ఇది ప్రజల విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది ప్రజల విజయం

ఇది ప్రజల విజయం

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

జగన్‌ను కలిసిన తర్వాత విజయమ్మ, షర్మిల వ్యాఖ్య
రాజన్న రాజ్యం రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు
జగన్‌ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికీ 
ఈ విజయం చెందుతుంది: వైఎస్ విజయమ్మ
జగన్ దోషి అంటూ విమర్శిస్తున్న అందరికీ ప్రజలు ఓట్ల ద్వారా సమాధానమిచ్చారు... మా పట్ల ఆదరణ చూపించిన 
ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటాం
జగన్‌ను కలిసిన తర్వాత చంచల్‌గూడ జైలు వద్ద విజయమ్మ, షర్మిల
కాంగ్రెస్, టీడీపీ కలిసి ప్రలోభాలు పెట్టాయి.. ఓటు వేస్తే రూ.3,000, వేయకుంటే రూ.2,000 ఇచ్చాయి
ఎన్నికల్లో ఏకమై జగన్ ఒక్కడినే టార్గెట్ చేశాయి.. అసెంబ్లీలో పటిష్టమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం
ఈ ఎన్నికలు రెఫరెండమే.. 2014లో ఇంతకంటే భారీ విజయం ఖాయం: షర్మిల
పిల్లి సుభాష్‌చంద్రబోస్, సురేఖ, ప్రసాదరాజు ఓడిపోవడంపట్ల జగనన్న బాధను వ్యక్తం చేశారు
జగన్ త్వరలోనే బయటకు వస్తారు.. ఓదార్పును కొనసాగిస్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజల విజయమని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం కావాలని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో.., జగనన్న నాయకత్వాన్ని ఎంత బలంగా విశ్వసిస్తున్నారో ఈ ఫలితాలు నిరూపించాయని అన్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వారిద్దరూ చంచల్‌గూడ జైలుకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం జైలు వద్ద, ఆతర్వాత ఇంటి వద్ద విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇది దేవుడిచ్చిన విజయం. ప్రజలు మెచ్చిన విజయం. జగన్‌బాబుకు దేవుడిచ్చిన బహుమానం’’ అని విజయమ్మ వ్యాఖ్యానించారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన సంక్షేమ పథకాలను ప్రజలు మరచిపోలేదని, పదిలంగా గుండెల్లో దాచుకున్నారని ఈ ఫలితాలు నిరూపించాయి. 

జగన్‌ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి ఈ విజయం చెందుతుంది. జగన్ దోషి అంటూ విమర్శిస్తున్న అందరికీ ప్రజలు ఓట్ల ద్వారా సమాధానమిచ్చారు. ప్రజల కోసం జగన్ చేసిన పోరాటం, దీక్షలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఎన్నికల్లో అండగా నిలిచారు. ప్రజలు మాకు న్యాయం చేశారు. జగన్‌బాబును నిర్దోషిగా ప్రజాకోర్టులో తీర్పునిచ్చారు. మా పట్ల ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని చెప్పారు. ‘‘ప్రజా కోర్టుకు వెళ్లి నేను ఏదైతే న్యాయం కోసం అడిగానో ప్రజలు ఆ న్యాయం ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. జగన్‌బాబుపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఈ విషయాలను నేను ప్రజా కోర్టులో చెప్పాను. దానికి ప్రజలు న్యాయమైన తీర్పునిచ్చారు. వైఎస్‌ఆర్ మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల ఆకాంక్షలను, ఆశలను నెరవేరుస్తుందని ఈ ఎన్నికల్లో ప్రజలు చెప్పారు. వైఎస్‌ఆర్ గారి సువర్ణయుగం జగన్ బాబు నేతృత్వంలోనే సాధ్యమని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా చెప్పారు’’ అని విజయమ్మ తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ను, టీడీపీని ప్రజలు నమ్మడంలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. ‘‘అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలే నైతిక హక్కును కోల్పోయింది. ఎందుకంటే.. ఆరోజు వైఎస్ రాజశేఖరరెడ్డిగారిని చూసే ప్రజలు ఓట్లు వేశారు. మళ్లీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విశ్వసనీయతతో ఓట్లేశారు. 

మా కుటుంబం 40 ఏళ్లుగా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం బతుకుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు 35 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నారు. జగన్‌బాబు కూడా రెండున్నరేళ్లుగా ప్రజల మధ్యన ఉండి కష్ట పడుతున్నారు. ఆయన ప్రజలపట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఆమోదించారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. జగన్ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు. టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై రకరకాల ప్రలోభాలు పెట్టాయి. ఓటు వేస్తే 3,000 రూపాయలు, వేయకుంటే 2,000 రూపాయలు ఇచ్చారు. రామచంద్రపురం, నరసాపురంలో టీడీపీకి 5 వేలు, ఆరు వేల ఓట్లు కూడా రాలేదు. ఈ రెండు పార్టీలూ ఏకమై జగన్ ఒక్కడినే టార్గెట్ చేసి ఎన్నికలు నడిపించాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా చూశారు’’ అని అన్నారు. ‘‘నేను ఈరోజు జగన్‌బాబును కలిసినప్పుడు ఆయన నాకొక మాట చెప్పారు. మనకు ఓట్లు వేసిన ప్రతి అవ్వా తాతకు, ప్రతి అక్కా చె ల్లెలుకు, ప్రతి అన్నా తమ్ముడికి, ప్రజలందరకీ కృతజ్ఞతలు తెలపమని చెప్పారు. ఆయన తరపున నేను వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. రైతులపక్షంగా, పేదలపక్షంగా నిలబడి పదవులు పోగొట్టుకుని ప్రజల ముందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను’’ అని అన్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షం దాని బాధ్యతలు నిర్వహించలేకపోతోందని అన్నారు. ఇకపై అన్ని ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుండి గట్టిగా పోరాడుతుందని తెలిపారు. అసెంబ్లీలో తమ పార్టీ పటిష్టమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, వై.వి.సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. విజయమ్మకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

జగనన్న సీఎం అవుతారు: షర్మిల

‘‘ఇది ప్రజల తీర్పు. దేవుడి తీర్పు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయం. జగనన్న సీఎం అవుతారని ఫలితాలు రుజువు చేశాయి’’ అని షర్మిల చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలు రెఫరెండమేనని, 2014 ఎన్నికల్లో ఇంతకంటే భారీ విజయం ఖాయమని తెలిపారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై, అధికార బలంతో పోలీసులను వాడుకొని, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినా వారికి ఫలితం దక్కలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడాన్ని ప్రజలు అంగీకరించలేదు. జగన్ నిర్దోషి అన్ని ప్రజలు నమ్మారు. రెండు సంవత్సరాలుగా జగనన్న ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు. అందుకే జగనన్నకు విజయం అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పమని జగనన్న చెప్పారు. ప్రతి అవ్వ, తాత, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు.. అందరికీ జగనన్న కృతజ్ఞతలు తెలిపారు. మా పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరూ మాకు ముఖ్యమే. పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, ప్రసాదరాజు ఓడిపోవడంపట్ల జగనన్న బాధను వ్యక్తం చేశారు’’ అని షర్మిల చెప్పారు. సానుభూతితోనే గెలిచారని, జగన్ తల్లి, చెల్లి కన్నీళ్లు కార్చడంవల్లే ప్రజలు ఓట్లేశారంటూ కొందరు చేస్తున్న వాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఓట్లు రాలేదని ఇప్పుడు ఏడ్వటంకంటే.. అప్పుడే కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా కన్నీళ్లు కార్చాల్సింది. ఎవరు వద్దన్నారు’’ అంటూ షర్మిల ఘాటైన సమాధానమిచ్చారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని, ఓదార్పును కొనసాగిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు.
Share this article :

0 comments: