జగన్‌పై మహాకుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై మహాకుట్ర

జగన్‌పై మహాకుట్ర

Written By news on Friday, June 22, 2012 | 6/22/2012

* ఒక వర్గం మీడియాతో లక్ష్మీనారాయణ ఫోన్ సంభాషణలు
* ఫోన్ నంబర్లతో సహా వివరాలను బయట పెట్టిన ఎమ్మెల్యేలు
* వైఎస్ జగన్‌కు భౌతిక హాని చేసే కుట్రలో భాగమే!
* కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుట్రపూరితంగా కుమ్మక్కయ్యాయి
* జేడీ సంభాషణలకు, కుట్రకు సంబంధముందని నమ్ముతున్నాం
* సుప్రీం న్యాయమూర్తితో విచారణకు డిమాండ్ చేస్తున్నాం
* ఆధారాలను అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థల ముందుంచుతాం
* ఇతర పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు కూడా అందజేస్తాం
* ప్రాణహాని ఉంటుందని తెలిసీ నార్కో పరీక్షలకు సీబీఐ పట్టుబడుతున్న తీరు అనుమానాలను పెంచుతోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: దర్యాప్తు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై సాగుతున్న కక్షసాధింపు వెనుక దాగున్న మహా కుట్ర మరోసారి బట్టబయలైంది. విచారణ పేరుతో సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్న తీరుపై చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తాజాగా అందుకు ఆధారాలను కూడా వెల్లడించింది. ఎంపిక చేసుకున్న ఒక వర్గం మీడియాతో ఆయన పుంఖానుపుంఖాలుగా ఫోన్ సంభాషణలు జరిపిన విషయాన్ని బయట పెట్టింది. అంతేగాక వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళకు, జేడీకి మధ్య వరదలా ఫోన్ సంభాషణలు జరిగాయని వెల్లడించింది. ఆమె ఫోన్ నుంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో పాటు ఒక వర్గం మీడియాకు కూడా విపరీతంగా కాల్స్ వెళ్లాయని పేర్కొంది. ఈ మేరకు జేడీ ఫోన్ సంభాషణలు జరిపిన పలువురి పేర్లను, ఫోన్ నంబర్ల వివరాలతో సహా వైఎస్సార్ శాసనసభా పక్షం గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇంతకీ ఈ చంద్రబాల ఎవరని, ఇటు సీబీఐ జేడీతో, అటు జగన్‌పై నిత్యం విషం చిమ్ముతున్న పలు ఎల్లో మీడియా సంస్థల యాజమానితో ఆమె జరిపిన సంభాషణల లోగుట్టేమిటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 సహా పలు పత్రికలు, చానళ్ల విలేకరులతో లక్ష్మీనారాయణ విసృ్తతంగా సంభాషణలు జరిపిన వైనాన్ని పార్టీ ఎమ్మెల్యేలు ఆ ప్రకటనలో ఉదహరించారు. జగన్ పేరు ప్రతిష్టలను దెబ్బ తీసే కుట్రతో పాటు ఆయనకు భౌతికంగా హాని చేసే కుట్రకు కూడా జేడీ ఫోన్ సంభాషణల వ్యవహారంతో లోతైన సంబంధముందని తాము బలంగా నమ్ముతున్నట్టు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. 

‘‘అధికార, విపక్షాల కుట్రలన్నింటినీ ప్రజలు ఎక్కడికక్కడ తుత్తునియలు చేస్తూ జగన్‌కు అండగా నిలవడంతో ఢిల్లీ పెద్దలకు, ఎల్లో మీడియాకు దిక్కు తోచకుండా పోయింది. అందుకే నార్కో పరీక్షల రూపంలోనో, మరో రకంగానో జగన్‌కు భౌతిక హాని తలపెట్టేందుకు తెగబడుతున్నారు. ఇలాంటి కుట్ర జరుగుతోందనేందుకు లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్ ఒక ఆధారమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది’’అని వివరించారు. కాంగ్రెస్, టీడీపీలతో కలిసికట్టుగా సీబీఐ సాగిస్తున్న ఈ కుట్రను తీవ్రంగా నిరసిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘మా వద్ద ఉన్న ఈ ఆధారాలన్నింటినీ దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నింటికీ వైఎస్సార్‌సీపీ తరఫున అందజేస్తాం. ఇతర రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు కూడా అందజేస్తాం’’ అని వెల్లడించారు.

సీబీఐ తీరుమీదే దర్యాప్తు చేయాలి
జగన్ కేసులో విచారణకు సంబంధించిన వివరాలను సీబీఐ మొదటి నుంచీ ఒక పద్ధతి ప్రకారం ఎంపిక చేసుకున్న మీడియాకు మాత్రమే, అది కూడా తాను అనుకున్న కోణంలోనే పక్కాగా ఎప్పటికప్పుడూ లీక్ చేస్తూ వస్తోందని గుర్తు చేశారు. ‘‘జగన్‌ను ఏదో ఘోరమైన నేరం చేసిన వ్యక్తిగా చిత్రించేందుకు ఒక వర్గం మీడియాతో సీబీఐ చేతులు కలిపింది. తిరుగులేని ప్రజా మద్దతుతో నానాటికీ బలీయమైన శక్తిగా ఎదుగుతున్న ఒక ప్రజాస్వామిక పార్టీని, దాని అధ్యక్షుడిని ఎలాగోలా అణచివేయడమే లక్ష్యంగా ఈ కుట్ర పక్కాగా అమలవుతోంది’’ అని ఆరోపించారు. 

సీబీఐ తప్పుడు ప్రచారం చేయకూడదని, కేసుకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాలపై ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలని ఆ సంస్థ మాన్యువల్‌లోనే స్పష్టంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ సీబీఐ అలా చేయకపోగా.. సాక్షిని అన్ని విధాలా అంతం చేయజూస్తున్న వ్యతిరేక పత్రికలు, చానళ్లకు అసత్యాల సరఫరాదారుగా మారిపోయిందంటూ మండిపడ్డారు. జగన్ కేసు కంటే ముందుగా సీబీఐ వ్యవహార శైలిమీదే దర్యాప్తు చేసి, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరముందని ఎమ్మెల్యేలన్నారు.

తొలి నుంచీ కుట్రే
జగన్‌పై ఆస్తుల కేసు తెర పైకి వచ్చిన తీరు, తర్వాత దానిపై సీబీఐ విచారణ జరుపుతున్న తీరు తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ‘‘జగన్‌ను వేధించేందుకే కాంగ్రెస్ తన ఎమ్మెల్యే శంకర్రావుతో హైకోర్టుకు లేఖ రాయించి సీబీఐ విచారణకు ఆదేశం తెచ్చుకుంది. అందుకు టీడీపీ కూడా జత కలిసింది. ఎంత చేసినా తాజా ఉప ఎన్నికల్లో టీడీపీ పత్తా లేకుండా కొట్టుకుపోయింది. కాంగ్రెస్ మాత్రం టీడీపీ మద్దతుతో చావు తప్పి కన్ను లొట్టపోయిన తీరులో రెండు స్థానాలతో బయట పడింది. జగన్‌ను ఓడించడం గానీ, అక్రమ కేసులతో లొంగదీసుకోవడం గానీ అసాధ్యమని దీనితో నిరూపణైంది’’ అని ఎమ్మెల్యేలు వివరించారు. 

అందుకే తెర వెనక శక్తులు నేరుగా జగన్‌కు భౌతికంగా హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని బలమైన అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అక్రమ అరెస్టు అనంతరం జగన్ భద్రతను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు సీబీఐ ఉద్దేశపూర్వకంగా గాలికొదిలిన వైనం, జడ్ కేటగిరీ భద్రత ఉన్న నేతను ఏ మాత్రం భద్రత లేని బస్సులో కోర్టుకు తీసుకెళ్లడం, వెళ్తున్న మార్గాన్ని ముందే మీడియాకు లీక్ చేయడం వంటి కుట్రలన్నీ ఇందుకు మరింతగా బలం చేకూరుస్తున్నాయన్నారు. 

నార్కో పరీక్షలు శాస్త్రీయం కావని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పినా, వాటితో ప్రాణహాని ఉండవచ్చని వైద్యులు కూడా ధ్రువీకరిస్తున్నా.. జగన్‌కు ఎలాగైనా నార్కో పరీక్షలు జరిపేందుకు సీబీఐ మొండిగా పట్టుబడుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వారన్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వ్యవహార శైలి, ఆయన ఫోన్ సంభాషణల తీరుతెన్నులతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయని వివరించారు. పైగా జగన్ కేసు విచారణను ఆయన ప్రారంభించిన తీరే ఓ ప్రొఫెషనల్ పోలీసు అధికారిలా కాకుండా ఏదో పాత కక్షలున్న ఫ్యాక్షనిస్టును తలపించేలా ఉందన్నారు.
Share this article :

0 comments: