సీబీఐ దర్యాప్తు తీరిదీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ దర్యాప్తు తీరిదీ!

సీబీఐ దర్యాప్తు తీరిదీ!

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

ఆదర్శ్ కుంభకోణంలో కోర్టు తిడితే తప్ప కదలని దర్యాప్తు సంస్థ
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏడాదికి కానీ మొదలుకాని దర్యాప్తు
కోర్టు జోక్యంతో అరెస్టులు; గడువులోపు చార్జిషీటూ వేయలేదు
జగన్‌మోహన్‌రెడ్డి కేసులో మాత్రం ఎక్కడాలేని అత్యుత్సాహం
రెండు వారాల్లోనే ప్రాథమిక విచారణ పూర్తి
విచారణకు ఆదేశించిన 4 రోజుల్లో ఎఫ్‌ఐఆర్, 24 గంటల్లో దాడులు
వందల గంటలు ప్రశ్నించాక కూడా విజయసాయిరెడ్డి అరెస్టు
ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలనే ముక్కలు చేసి చార్జిషీట్లుగా సాగతీత

‘‘చట్టం తనపని తాను చేసుకుపోతుంది.’’ కేసు ఏదైనా తరచూ ఈ మాట వింటూనే ఉన్నాం. నిజమే! చట్టం తన పని తాను చేసుకుపోతుంది!! కానీ చేసుకు పోనిస్తేగా? అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నవారు దాన్లో జోక్యం చేసుకోకుండా ఉండాలిగా? మహారాష్ట్రను కుదిపేసిన ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణాన్ని చూసినా... రాష్ట్రంలో అధికార దుర్వినియోగమంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులపై సాగిస్తున్న దర్యాప్తును చూసినా అర్థమయ్యేది ఒక్కటే. 

చట్టం తన పని తాను చేయటం లేదని. అధికారంలో ఉన్న రాజకీయ బాసులు ఎలా చెబితే అలా దర్యాప్తు సంస్థలు ఆడుతున్నాయని. ప్రభుత్వ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రులతో ముడిపడి ఉన్న ఆదర్శ్ కుంభకోణంలో సీబీఐ ఏమాత్రం ముందుకెళ్లకూడదని బాసులు భావించారు. రాష్ట్రంలో మాత్రం తమను రాజకీయంగా ఎదిరించిన జగన్‌మోహన్‌రెడ్డిని కేసుల్లో ఇరికించి అన్నిరకాలుగా వేధించాలని వారు సంకల్పించారు. వారు చెప్పినట్టుగా సీబీఐ ఎలా ఆడుతోందో మీరే చూడండి...
-సాక్షి ప్రత్యేక ప్రతినిధి


ఆదర్శ్ కుంభకోణం వివరాలివీ.. 

ముంబై సాగర తీరాన అత్యంత విలాసవంతమైన కొలాబాలో రక్షణ శాఖ కార్యాలయాలున్నాయి. వెస్ట్రన్ నావల్ కమాండ్ కూడా అక్కడే ఉంది. అలాంటి చోట... కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి కుటుంబాల కోసం 4 ఎకరాల స్థలంలో ఆరంతస్తుల భవనం నిర్మించటానికి ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ’ ఏర్పాటయింది. స్థలం తీసుకుంది. ‘కృతి పార్క్’గా నామకరణం చేస్తూ 2003లో దీనికి శంకుస్థాపన చేశారు. తర్వాత రాజకీయ నాయకుల జోక్యంతో నిబంధనలు గాలికెగిరిపోయాయి. ఆరంతస్తుల భవనమల్లా 31 అంతస్తులకు చేరింది. మొదట్లో 40 మంది సభ్యులున్న ఆదర్శ్ సొసైటీలో 103 మంది సభ్యులు చేరారు. వారిలో రక్షణ శాఖకు చెందినవారు 37 మందే. మిగిలింది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వారి బంధుమిత్రులు, బినామీలే. అధికారులు, నేతల జోక్యంతో నిబంధనలు మారిపోయాయి. అనుమతులూ వచ్చేశాయి. అక్కడ అంత ఎత్తుండే భవనానికి అనుమతి లేకున్నా సరే... ఎన్‌ఓసీలు మంజూరయ్యాయి. నేతలకు, అధికారులకు, వారి బినామీలకు అత్యంత చౌక ధరలకు ఫ్లాట్లు మంజూరయ్యాయి. ఇదీ కుంభకోణం.

సీబీఐ దర్యాప్తు తీరిదీ!

ప్రభుత్వం గనుక ఎలాంటి కుంభకోణాన్నైనా పట్టించుకోకుండా వదిలేయాలనుకుంటే సీబీఐ దర్యాప్తు ఎలా సాగుతుంది? అనే విషయం ఆదర్శ్ కుంభకోణాన్ని చూస్తే తెలుస్తుంది. పలువురు నేతలు బినామీ పేర్లతో ఒకటికి పది ఫ్లాట్లు సొంతం చేసుకున్న ఈ వ్యవహారంలో దర్యాప్తునకు ఆదేశించిన మూడు నెలల వరకూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత... ఏడాది పాటు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదు. కోర్టు మందలించటంతో అరెస్టులు మొదలుపెట్టినా... నిర్ణీత గడువులోపు చార్జిషీటు వేయలేదు. ఫలితం... నిందితులకు బెయిలు లభించింది. సీబీఐ దర్యాప్తు మాత్రం సా....గుతూనే ఉంది.

2010లో పలు పత్రికలు, చానళ్లలో దీనికి సంబంధించి వార్తలు వెలువడ్డాయి. ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు గొడవ చేశాయి. వ్యవహారం పార్లమెంటును సైతం కుదిపేసింది. 

దీన్లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు విలాస్‌రావు దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, అశోక్ చవాన్‌లపై ఆరోపణలొచ్చాయి. ఫలితంగా కేంద్రం మొదట్లో స్పందించలేదు. 

విపక్షాలు తీవ్రంగా ఒత్తిడి చేయటంతో కేంద్రం తలొగ్గింది. 2010 నవంబర్లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, ఆదాయపు పన్ను శాఖల చేత విచారణకు ఆదేశించింది. 

సీబీఐ సహా ఏ దర్యాప్తు సంస్థా ముందుకు కదల్లేదు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 


ముంబై హైకోర్టు జోక్యం చేసుకుంది. సీబీఐ తీరును తప్పుబట్టింది. రెండు వారాల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించాలని 2011 జనవరిలో స్పష్టం చేసింది.

తప్పనిసరై సీబీఐ ముందుకు కదిలింది. 2011 జనవరిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 

ఆ తరవాత కూడా పరిస్థితి అంతే. ముందుకు కదిలితే ఒట్టు. అంతా ప్రభుత్వాధికారులు, నేతలే అయినా ఒక్కరినీ అరెస్టు చేయలేదు. 

మరో ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది జనవరిలో మళ్లీ కోర్టు జోక్యం చేసుకుంది. ఎందుకిలా చేస్తున్నారని సీబీఐని నిలదీసింది. ఏ ఒక్కరినీ అరెస్టు చేయకుండా ఏం దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించింది. 

ఇక తప్పనిసరై... ఈ ఏడాది మార్చి 20న రిటైర్డ్ డిఫెన్స్ ఎస్టేట్ అధికారి ఆర్.సి.ఠాకూర్, రిటైర్డ్ బ్రిగేడియర్ వాంచూ, ప్రభుత్వాధికారి ఆర్.వి.దేశ్‌ముఖ్‌లను అరెస్టు చేసింది. తరవాత మరో ఇద్దరిని అరెస్టు చేసింది. 

అయితే ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క మాజీ ముఖ్యమంత్రినీ సీబీఐ ఇప్పటిదాకా ప్రశ్నించిన పాపానే పోలేదు. 

ఈ కేసులో ఆరోపణలు రుజువైతే పదేళ్లకన్నా తక్కువ శిక్ష పడే అవకాశం ఉంది కనుక తొలి అరెస్టు చేసిన 60 రోజుల్లోగా ఛార్జిషీటు వేయాలి. కానీ సీబీఐ ‘ఫెయిలయింది’.

సీబీఐ నిర్దేశిత గడువులో ఛార్జిషీటు వేయని ఫలితం... అరెస్టు చేసిన నిందితులందరికీ ఆటోమేటిగ్గా బెయిలు మంజూరయింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, ఐటీల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈడీని కూడా దర్యాప్తు మొదలుపెట్టనందుకు ఈ ఏడాది మార్చిలో కోర్టు మందలించింది.

జగన్ కేసులో ఇలా..

‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం కొన్ని సంస్థలకు పోర్టులు, సెజ్‌లు, భూములు కేటాయించింది. లీజులతో పాటు హోటళ్లకు అనుమతులిచ్చారు. సడలింపులూ ఇచ్చారు. ఈ ప్రయోజనాలు పొందినవారు అందుకు ప్రతిఫలంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీనిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ల చేత పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నాం’’... ఇదీ తీర్పు సారాంశం.

వేధింపులే లక్ష్యంగా.. శరవేగంగా...

2010 డిసెంబర్లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది జరిగిన 3 రోజులకే ఆయనకు ఐటీ నోటీసులందాయి. 

జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు లేఖ రాయగా... 2011 జనవరి 24న హైకోర్టు ఆ లేఖను సుమోటోగా విచారణకు తీసుకుంది. శంకర్రావు రాష్ట్ర కేబినెట్లో మంత్రి అయ్యారు.

విచారణకు స్వీకరించిన కోర్టు నోటీసులిచ్చింది. మార్చిలో శంకర్రావుకు టీడీపీ తోడయింది. ఇద్దరివీ ఒకటే ఆరోపణలు కావటంతో రెండిటినీ కలిపేశారు.

నాలుగు నెలల్లో విచారణ పూర్తయింది. ఈ కేసుతో పాటు ఎమ్మార్‌కు సంబంధించి 2011, జూలై 11, 12 తేదీల్లో సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది. రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కోరింది.

సీబీఐ పలువురిని పిలిచి ప్రశ్నించింది. రెండు వారాల్లోపే నివేదిక అందజేసింది. 

దీనిపై మళ్లీ విచారణ మొదలైంది. ఐదారు రోజుల్లో పూర్తయింది. సీబీఐ నివేదికలో ఏముందో చెప్పకుండానే... కోర్టు ఆగస్టు 10న పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

కోర్టు తీర్పు కాపీ 3 రోజుల్లో సీబీఐకి అధికారికంగా అందింది. మధ్యలో సెలవు దినాలొచ్చినా... నాలుగు రోజులు తిరిగేసరికల్లా... అంటే ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 

ఆ తరవాత కొన్ని గంటల వ్యవధిలోనే... అంటే 18వ తేదీన సీబీఐ మూకుమ్మడి దాడులు మొదలుపెట్టింది. ‘సాక్షి’ కార్యాలయాలపైన, ఇన్వెస్టర్ల ఇళ్లు, కార్యాలయాలపైన దాడులు చేసి రికార్డుల్ని, కంప్యూటర్లను, సమాచారాన్ని స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి కేసులో నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డితో పాటు పలువురిని పిలిచి రోజుల తరబడి విచారించింది. 

పబ్లిక్ సర్వెంట్ కాకపోయినా... వారికి వర్తించే చట్టాల మేరకు కేసులు పెట్టి ఈ ఏడాది జనవరిలో ఆడిటర్ విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది. ఆ చట్టాల ప్రకారం 90 రోజుల్లో ఛార్జిషీటు వేయాల్సి ఉండటంతో... హడావుడిగా ఎఫ్‌ఐఆర్‌లోని అంశాల్నే చేర్చి చార్జిషీటుగా వేసేసింది. ఆ తరవాత మరో రెండు చార్జిషీట్లు వేసింది. ఇంకా వేస్తూనే ఉంటామని కూడా చెబుతోంది. 

మళ్లీ గత నెలలో ఇన్వెస్టరు నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసింది. పెపైచ్చు 27న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డినీ అరెస్టు చేసింది. కోర్టు తమ ముందు హాజరుకావాలని జగన్‌కు సమన్లు ఇవ్వటంతో... ఆయన కోర్టు ముందుకు వెళ్లకుండానే... ఎన్నికలకు ముందు ఆయన్ను అరెస్టు చేసింది. 

ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలనే ముక్కలు ముక్కలుగా చేసి వరస చార్జిషీట్లు వేస్తూ... వాటిల్లో అర్థం లేని ఆరోపణలు చేస్తూ... జగన్‌మోహన్‌రెడ్డిని వేధించటమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆయనకు బెయిలు లభించకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా చార్జిషీట్ల ప్రహసనాన్ని సాగిస్తోంది. 

కుట్రలకు పరాకాష్ట ‘నార్కో’

సోమవారంనాడు సీబీఐ చిత్రమైన పిటిషన్ వేసింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి, ఆడిటర్ విజయసాయిరెడ్డికి నార్కో అనాలసిస్ నిర్వహిస్తామని, అందుకు అనుమతించాలని ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ‘‘వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డిలకు నార్కో అనాలసిస్, బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివేషన్ ప్రొఫైల్ టెస్ట్ (బీఈఏపీ-బీప్), పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తాం. వారిద్దరికీ ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలు తెలుసు కనక ఈ పరీక్షలకు అనుమతివ్వండి’’ అని కోర్టును కోరింది. ఈ పరీక్షలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అయినా సీబీఐ ఈ పరీక్షలకు అనుమతి కోరడమేంటని జగన్, సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి పుల్లయ్య... జగన్, సాయిరెడ్డి తరఫు న్యాయవాదుల అభ్యంతరాలను వినేందుకు వీలుగా విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. 

ఇక్కడ అన్నిటికన్నా చిత్రమేంటంటే విజయసాయిరెడ్డిని నార్కో అనాలసిస్ చేయటానికి అనుమతించాలని సీబీఐ ఈ ఏడాది జనవరి 25నే ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సాయిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదిస్తూ... ‘‘ఈ పరీక్షలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. నిందితుల అనుమతి లేకుండా ఈ పరీక్షలు నిర్వహించజాలరు’’ అన్నారు. ఇరువురి వాదనలూ విన్నాక... సీబీఐ అభ్యర్థనను న్యాయమూర్తి నాగమారుతి శర్మ తిరస్కరించారు. తిరస్కరిస్తూ ఏమని తీర్పునిచ్చారంటే... ‘‘ఈ పరీక్షలు రాజ్యాంగ విరుద్ధం. దీనికి అనుమతించటమంటే ప్రాథమిక హక్కులను హరించడమే. వ్యక్తి స్వేచ్ఛను హరించే ఇటువంటి పరీక్షలకు అనుమతి ఇవ్వలేం. సీఆర్‌పీసీ 161(2) కింద తనకు వ్యతిరేకంగా సేకరించే సాక్ష్యాల గురించి చెప్పకుండా మౌనంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ చట్టం కల్పించింది. తాము అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలన్నది చట్టంలో నిషేధం. సత్యశోధన పరీక్షలో ఉపయోగించే మత్తు పదార్థాలతో మనిషి సహజసిద్దమైన సృ్పహను కోల్పోతాడు. తనను అడిగే ప్రశ్నలకు సృ్పహలో ఉండి సమాధానాలు చెప్పలేరు. సత్యశోధన, పాలిగ్రాఫ్, బీప్‌టెస్ట్‌ల ద్వారా తప్పనిసరిగా తమకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కోరడం రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఆర్టికల్ 21, 20(3)కి పూర్తిగా విరుద్ధం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, మానసిక స్థితిలోకి బలవంతంగా ప్రవేశించడమే అవుతుంది’’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పులనూ ఉదహరించారు.

సాయిరెడ్డికి నార్కోపై మళ్లీ అదే కోర్టులో


ఏదైనా ఒక కోర్టు ఒక పిటిషన్‌ను కొట్టివేసిన సందర్భంలో... కావాలనుకుంటే దానిపై పై కోర్టులో అప్పీలు చేయాలి. కానీ సీబీఐ మళ్ళీ విజయసాయిరెడ్డి నార్కో పరీక్షల కోసం ప్రత్యేక కోర్టులోనే పిటిషన్ వేయటం చూసిన న్యాయవర్గాలు... ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇలాంటివి గతంలో ఎన్నడూ చూడలేదని, సీబీఐ ఇలా ఎందుకు చేస్తోందో తెలియటం లేదని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. సీబీఐ తాను గతంలో వేసిన పిటిషన్ గురించి మరిచిపోయి ఉండాలని, లేదంటే మనసులో మరేవైనా దురుద్దేశాలు పెట్టుకుని చేస్తుండవచ్చని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అభిప్రాయపడ్డారు.

దుష్ర్పచారానికేనా..?


సాయిరెడ్డి నార్కో అనాలసిస్‌కు మళ్లీ అదే కోర్టును అడక్కూడదని తెలిసినా... అసలు ఈ పరీక్షలకు సుప్రీం తీర్పులు అనుమతించటం లేదని తెలిసినా... సీబీఐ ఈ పిటిషన్ వేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘బహుశా! దీన్ని రాజకీయం చేయాలని సీబీఐని నిర్దేశిస్తున్న ఢిల్లీ బాసులు, ఎల్లో బాసులు భావిస్తూ ఉండవచ్చు. తప్పు చేయకుంటే జగన్‌మోహన్‌రెడ్డే ఈ పరీక్షలకు అంగీకరించాలని వారు పత్రికల్లోను, చానళ్లలోను స్టేట్‌మెంట్లు ఇవ్వటానికి తప్ప ఈ పిటిషన్ మరో రకంగా ఎందుకూ ఉపయోగపడదు. బహుశా! జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ, మీడియా ప్రత్యర్థులు ఈ రకమైన దుష్ర్పచారానికి తెరతీసే అవకాశం ఉంది’’ అని సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. 2జీ, ఆదర్శ్, కామన్వెల్త్ కుంభకోణాల్లో ఎక్కడా నార్కో పరీక్షల కోసం సీబీఐ అడగకపోవటాన్ని ఆయన ప్రస్తావించారు. 

ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే

విజయసాయిరెడ్డికి ‘నార్కో’ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అయినా మళ్లీ జగన్, సాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ కోరడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుంది. సాయిరెడ్డికి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్లీ సీబీఐ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుంది ? ఒకే కేసులో ఉన్న సాయిరెడ్డికి పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించలేదు. అలాంటప్పుడు అదే కేసులో మొదటి నిందితునిగా ఉన్న జగన్‌కు ‘నార్కో’ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరడం కూడా కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది.
-అశోక్‌రెడ్డి, న్యాయవాది

మళ్లీ ఎలా పిటిషన్ వేస్తారు ?

విజయసాయిరెడ్డికి ‘నార్కో’ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసిన తర్వాత మళ్లీ సీబీఐకి పిటిషన్ దాఖలు చేసే అధికారం ఉండదు. సీబీఐకి కోర్టు ఆదేశాలపై అభ్యంతరం ఉంటే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అలా కాకుండా మళ్లీ పిటిషన్ దాఖలు చేయడం అభ్యంతరకరం. నార్కోఅనాలసిస్ పరీక్షలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. నిందితుడిని మత్తులో పెట్టి చెప్పించే విషయాలేవీ సాక్ష్యంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది.
-శ్రీరంగారావు, న్యాయవాది
Share this article :

0 comments: