‘కమలం’.. కకావికలం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘కమలం’.. కకావికలం

‘కమలం’.. కకావికలం

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

* డిపాజిట్ కూడా దక్కకపోవడంపై దిగాలు 
* ఓటమిపై కోర్‌కమిటీ పోస్టుమార్టం 
* టీ-జేఏసీ, టీఆర్‌ఎస్ దుష్ర్పచారమే కొంపముంచింది

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక పరకాలలో పైచేయి సాధించి తెలంగాణ చాంపియన్‌గా నిలవాలనుకున్న బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. డిపాజిట్ కూడా దక్కకపోవడంతో పార్టీ శ్రేణులు దిగాలు పడ్డాయి. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్న కమలనాథుల కలలు కల్లలు కావడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలలో మునిగిపోయారు. ఉపఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారమిక్కడ అత్యవసరంగా భేటీ అయిన కోర్ కమిటీ ఓటమికి కారణాలను విశ్లేషించే పనిలో పడింది. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై తలమునకలవుతోంది. పరకాలలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ జరిగినప్పుడే ఓటమిని శంకించినా కేవలం 9,162 ఓట్లతో నాలుగో స్థానంలో నిలుస్తామని ఊహించలేకపోయింది. 

ఈ విపత్కర పరిస్థితికి తెలంగాణ రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్ దుష్ర్పచారం కారణంగా భావిస్తోంది. జేఏసీని తటస్థంగా ఉంచాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో బీజేపీ అటు జేఏసీనీ ఇటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించినా వాటిని ప్రజలు విశ్వసించలేదని ఓట్లను బట్టి తేలిపోయింది. రాష్ట్రం మొత్తంమీద 11సీట్లకు పోటీ చేసినా పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ పరకాలలోనే మోహరింపజేసింది. పార్లమెంటులో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మొదలు ఎందరెందరో చోటామోటా నాయకుల్ని రప్పించింది. తెలంగాణ తమతోనే సాధ్యమని చెప్పే ప్రయత్నం చేసింది. ఓటర్లను ఆకట్టుకోవడంలో పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ పరిస్థితికి పరకాలకు ఏమాత్రం పొంతన లేదన్న సంగతిని గుర్తించినా నష్టనివారణ చర్యలు సకాలంలో చేపట్టలేకపోయింది. 

జాతీయ పార్టీతోనే తెలంగాణ వస్తుందన్న వాదనపై ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయామని విశ్లేషించింది. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినా తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఉన్న పట్టును ఓటర్లు తక్కువగానే అంచనా వేశారు. పరకాలలో మినహా మిగతా మండలాలలో ఓటర్లను కమలం పువ్వు ఆకర్షించలేకపోయింది. దీనికితోడు ఈ నియోజకవర్గంలోని యువకులు ప్రత్యేకించి మహిళల్లో అత్యధికులు అటు టీఆర్‌ఎస్‌నో ఇటు వైఎస్సార్ కాంగ్రెస్‌నో ఎంచుకోవడం గమనార్హం. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో టీడీపీ ఓట్లు తమకు పడతాయన్న ఆశలు కూడా నెరవేరలేదు. సంగెం, ఆత్మకూరు మండలాలలోనూ కమలం వెలవెలబోయింది.
Share this article :

0 comments: