భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు * మహోత్సాహంగా ఓటేసిన యువత... ప్రభంజనానికి సూచికేనంటున్న విశ్లేషకులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు * మహోత్సాహంగా ఓటేసిన యువత... ప్రభంజనానికి సూచికేనంటున్న విశ్లేషకులు

భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు * మహోత్సాహంగా ఓటేసిన యువత... ప్రభంజనానికి సూచికేనంటున్న విశ్లేషకులు

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

* 2009తో పోలిస్తే 6 శాతానికి పైగా పెరుగుదల... భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు
* మహోత్సాహంగా ఓటేసిన యువత... ప్రభంజనానికి సూచికేనంటున్న విశ్లేషకులు
* ఏడింటి నుంచే భారీగా బారులు... చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
* నర్సాపురం, రాయదుర్గంలలో అత్యధికంగా 88%.. తిరుపతిలో అత్యల్పంగా 55% పోలింగ్
* ఏకంగా 11 స్థానాల్లో 80 శాతం దాటిన వైనం.. 5 స్థానాల్లో 70 శాతానికి పైగా పోలింగ్
* ప్రలోభాల పర్వాన్ని తారస్థాయికి తీసుకెళ్లిన టీడీపీ, కాంగ్రెస్.. చివరిదాకా డబ్బు, మద్యం పంపిణీ..
* అధికార పక్షం ఆగడాలపై ఖాకీల ప్రేక్షక పాత్ర
* వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ‘సాక్షి’ సిబ్బందిపైనే ప్రతాపం
* శుక్రవారమే ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ
* ఉదయం 8 గంటలకు లెక్కింపు షురూ.. మధ్యాహ్నానికల్లా ఫలితాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓటు చైతన్యం వెల్లువెత్తింది. మహిళలు, యువత మహోత్సాహంతో పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చారు. దాంతో నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన కీలక ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరిగింది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఓట్లేయడం ఈ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టుగా కన్పించిన ముఖ్య పరిణామం. ఫలితంగా మొత్తం మీద ఏకంగా 80 శాతం దాకా పోలింగ్ నమోదైంది! ఈ స్థానాల్లో 2009 సాధారణ ఎన్నికల (74 శాతం)తో పోలిస్తే ఈసారి పోలింగ్ 6 శాతానికి పైగా పెరగడం విశేషం. నెల్లూరు లోక్‌సభ స్థానంలో 70 శాతం (2009లో 69) పోలింగ్ జరిగింది. బుధవారం పూర్తి సమాచారం అందాక పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. 

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 88.77 శాతం పోలింగ్ జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ 88 శాతం పోలింగ్ నమోదైంది. పోలవరం (87 శాతం), రామచంద్రపురం (86) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఏకంగా 11 స్థానాల్లో పోలింగ్ 80 శాతం మార్కును దాటేయడం మరో విశేషం. చిత్తూరు జిల్లా తిరుపతిలో అతి తక్కువగా 55 శాతం పోలింగ్ జరిగినా, 2009తో పోలిస్తే (51) ఇది 4 శాతం అధికం కావడం విశేషం. ఇక అనంతపురం 66 శాతం పోలింగ్‌తో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ కూడా 2009 (50)తో పోలిస్తే పోలింగ్ ఏకంగా 16 శాతం పెరిగింది! అన్ని నియోజకవర్గాల్లోనూ ఉదయం ఏడింటి నుంచే ఓటర్లు బారులు తీరడంతో మధ్యాహ్నం ఒకటి గంటకల్లా 50 శాతం దాకా పోలింగ్ న మోదైంది! పలు కేంద్రాల్లో సాయంత్రం ఐదింటి తర్వాత కూడా ఓటర్లు భారీగా క్యూలో ఉండటంతో రాత్రి 7.30 దాటేదాకా పోలింగ్ కొనసాగింది. 

మొత్తంమీద అతి కీలకమైన పోలింగ్ ఘట్టం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భాగ్యరేఖలతో పాటు ముఖ్య పార్టీల భవితను కూడా నిర్ధారిస్తూ ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వాటిని ఆయా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లోని స్టాంగ్ రూముల్లో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. నెల్లూరు లోక్‌సభ తప్ప మిగతా 18 అసెంబ్లీ స్థానాల ఫలితాలూ మధ్యాహ్నానికల్లా తేలిపోతాయి. అంటే రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను శాసించగల ఈ ఉప ఎన్నికల ఫలితాల కోసం మరో రెండు రోజులు ఉత్కంఠతో నిరీక్షించక తప్పదన్నమాట!

ప్రతిష్టాత్మక పోరులో ఎలాగైనా పరువు నిలుపుకునేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష టీడీపీ ‘అన్నిరకాల’ ప్రయత్నాలూ చేశాయి. పోలింగ్ రోజున ప్రలోభాల పర్వాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి. పోలీసుల సాక్షిగా విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచాయి. పలుచోట్ల పోలింగ్ కొనసాగినంతసేపూ విడతలవారీగా పంపకాలను కూడా కొనసాగించాయి! క్యూ లైన్లలో ఓటర్లకు టిఫిన్లు, పలావ్ పొట్లాలు, కూల్‌డ్రింకులు అందించాయి. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు నానారకాలుగా ఆపసోపాలు పడ్డాయి. 

దీనికి తోడు కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ కూడా చాలాచోట్ల కొట్టొచ్చినట్టుగా కన్పించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ఇరు పార్టీల శ్రేణులు పలుచోట్ల బాహాటంగానే పరస్పరం సహకరించుకున్నారు! ఈ వ్యవహారాలను బయట పెట్టిన సాక్షి మీడియా సిబ్బందిపైనా, అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనా జులుం ప్రదర్శించారు. ఒంగోలులో టీడీపీ దొంగ ఓట్లు వేసుకోగా, అందుకు కాంగ్రెస్ సహకరించింది. దీనికి తోడు పలు నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులపై దౌర్జన్యానికి దిగాయి. అడ్డుకోవాల్సిన పోలీసులూ అధికారపక్షానికే వత్తాసు పలికారు. పలుచోట్ల ఖాకీలు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీచార్జికి తెగబడ్డారు. అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించారు! 

పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం ఊరుగొండలో ఓటేసి వెళుతున్న వారిపై లాఠీలు ఝళిపించడంతో ఓ మహిళ తలకు తీవ్రగాయమైంది. మరికొందరు గాయపడ్డారు. కోపోద్రిక్తులైన ఓటర్లు సీఐ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో 10కి పైగా గ్రామాలు పోలింగ్‌ను బహిష్కరించాయి. కొయ్యలగూడెం మండలం సీతంపేటలో ఈవీఎం సాంకేతిక లోపంతో ఓటర్లు ఏ గుర్తుకు వేసినా ఒకే గుర్తుపై ఓట్లు నమోదయ్యాయి. అన్ని పార్టీలు రీపోలింగ్ కోసం ఆందోళన చేశాయి. దాంతో సాంకేతిక లోపాన్ని సరిదిద్ది, రాత్రి 7.30 దాకా పోలింగ్ కొనసాగించారు.

ఉప ఎన్నికలలో పోలింగ్ శాతం భారీగా పెరిగిన వైనమే ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణాలతో పాటు, దాని ప్రభావం ఫలితాలపై ఎలా ఉంటుందన్న విశ్లేషణల్లో మునిగిపోయారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడో, ఏదో ఒక ప్రభంజనం ఉన్నప్పుడో పోలింగ్ ఇలా భారీగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికలతో పోలిస్తే అనంతపురంలో 16 శాతం, ఒంగోలులో ఏకంగా 13 శాతం చొప్పున పోలింగ్ పెరిగింది. పరకాలలో 8 శాతం, పాయకరావుపేటలో 7, మాచర్లలో 6 శాతం పెరుగుదల నమోదైంది. 

కేవలం మూడు స్థానాల్లో మాత్రం 2009తో పోలిస్తే పోలింగ్ తగ్గింది. నరసన ్నపేటలో 6.3 శాతం, ప్రత్తిపాడులో 5.4, పోలవరంలో 0.2 శాతం తగ్గుదల నమోదైంది. రాయలసీమ ప్రాంతంలో దాదాపు అన్ని స్థానాల్లోనూ 2009 కంటే పోలింగ్ పెరిగింది. పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని, ఎక్కడా రీ పోలింగ్ కోసం విజ్ఞాపనలు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రిగ్గింగ్ జరిగినట్టు కూడా ఆరోపణలు రాలేదన్నారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం వంటి సమస్యలు తలెత్తినా అధికారులు పరిష్కరించారు.
Share this article :

0 comments: