పరకాల..పోలీసుల ఓవర్ యాక్షన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరకాల..పోలీసుల ఓవర్ యాక్షన్

పరకాల..పోలీసుల ఓవర్ యాక్షన్

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

ఆగ్రహించిన గ్రామస్తులు.. సీఐ వాహనం అద్దాలు ధ్వంసం 
ఓటేసేందుకు పోటెత్తిన మహిళలు.. 7 శాతం పెరిగిన పోలింగ్

వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో రాజకీయ పక్షాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోనప్పటికీ పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆత్మకూరు మండలం ఊరుగొండలో ఓటేసి వెళుతున్న దమ్మన్నపేట ఓటర్లపై పోలీసులు లాఠీలు ఝలిపించడంతో ఎన్‌రెడ్డి ప్రమీల (55) తలకు తీవ్రగాయమైంది. పోశెట్టి నర్సయ్యకు కూడా గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన ఓటర్లు సీఐ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఊరుగొండలో రాస్తారోకో చేశారు. అర్బన్ ఎస్‌పీ శ్యాంసుందర్ వారిని చెదరగొట్టారు. ఆత్మకూరు మండలం పులుకుర్తి, పరకాల మండలం పులిగిల్ల గ్రామాల్లో పోలింగ్‌స్టేషన్ సమీపంలో ప్రచారం చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. 

సంగెం మండలం మొండ్రాయిలో టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో కొద్దిసేపు నిరసన వ్యక్తం చేయగా, డీఎస్‌పీ నచ్చచెప్పటంతో శాంతించారు. నియోజకవర్గంలో పోలింగ్ పరిస్థితిని పరిశీలించేందుకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సహకారంతో 129 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను వినియోగించారు. సిగ్నల్ సమస్య కారణంగా అక్కడక్కడ వెబ్ కెమెరాలు పనిచేయలేదు. గీసుకొండ మండలంలోని ధర్మారం, పోతరాజుపల్లి, మండలితండాల్లో పోలింగ్ ఏజెంట్ల పట్ల ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. గీసుకొండ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్‌లు తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ రోజు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు శతవిధాలా యత్నించాయి. 

గామాల్లో తమకు అనుకూలమైన కార్యకర్తల ఇళ్లల్లో ఉండి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగించాయి. ఒక్కో ఓటుకు రూ. 100 నుంచి రూ. 300 వరకు ముట్టజెప్పారు. ఈ సంఘటనలు మినహా పరకాలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009 కన్నా 7 శాతం పోలింగ్ పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతంపై అన్ని పార్టీలూ ఆశలు పెంచుకున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ఈ ఓటింగ్ శాతం తమకే అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. కొత్తగా వచ్చిన యువ ఓటర్ల వల్ల ఈ శాతం పెరిగిందని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలు సైతం ఓటర్లు తమవైపే మొగ్గు చూపారని చెప్తున్నాయి.
Share this article :

0 comments: