జగన్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేని జైలు గోడలు. అన్ని వర్గాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేని జైలు గోడలు. అన్ని వర్గాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు

జగన్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేని జైలు గోడలు. అన్ని వర్గాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ జయకేతనం

నెల్లూరు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం 
కుట్రలు, కుతంత్రాల కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం
జగన్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేని జైలు గోడలు 
అన్ని వర్గాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు 
టీడీపీకి ఆత్మహత్యాసదృశంగా మారిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’
టీడీపీ ‘ఫిక్సింగ్’తో రెండు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ 
7 చోట్ల కాంగ్రెస్.. 5 స్థానాల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతు
పరకాలలో స్వల్ప ఆధిక్యతతో బయటపడ్డ టీఆర్‌ఎస్ 
తుదివరకూ హోరాహోరీగా పోరాడిన కొండా సురేఖ 
నెల్లూరు లోక్‌సభ స్థానంలో మేకపాటి ఘనవిజయం 

ఒకే ఒక్కడిని లక్ష్యంగా చేసుకుని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కుమ్మక్కయి.. అప్పుడే పుట్టిన పార్టీని తుదముట్టించేందుకు మూకుమ్మడిగా దాడిచేస్తూ.. ఎల్లో మీడియాతో కలిసి అనునిత్యం కాలకూట విషం చిమ్ముతూ.. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధంగా వాడుకుంటూ.. జనంలో ఉన్న ఒక పార్టీ అధినేతను పట్టుకెళ్లి జైలు గోడల మధ్య నిర్బంధించిన అసాధారణ పరిస్థితుల్లో జరిగిన ఉప ఎన్నికల్లో.. రాష్ట్ర ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. జననేత జగన్ తమ గుండెల్లో ఉన్నాడని చాటిచెప్పారు. జనమంతా ఆయన వెనుక నడిచారు. కుటిల కుతంత్రాలకు గుణపాఠం చెప్పారు. కుమ్మక్కు రాజకీయాలను ఛీకొట్టారు. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగరు బాటలు పరిచారు. ఒక లోక్‌సభ స్థానంతో పాటు 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆశీర్వదించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించి హెచ్చరికలు జారీచేశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: కుటిల కుతంత్రాలకు ప్రజలు గుణపాఠం చెప్పారు. కుమ్మక్కు రాజకీయాలను ఛీకొట్టారు. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగరు బాటలు పరిచారు. ఒక లోక్‌సభ స్థానంతో పాటు 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆశీర్వదించారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఏకపక్షంగా సాగింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చరిత్రాత్మక విజయం లభించింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ విజయాన్ని జైలు గోడలు అడ్డుకోలేకపోయాయి. నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు 15 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో ఘన విజయం సాధించారు. అయితే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఓట్ల బదిలీ పుణ్యమా అని.. అధికార కాంగ్రెస్ చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా నరసాపురం, రామచంద్రాపురం రెండు స్థానాలను మాత్రం చేజిక్కించుకోకోగలిగింది. అదే మ్యాచ్ ఫిక్సింగ్.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యాసదృశంగా మారి.. ఈ ఎన్నికల్లో పూర్తిగా తెరమరుగైపోయింది. ఇక తెలంగాణ ప్రాంతంలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో తుదికంటా హోరాహోరీగా సాగిన పోరులో చివరకు టీఆర్‌ఎస్‌ను విజయం వరించింది. నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ రికార్డులను తిరగరాస్తూ తిరుగులేని మెజారిటీతో విజయ ఢంకా మోగించింది. 

అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ (54,454), పాయకరావుపేటలో గొల్ల బాబూరావు (71,963), పోలవరంలో తెల్లం బాలరాజు (80,790), ప్రత్తిపాడులో ఎం.సుచరిత (87,742), మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (79,751), ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి (77,222), ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (75,103), రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి (76,951), రైల్వే కోడూరులో కె.శ్రీనివాసులు (66,456), రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (90,976), ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డి (88,697), ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి (64,155), రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి (79,171), అనంతపురంలో బి.గురునాథరెడ్డి (65,719), తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి (59,195) ఓట్లతో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నుంచి రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు (77,292), నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు (58,356) ఓట్లతో, టీఆర్‌ఎస్ నుంచి పరకాలలో ఎం.భిక్షపతి (51,936) ఓట్లతో గెలుపొందారు. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ భారీ మెజారిటీలతో దూసుకుపోయింది. ఇటీవల కోవూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 23,000 ఓట్ల మెజారిటీ లభించగా ఈసారి అదే స్థానంలో లోక్‌సభ అభ్యర్థికి 53,000 ఓట్ల మెజారిటీ లభించటం గమనార్హం. 

కనీస పోటీ ఇవ్వలేని అధికార, ప్రతిపక్షాలు... 

వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచిన 15 స్థానాల్లో కాంగ్రెస్ టీడీపీలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవటం గమనార్హం. ఆ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 2,91,745 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ రాజమోహన్‌రెడ్డికి 5,35,436 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డికి 2,43,691 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక్కడ టీడీపీ డిపాజిట్ కోల్పోయింది. రామచంద్రాపురం, నరసాపురంలలో కాంగ్రెస్ గెలుపును పరిశీలిస్తే.. అక్కడ ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీతో కుమ్మక్కు అయినట్లు స్పష్టమవుతోంది. ఆ రెండు స్థానాల్లోనూ టీడీపీ తన ఓటు బ్యాంకు మొత్తాన్ని మళ్లించటంతో కాంగ్రెస్ విజయం సాధించగలిగిందన్నది ఫలితాల సరళిలో స్పష్టంగా తేలుతోంది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ (రామచంద్రాపురం), ప్రసాదరాజు (నరసాపురం) ఓడిపోవటం వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో నిరాశకు గురిచేసింది. పరకాలలో ఓట్ల లెక్కింపు ప్రతి రౌండూ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి రౌండులో 1,562 ఓట్ల స్పల్ప ఆధిక్యతతో టీఆర్‌ఎస్ గెలిచింది. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభ ంజనంలో కాంగ్రెస్, టీడీపీల ఓటు బ్యాంకులు చెల్లాచెదురయ్యాయి. దశాబ్దాలుగా ఆ రెండు పార్టీలూ కాపాడుకుంటూ వస్తున్న ఓటు బ్యాంకులు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మళ్లాయి. రెండు పార్టీల ఓటు బ్యాంకులకూ భారీగా గండిపడింది. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 18,23,422 (48.88 శాతం) ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 8,44,131 (22.63 శాతం), టీడీపీకి 8,20,256 (21.99 శాతం) ఓట్లు లభించాయి. ఇతరులకు 2,41,945 (6.48 శాతం) ఓట్లు దక్కాయి. 

రాష్ట్రమంతటా ఫ్యాన్ సుడిగాలి... 

ఈ ఉప ఎన్నికల్లో.. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వందల కోట్ల రూపాయలు డబ్బు వెదజల్లినా, మద్యాన్ని ఏరులై పారించినా, పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినా వైఎస్సార్ కాంగ్రెస్సే అత్యధిక స్థానాలు గెల్చుకుంది. ఫ్యాన్ గాలి హోరులో కాంగ్రెస్ హస్తం తునాతునకలైంది. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఫ్యాన్ గాలికి అధికార కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు. పోలవరం, పరకాల, అనంతపురం, మాచర్ల, ప్రత్తిపాడు, ఒంగోలు, రాయచోటి నియోజవకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ఘోరంగా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌కు దక్కిన రెండు స్థానాలూ కోస్తాంధ్రలోనివే. రాయలసీమలో ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ సైకిల్ చక్రాలు తుత్తినియలయ్యాయి. తెలంగాణతో పాటు సీమాంధ్ర లోనూ చేతులెత్తేసింది. నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు నరసాపురం, రామచంద్రపురం, రైల్వేకోడూరు, తిరుపతి, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టీడీపీకి డిపాజిట్లు దక్కలేదు. తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గట్టెక్కింది. 

జగన్ పట్ల వెల్లువెత్తిన జన విశ్వాసం... 

ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన వారి పట్ల ప్రజలు తమ నమ్మకాన్ని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, తీవ్ర నిరసన తెలుపుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేస్తూ నిత్యం జనంతో మమేకమైన వైఎస్ కుమారుడిని.. వైఎస్సార్ మరణం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, ఆవేదనతో ఉన్న ప్రజలను ఓదారుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆదరించారు. అధికార కాంగ్రెస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు కూడా ఆ పార్టీకి శాపంగా పరిణమించాయి. భారీగా పెరిగిన పెట్రోలు ధరలు, వేళాపాళా లేని విద్యుత్ కోతలు, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల లేమి వంటివి ప్రజాగ్రహానికి తోడయ్యాయి. మరోపక్క వైఎస్సార్ అమలు చేసిన పథకాలను ఆ తరువాత కాంగ్రెస్ క్రమేణా నీరుగార్చటమూ ఓటమికి కారణమైంది. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 అంబులెన్స్ సర్వీసులు ఇలా అనేక కార్యక్రమాలు వైఎస్సార్ అనంతరం ప్రజలకు దూరమయ్యాయి. ఈ పరిణామాలూ ప్రజల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచాయి. 

కాంగ్రెస్‌తో కుమ్మక్కై తెరమరుగైన టీడీపీ... 

కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీ నడిపిన తెరచాటు వ్యవహారాలు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఎక్కడా ఆ పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. పైగా పలు నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారుపై అవిశ్వాసం పెట్టటంలోనూ అధికార పార్టీతో టీడీపీ కుమ్మక్కు వ్యవహారాలు నడిపించటం.. ప్రజలపై పెనుభారాలు మోపుతూ సర్కారు పాలన ప్రజాకంటకంగా మారిన తరుణంలోనూ అధికార పార్టీతో అంటకాగుతూ వచ్చిన టీడీపీ ఉనికి రానున్న కాలంలో ప్రశ్నార్థకంగా మారనుందని ప్రజాతీర్పు తేటతెల్లం చేసింది. జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన సీబీఐ కేసుల్లో టీడీపీ తాను భాగస్వామిగా ఉండి చేసిన కుట్రలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పునిచ్చారు. మొత్తం 18 స్థానాల్లో ఏ ఒక్కదానిలోనూ టీడీపీ ప్రజావిశ్వాసాన్ని పొందలేకపోయింది. కులాల మధ్య విభజనతో బయటపడతామని ఆశించిన ప్రత్తిపాడు, కోట్లు వెదచల్లి గెలుస్తామనుకున్న రాయదుర్గం, పాయకరావుపేటలపై పెంచుకున్న ఆశలు నీరుగారాయి. 

కిరణ్, బొత్స, చిరంజీవి, బాబులకు షాక్ 

ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన చిరంజీవి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడులకు వ్యక్తిగతంగా కూడా పెద్ద షాక్ ఇచ్చాయి. చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు సొంత జిల్లా అయిన చిత్తూరులోని తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన మెజారిటీ.. వారికి తలబొప్పికట్టించింది. తిరుపతిలో కాంగ్రెస్ పరాజయం ఆ పార్టీ ప్రచార తురుపుముక్కగా భావిస్తున్న చిరంజీవికి అశనిపాతంగా మారింది. ఆయన స్వయానా ప్రాతినిధ్యం వహించి రాజ్యసభ స్థానం కోసం తిరుపతి స్థానాన్ని ఖాళీ చేశారు. తమ కోసం కాకుండా పదవి కోసం మధ్యలో రాజీనామా చేసిన చిరంజీవి పట్ల తిరుపతి ప్రజలు తొలి నుంచీ తీవ్ర నిరసనతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చి.. చిరంజీవికి గట్టి గుణపాఠమే చెప్పారు. గతంలో చిరంజీవికి వచ్చిన మెజారిటీకన్నా ఇప్పుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డికి అధిక మెజారిటీ రావటం గమనార్హం. తిరుపతిలో కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోతే తన సత్తా ఏపాటిదో అధిష్టానానికి తేటతెల్లమవుతుందని చిరు అన్నిశక్తులూ ఒడ్డారు. చెన్నైలో ఆయన కుమార్తె నివాసంలో ఐటీ అధికారులకు దొరికిన రూ. 32 కోట్ల ధనం ఎన్నికల్లో ఖర్చుచేయటానికేనన్న ప్రచారమూ సాగింది. చివరకు రాజ్యసభ సభ్యుడిగా చిత్తూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు.

వైఎస్సార్ సీపీకి అన్ని వర్గాల మద్దతు... 

ఈ ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతూ లభించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాలు, మైనారిటీలు, మహిళలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టినట్టు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. వారే కాకుండా ఇతర వర్గాల అండ కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కిందని ఫలితాలు రుజువు చేశాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్‌కే దక్కాయి. పాయకరావుపేట, ప్రత్తిపాడు, రైల్వేకోడూరు, పోలవరం స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు. మైనారిటీల సంఖ్య అత్యధికంగా ఉన్న రాయచోటి, అనంతపురంలలోనూ ఆ వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కే అండగా నిలిచాయని స్పష్టమవుతోంది. రాయచోటిలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏకంగా 56,891 ఓట్ల మెజార్టీని సాధించారు. 2009లో ఇదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన శ్రీకాంత్‌రెడ్డికి వచ్చిన మెజారిటీ 14,832 మాత్రమే. జనరల్ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన భారీ మెజారిటీలు ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనటానికి తార్కాణంగా నిలుస్తోంది. ఆయా అభ్యర్థులు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా సాధించిన మెజారిటీలకన్నా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇపుడు ఎన్నో రెట్ల ఆధిక్యతను సాధించటం దీనికి నిదర్శనం. 

కుమ్మక్కు కుట్రలకు చెంపపెట్టు... 

వైఎస్సార్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తొలి నుంచీ కుట్రలు, కుయుక్తులతో నడుస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఈ ఉప ఎన్నికల్లో మరింతగా బరితెగించాయి. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై పలు తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేయించాయి. సీబీఐ ఏకపక్ష విచారణ ల ద్వారా జగన్‌పై వేధింపు చర్యలకూ దిగారు. ఉప ఎన్నికల ప్రచారాలు ఉవ్వెత్తున సాగుతూ ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతుండటంతో ఆయన ప్రచారాన్ని అడ్డుకునే కుట్రలు చేశాయి. ఉప ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పినా.. సీబీఐ ఆయన్ను దర్యాప్తు పేరుతో పిలిచి ఎలాంటి ఆధారాలూ చూపకుండానే అరెస్టు చేయటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారని ప్రస్తుత తీర్పు నిరూపించింది. చివరకు వైఎస్సార్ మరణ ం పైనా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్రాగ్రహాన్ని రేపాయి. వైఎస్సార్ మరణానికి ఆయన కుటుంబ సభ్యులే కుట్రపన్నారంటూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు చేసిన ప్రకటనలు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ఆర్థిక నేరాలు, అవినీతి అక్రమాలంటూ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీలు చేసిన విమర్శలకు ఈ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టమైన సమాధానమిచ్చారు. సీబీఐ కేసులతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు ఎంతగా నమ్మబలకాలని చూసినా.. ప్రజలు వాటిని విశ్వసించలేదు. పైగా జగన్ కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే కేంద్రమంత్రి, ఆతరువాత సీఎం అయ్యుండేవారంటూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కుట్రలను బట్టబయలుచేశాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందునే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నది తేటతెల్లమై ప్రజలు తమ స్పష్టమైన తీర్పును వెలువరించారు.
Share this article :

0 comments: