేస్తున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. పార్థసారథితోపాటు హోటల్‌లో మకాం వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ నగదు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.1,500 నిర్ణయించడంతో ఆ డబ్బులు అందని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారి వివరాలు తీసుకున్న నాయకులు ఇళ్ల వద్దకే డబ్బులు అందేలా చేస్తామని హామీ ఇవ్వడం గమనార్హం! మరోవైపు ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్ల జాబితా తీసుకున్న కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు.

ఓటు వేయకపోతే డబ్బు...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో అధికార పార్టీ నేతలు డబ్బుల పంపిణీలో కూడా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తమ పార్టీకి ఓటు వేస్తే రూ.1,000, ఎవరికీ వెయ్యకుండా ఇంటి పట్టునే ఉంటే రూ.2,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. రెండు వేలు తీసుకునే వారి ఓటరు గుర్తింపు కార్డులను తమ వద్ద ఉంచుకుంటున్నారు. కాగా మద్యం, నగదు పంపిణీ చేస్తున్న అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు. పంపిణీ విషయంపై పోలీసులకు ఎవరైనా సమచారమిస్తే.. వారు అధికార పార్టీ నేతలకు సమాచారమిచ్చి.. ఆ తర్వాత దాడులకు వెళుతున్నట్లు ఇటీవల జరిగిన సంఘటనలు నిరూపిస్తున్నాయి.

టీడీపీ చీరల పంపిణీ..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ పోలీసులకు పట్టుబ డ్డారు. అధికారులు వారి నుంచి 44 చీరలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మండల కేంద్రమైన రుద్రవరంలో కాంగ్రెస్ నాయకులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తుండగా ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికేతరుల నిబంధన ఉల్లంఘించి కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎమ్మిగనూరు పట్టణం నుంచి బయటకు వచ్చి కోడుమూరులో మకాం వేశారు. అక్కడి సమీపంలో పోలింగ్ జరుగుతున్న గ్రామాల వారిని పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.

జోనల్ అధికారి స్టిక్కర్ వాహనంలో నగదు తరలింపు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో దుత్తలూరు మండలంలోని లక్ష్మీపురానికి సోమవారం రాత్రి ఎన్నికల జోనల్ అధికారి స్టిక్కర్ ఉన్న టాటా ఇండికా వాహనంలో కాంగ్రెస్ కార్యకర్త భాస్కర్‌రెడ్డి నగదు, మద్యం తీసుకువచ్చినట్లు సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. ఇంతలోనే కాంగ్రెస్ కార్యకర్త, డ్రైవర్ కారును తీసుకుని పరారయ్యారు. పక్క గ్రామంలోనే ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి ఈ విషయం తెలుసుకుని పలాయనం చిత్తగించారు. ఆయన సోమవారం ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీ..
వైఎస్సార్‌జిల్లా రైల్వేకోడూరు మండల పరిధిలోని మైసూరావారిపల్లెలో టీడీపీ కార్యకర్తల నుంచి పోలీసులు 329 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీపీ భర్త, కాంగ్రెస్ పార్టీ జనరల్ ఏజెంట్ ఎల్‌వీ మోహన్ రెడ్డిని సోమవారం రాత్రి చిట్వేలి పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన వాహనంలో ఓటర్లకు పంచేందుకు తెచ్చిన రూ.77,200 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మాచర్లలో టీడీపీ ధన ప్రవాహం..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ సగటున ఓటుకు రూ.300 పంపిణీ చేసింది. గుంటూరు రూరల్‌లో మాత్రం ఓటుకు రూ.500 ఇచ్చారు. ఇదే మండలంలోని ఎస్సీ కాలనీల ఓటర్లకు రూ.1,000 చొప్పున పంపిణీ చేశారు. లాలుపురం, ఓబులనాయుడుపాలెం, లింగాయపాలెం, వెంగళాయపాలెంలోని ప్రాంతాల్లో డబ్బు పంపిణీకి సంబంధించి ఘర్షణలు తలెత్తాయి. సమాచారమందినా పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. మాచర్లలోనూ టీడీపీ డబ్బు పంపీణీని విస్తృతంగా చేసింది. ఓటుకు రూ.500 చొప్పున అన్నిమండలాల్లో పంపిణీ చేశారు. వెల్దుర్తి మండలం మండాదిలో టీడీపీ నేతల నుంచి 35 కేసుల మద్యాన్ని, అదే మండలం కలవకుంటలో కాంగ్రెస్ నాయకుల నుంచి 40 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ముక్కు పుడకలు.. కాళ్ల పట్టీలు..
ప్రకాశం జిల్లాలో ఓటుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేశారు. డబ్బే కాకుండా ముక్కు పుడకలు, కాళ్ల పట్టీలు కూడా పంపిణీ చేశారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ పార్టీలకు చెందిన రూ.42 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు ఎంపీ కార్యాలయం వద్ద తమకు డబ్బులు ఇవ్వాలంటూ కొందరు ఓటర్లు సోమవారం రాత్రి గుమిగూడారు. అదే విధంగా భాగ్యనగర్‌లో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెస్ట్‌హౌస్ వద్దకు కూడా జనాలు వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఊళ్లకు ఊళ్లను కాంగ్రెస్ వారు డబ్బుతో కొనే ప్రయత్నంచేశారు. లింగసముద్రం మండలం చినపవని గ్రామానికి గుడికట్టిస్తామని, ఇళ్లు కట్టిస్తామని సుమారు కోటి రూపాయలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

మంత్రి పితాని హల్‌చల్
నరసాపురం (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ సోమవారం నరసాపురం నియోజకవర్గంలో హల్‌చల్ చేశారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రచారం ముగిశాక ఇతర ప్రాంత నాయకులు ఉండరాదని నిబంధన. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపేమీ లేదు. కాని.. ‘కోడ్’ను తోసిరాజంటూ సోమవారం కూడా మంత్రి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు. నరసాపురంలో కోటిపల్లివారి వీధిలో ఉన్న ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రాంగం నెరిపారు. 

సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ జీప్‌ను సమీపంలోని ప్రకాశం రోడ్డులో నిలిపేసి మంత్రి సొంత వాహనంలో కాకుండా వేరొక వాహనంలో గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులను పిలిపించుకుని దాదాపు రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి రాత్రి సమయాల్లో కుల సంఘాల సమావేశాలు నిర్వహించారు. కులాలవారీగా వారి అవసరాలు తీరుస్తామంటూ ప్రలోభాలకు గురిచేశారు. కొన్ని గ్రామాల్లో గంపగుత్తగా ఓట్లను బేరాలాడి భారీ మొత్తాలు చెల్లించినట్లు సమాచారం.
Share this article :

0 comments: