సీబీఐవి అర్థం లేని ఆరోపణలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సీబీఐవి అర్థం లేని ఆరోపణలు

సీబీఐవి అర్థం లేని ఆరోపణలు

Written By news on Friday, June 1, 2012 | 6/01/2012

 ఇవన్నీ భవిష్యత్తులో జరుగుతాయని సీబీఐ చెబుతోంది
* ఇందుకు ఆధారాలుంటే చూపమనండి
* అన్నీ అనుమానాలు, ఊహాగానాలే
* వీటి ఆధారంగానే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది
* సీబీఐ కోర్టు వీటినే పరిగణనలోకి తీసుకుంది
* మీ విచక్షణాధికారం ఆధారంగా వాటిని తొలగించండి
* హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్
* నేడు కూడా కొనసాగనున్న వాదనలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పార్లమెంట్ సభ్యుని హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ సీబీఐ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ తెలిపారు. అంతేకాక సీబీఐవి కేవలం అనుమానాలు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. ఎంపీ హోదా కారణంగా ఓ వ్యక్తికి రిమాండ్ విధించడం సరికాదని వివరించారు. భవిష్యత్తులో అలా జరగొచ్చు, ఇలా జరగొచ్చు అంటూ సీబీఐ చెబుతోందని, వీటి ఆధారంగానే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందని, అరెస్ట్ మెమోలో సైతం ఇవే కారణాలను పేర్కొందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీని ఆధారంగా జగన్ అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు. 

తనను సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జగన్‌ను తమ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ గురువారం విచారించారు. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. అంతకు ముందు ఈ పిటిషన్లను ఎప్పుడు విచారించాలనే విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. జగన్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వనున్నదని, ఒకవేళ సీబీఐ కోర్టు జగన్‌కు బెయిలిస్తే, హైకోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి, వారికి అనుకూలంగా తీర్పునిస్తే, జగన్‌కిచ్చిన బెయిల్ రద్దవుతుందని, దీని వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందువల్ల తమ పిటిషన్‌ను ముందు విచారించాలని రంజిత్‌కుమార్ పట్టుపట్టారు. 

ఇదే సమయంలో సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ జోక్యం చేసుకుంటూ, జగన్‌ను 14 రోజుల వరకు మాత్రమే కస్టడీలో విచారించగలమని, ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయని, అలస్యం అయ్యే కొద్దీ రోజులు గడిచిపోతున్నాయని, అందువల్ల ముందు తమ పిటిషన్‌ను విచారించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఇరుపక్షాలు ఏ ఏ తేదీల్లో పిటిషన్లు దాఖలు చేశారో పరిశీలించారు. ఇద్దరూ కూడా 29న పిటిషన్లు దాఖలు చేసినట్లు రికార్డుల్లో ఉండటంతో, ఇరుపక్షాల పిటిషన్లను ఒకేసారి విచారిస్తానని స్పష్టం చేసి, ముందు వాదనలు వినిపించే అవకాశం రంజిత్‌కుమార్‌కు కల్పించారు. అయితే సమయాభావం దృష్ట్యా ఇరుపక్షాలు కూడా చెరో అర్ధగంట వాదనలు చెప్పాలని సూచించారు. 

దాంతో రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... సీబీఐ ఎటువంటి స్పష్టమైన ఆధారాలు చూపకుండా, కేవలం ఊహల ఆధారంగా ఆరోపణలు చేస్తోందని, ఆశ్చర్యకరంగా ఈ ఊహలను, ఆరోపణలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుని, జగన్‌ను రిమాండ్‌కు పంపిందని ఆయన కోర్టుకు నివేదించారు. కింది కోర్టు వేటి ఆధారంగా సీబీఐ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడం లేదని, సీబీఐ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సీబీఐ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొందని, విచక్షణాధికారాల ఆధారంగా ఈ ఉత్తర్వులను తొలగించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, అప్పటి నుంచి మొన్నటి వరకు జగన్‌ను విచారణకు పిలవడం గానీ, నోటీసులు జారీ చేయడం గానీ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఎన్నికల సమయంలో తిరగనివ్వకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అన్యాయంగా జగన్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు. మే 25న తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ జగన్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ముందస్తు బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, తాము సమన్లు జారీ చేశాం కాబట్టి, జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయబోదని చెప్పిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ సీబీఐ అధికారులు మే 27న జగన్‌ను అరెస్ట్ చేశారని, వాస్తవానికి సమన్లు జారీ చేసిన తరువాత కూడా జగన్‌ని అరెస్ట్ చేయాలంటే సీబీఐ అధికారులు కోర్టు అనుమతిని తీసుకోవాలని, కాని వారు అలా చేయలేదని, అందువల్ల జగన్ అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలని రంజిత్‌కుమార్ కోర్టును అభ్యర్థించారు. 

సీబీఐ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, రిమాండ్ రిపోర్ట్‌లో మొదటి చార్జిషీట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 25, 26, 27 తేదీల్లో జగన్‌ను సీబీఐ అధికారులు దాదాపు 30 గంటల పాటు విచారించారని, ఈ విచారణలో వారికి అనుకూలంగా సమాధానాలు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమంటూ రంజిత్‌కుమార్ తన వాదనలు ముగించారు. సీబీఐ వాదనలు శుక్రవారం ఉదయం వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: