కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టీ న్యూస్‌ఛానెల్ ఆఫీసు నిర్వహణకు సంబంధించి హైకోర్టు సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కె.చంద్రశేఖరరావుకు, టీ న్యూస్ ఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

పార్టీ కార్యాలయం నిమిత్తం ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని నిర్మించిన భవనంలో, టీఆర్‌ఎస్ వర్గాలు టీవీ కార్యాలయం ఏర్పాటు చేశారని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, టీఆర్‌ఎస్ భవన్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండా చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేసీఆర్ మేనల్లుడు ఉమేష్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. టీ న్యూస్‌ఛానెల్ కోసం వినియోగిస్తున్న కార్యాలయాన్ని సదరు చానెల్‌కు విక్రయించడం గానీ, బదలాయించడం గానీ ఏమైనా చేశారా..? సేల్‌డీడ్ ఏమైనా రిజిస్టర్ చేశారా..? అని ప్రశ్నిస్తూ, దీనికి సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఉమేష్‌రావు ఓ అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలు నడుపుతున్నందున, వెంటనే ఆ పార్టీకి చేసిన భూ కేటాయింపును రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి కోర్టును కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయాన్ని నివాస ఉపయోగానికి గానీ, వాణిజ్య కార్యకలాపాలకు గానీ వినియోగించరాదని, అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భవన్‌లో టీవీ కార్యాలయాన్ని నడుపుతున్నారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం, పిటిషనర్ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Share this article :

0 comments: